iDreamPost

Bavagaru Bagunnara ? : అన్నీ కుదిరిన మెగా ఎంటర్ టైనర్ – Nostalgia

Bavagaru Bagunnara ? : అన్నీ కుదిరిన మెగా ఎంటర్ టైనర్ – Nostalgia

1995లో వరస డిజాస్టర్ల తర్వాత అంతర్మథనం చెందిన చిరంజీవి ఆ కారణంగానే 1996లో ఏ రిలీజు లేకుండా అభిమానులను నిరాశపరిచినా తన సబ్జెక్టు సెలక్షన్ ని సింహావలోకనం చేసుకోవడనికి టైం తీసుకున్నారు. దాని ఫలితమే హిట్లర్, మాస్టర్ రూపంలో రెండు బ్లాక్ బస్టర్లు దక్కాయి. స్వంత బ్యానర్ అంజనా ప్రొడక్షన్లో అప్పటిదాకా మూడు సినిమాలు వచ్చాయి. రుద్రవీణ పేరు తెచ్చింది కానీ ఫ్లాప్ అయ్యింది. త్రినేత్రుడు కమర్షియల్ గా ఓకే కానీ ఆశించిన రేంజ్ కు వెళ్ళలేదు. ముగ్గురు మొనగాళ్లు ఎంత హడావిడి చేసినా ఎబోవ్ యావరేజ్ గా నిలిచిందే తప్ప ట్రిపుల్ చిరులను ఒకేసారి తెరమీద చూస్తే రావాల్సిన రిజల్ట్ దక్కలేదు.

ఈసారి గురి తప్పకూడదనే ఉద్దేశంతో ఫ్యామిలీ ఎమోషన్స్ ప్లస్ కామెడీ ఉన్న కథను సిద్ధం చేసిన పరుచూరి బ్రదర్స్ తో చేయి కలిపారు నిర్మాత నాగబాబు. మొదటి సినిమా ప్రేమించుకుందాం రాతో సెన్సేషనల్ సూపర్ హిట్ అందుకున్న జయంత్ సి పరాంజీకి రెండో అవకాశమే మెగాస్టార్ ని డీల్ చేయాల్సి రావడంతో ఎట్టి పరిస్థితుల్లో దీన్ని గట్టిగా కొట్టాలన్న కసితో పని చేయడం ప్రారంభించారు. సూపర్ హీరోస్ తో పరిచయమై బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న సంగీత దర్శకుడు మణిశర్మకు బంపర్ ఆఫర్ తగిలింది. ఊహించని విధంగా ఆయన ట్రెండీ ఆల్బమ్ ని క్లాసు మాస్ ఇద్దరూ మెచ్చేలా అద్భుతంగా కంపోజ్ చేశారు. దత్తుకి ఛాయాగ్రహణ బాధ్యతలు అప్పగించారు.

హీరోయిన్ గా రంభ ఫిక్స్. కీలక పాత్రల్లో రచన, పరేష్ రావల్, జయప్రకాశ్ రెడ్డి, కోట, శ్రీహరి, షావుకారు జానకి తదితరులు ఎంపికయ్యారు. ఫస్ట్ హాఫ్ అధిక భాగం న్యూజిలాండ్ లో షూట్ చేశారు. రెండో సగం హీరోయిన్ ఉండే పల్లెటూరిలో సాగుతుంది. చిరు కాంబినేషన్ లో బ్రహ్మానందం, శ్రీహరిల సీన్లు ఓ రేంజ్ లో పేలి నవ్వులు పూయించాయి. వందల ఎత్తు అడుగు నుంచి చిరంజీవి సాహసోపేతంగా చేసిన బంగీ జంప్ టాక్ అఫ్ ది ఇండస్ట్రీ అండ్ ఫ్యాన్స్ అయ్యింది. హాయిగా నవ్వించి ఆల్ ఇన్ వన్ ఎంటర్ టైనర్ లా ఫైట్లు డాన్సులు అన్నీ కలగలసిన బావగారు బాగున్నారా 1998 ఏప్రిల్ 9న విడుదలై ఘనవిజయాన్ని అందుకుని 54 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. ఘరానా మొగుడు రిలీజ్ డేట్ సెంటిమెంట్ ని మరోసారి నిలబెట్టింది

Also Read : Agraham : యాంగ్రీ మ్యాన్ సంధించిన పవర్ ఫుల్ బుల్లెట్ – Nostalgia

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి