iDreamPost

ఫైనల్లో టీమిండియాపై ఆసీస్‌ ఘనవిజయం! చెప్పింది చేసిన కమిన్స్‌

  • Published Nov 19, 2023 | 10:49 PMUpdated Nov 19, 2023 | 10:49 PM

వన్డే వరల్డ్ కప్‌ 2023 ఫైనల్లో టీమిండియాపై విజయం సాధించిన ఆస్ట్రేలియా ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. ఈ కప్పు విజయంతో ఆరోసారి వాళ్లు వన్డే వరల్డ్‌ కప్‌ సాధించారు. ఇది నిజంగా చరిత్రే. ఆస్ట్రేలియా దరిదాపుల్లో మరో జట్టు లేదు.

వన్డే వరల్డ్ కప్‌ 2023 ఫైనల్లో టీమిండియాపై విజయం సాధించిన ఆస్ట్రేలియా ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. ఈ కప్పు విజయంతో ఆరోసారి వాళ్లు వన్డే వరల్డ్‌ కప్‌ సాధించారు. ఇది నిజంగా చరిత్రే. ఆస్ట్రేలియా దరిదాపుల్లో మరో జట్టు లేదు.

  • Published Nov 19, 2023 | 10:49 PMUpdated Nov 19, 2023 | 10:49 PM
ఫైనల్లో టీమిండియాపై ఆసీస్‌ ఘనవిజయం! చెప్పింది చేసిన కమిన్స్‌

గుండె పగిలింది.. రోహిత్‌ శర్మ వరల్డ్‌ కప్‌ ఎత్తుతుంటే చూడాలని ఆశపడిన 140 కోట్ల హృదయాలు ముక్కలయ్యాయి. వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచి.. సగర్వంగా వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్‌కు చేరిన టీమిండియా.. తుది పోరులో చతికిలపడింది. దీంతో.. మూడోసారి విశ్వవిజేతగా నిలవాలన్న భారత జట్టు కల కల్లలైంది. ఫైనల్లో అద్భుతంగా ఆడిన ఆస్ట్రేలియా ఏకంగా ఆరోసారి వన్డే వరల్డ్‌ ఛాంపియన్‌గా అవతరించి చరిత్ర సృష్టించింది. అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్‌ స్టేడియంలో భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్‌ హోరాహోరీగా సాగినా.. చివరికి ఆస్ట్రేలియా పైచేయి సాధించి.. సునాయసంగానే గెలిచింది.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌.. తొలుత ఫీల్డింగ్‌ చేసేందుకు నిర్ణయించి.. టీమిండియాను మొదట బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. పిచ్‌ డ్రైగా ఉండి బ్యాటింగ్‌కు అంత అనుకూలంగా లేకపోయినా.. భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వేగంగానే ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టాడు. కానీ, మరో ఎండ్‌లో గిల్‌ తడబడుతూ ఆడి.. త్వరగానే అవుట్‌ అయ్యాడు. ఆ తర్వాత కోహ్లీతో కలిసి రోహిత్‌ శర్మ కొద్ది సేపు ఇన్నింగ్స్‌ను నడిపించి.. వేగంగా ఆడే క్రమంలో వికెట్‌ పారేసుకున్నాడు. ఆ వెంటనే శ్రేయస్‌ అయ్యర్‌ సైతం అవుట్‌ కావడంతో టీమిండియా కష్టాల్లో పడింది. దీంతో.. కోహ్లీ-కేఎల్‌ రాహుల్‌ ఇన్నింగ్స్‌ను నిలబెట్టే క్రమంలో స్లోగా ఆడాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ఆసీస్‌ బౌలర్లు మరింత కట్టుదిట్టంగా బౌలింగ్‌, ఫీల్డింగ్‌ చేయడంతో కోహ్లీ-రాహుల్‌.. సెట్‌ అయిన తర్వాత కూడా వేగంగా ఆడలేకపోయారు.

ఇక కోహ్లీ అవుటైన తర్వాత టీమిండియా ఇన్నింగ్స్‌ కుదేలైంది. కేఎల్‌ రాహుల్‌ పోరాటం కూడా ఎక్కువసేపు సాగలేదు. కోహ్లీ 54, రాహుల్‌ 66, రోహిత్‌ 47 రన్స్‌తో రాణించారు. గిల్‌, అయ్యర్‌, జడేజా, సూర్యకుమార్‌ యాదవ్‌ దారుణంగా విఫలం అయ్యారు. ఆసీస్‌ బౌలర్లలో స్టార్క్‌ 3, హేజల్‌వుడ్‌, కమిన్స్‌ 2, మ్యాక్స్‌వెల్‌, జంపా చెరో వికెట్‌ పడగొట్టారు. ఇక 241 పరుగులు స్కోర్‌ను ఛేదించేందుకు బరిలోకి దిగని ఆస్ట్రేలియాను టీమిండియా పేసర్లు.. బుమ్రా, షమీ ఆరంభంలో వణికించారు. స్టార్టింగ్‌లో పిచ్‌ను హెల్ప్‌ లభించడంతో.. వార్నర్‌, స్మిత్‌లతో పాటు మరో వికెట్‌ తీసి.. 47 రన్స్‌కే 3 వికెట్లు కూల్చి ఆశలు రేకెత్తించారు. కానీ, ఓపెనర్‌ ట్రావిస్‌ హెడ్‌, లబుషేన్‌ పోరాటం ముందు.. టీమిండియా బౌలింగ్‌ తేలిపోయింది. పైగా సెకండ్‌ ఇన్నింగ్స్‌లో డ్యూ రావడం, పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారడం కూడా ఆసీస్‌కు కలిసొచ్చింది.

మొత్తంగా టాస్‌ ఓడిపోవడం టీమిండియాను దారుణంగా దెబ్బతీసింది. ఒక వేళ టీమిండియా టాస్‌ గెలిచి, తొలుత ఫీల్డింగ్‌ చేసి ఉంటే.. కచ్చితంగా ఫలితం వేరేలా ఉండేది. అయితే.. ఈ ఫైనల్‌కి ముందు ఆస్ట్రేలియా కెప్టెన్‌ చెప్పినట్లే చేసి చూపించాడు. మ్యాచ్‌కి ముందు కమిన్స్‌ మాట్లాడుతూ.. లక్ష మందికి పైగా ప్రేక్షకుల ముందు మ్యాచ్‌ ఆడటం సంతోషంగా ఉంటుంది. కానీ, వారిని సైలెంట్‌గా ఉంచి గెలిస్తే ఇంకా మజా వస్తుందని చెప్పాడు. మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మంచి ప్రదర్శన చేస్తూ.. గెలుపుకు చేరువ అవుతున్న కొద్ది మ్యాచ్‌ చూసేందుకు వచ్చిన లక్ష మందికి పైగా ప్రేక్షకులు గమ్మన ఉండిపోయారు. విరాట్‌ కోహ్లీ వాళ్లను ఎంత ఎంకరేజ్‌ చేసినా.. నిరాశ వారిని ఆవహించింది. మరి ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి, ఆస్ట్రేలియా ప్రదర్శనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి