iDreamPost

వీడియో: దర్జాగా బ్యాంక్ దోపిడి.. 5 నిమిషాల్లో 14 లక్షలు చోరీ!

  • Author Soma Sekhar Published - 05:26 PM, Sat - 12 August 23
  • Author Soma Sekhar Published - 05:26 PM, Sat - 12 August 23
వీడియో: దర్జాగా బ్యాంక్ దోపిడి.. 5 నిమిషాల్లో 14 లక్షలు చోరీ!

ప్రస్తుత సమాజంలో ఈజీ మనీ కోసం దొంగతనాలకు పాల్పడుతున్నారు కొంతమంది. ఇలాంటి వారందరు ఓ ముఠాగా ఏర్పడి ప్రజలను బెదిరించి దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇక మరికొంత మంది ఎక్కువగా డబ్బు ఉంటుందని ఏకంగా బ్యాంకులకే ఎసరు పెడుతున్నారు. తాజాగా బ్యాంక్ సిబ్బందిని బెదిరించి కేవలం 5 నిమిషాల్లోనే రూ.14 లక్షలు దోచుకెళ్లిన సంఘటన సంచలనం రేపింది. ఈ చోరీకి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సూరత్ లోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్రాంచీలో దొంగలు రెచ్చిపోయారు. శుక్రవారం బ్యాంక్ తెరవగానే ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రెండు బైక్ లపై వచ్చిన దుండగులు తలకు హెల్మెట్ పెట్టుకుని సరాసరి బ్యాంక్ లోకి ప్రవేశించారు. ఈ తర్వాత తుపాకీలతో సిబ్బందిని, కస్టమర్లను బెదిరించి ఓ గదిలో వారిని బంధించారు. సిబ్బందిని బెదిరించి కౌంటర్లలోని డబ్బును తమ బ్యాగుల్లోకి నింపుకున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు పిల్లలతో ఓ మహిళ బ్యాంక్ లోకి రాగా.. ఆమెను కూడా బెదిరించి గదిలోకి తీసుకెళ్లారు. అనంతరం డబ్బు బ్యాగులతో దుండగులు పరారయ్యారు.

ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు బ్యాంక్ లోని సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దోపిడీ గురించి సమాచారం అందుకున్న పోలీసులు బ్యాంక్ కు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా.. దుండగులు రూ. 14 లక్షలను దోచుకెళ్లినట్లుగా సిబ్బంది పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక ఈ చోరీ కేవలం 5 నిమిషాల్లోనే జరగడం గమనార్హం. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


ఇదికూడా చదవండి: మరో అదిరిపోయే ఫీచర్.. ఒకే వాట్సాప్​లో రెండు వేర్వేరు అకౌంట్లు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి