iDreamPost

అశ్వథ్థామ రివ్యూ

అశ్వథ్థామ రివ్యూ

చిన్న హీరోగా కెరీర్ మొదలుపెట్టి ఛలోతో ఊహించని రీతిలో బ్లాక్ బస్టర్ అందుకున్న యూత్ హీరో నాగ శౌర్య ఆ తర్వాత తన వయసుకు తగ్గ కథలు ఎంచుకోవడంలో చేసిన పొరపాట్ల వల్ల వరసగా అపజయాలు అందుకుంటూ వచ్చాడు. అందుకే కొంత గ్యాప్ తీసుకుని స్వంత బ్యానర్ మీద భారీ బడ్జెట్ తో అశ్వద్ధామను నిర్మించాడు. తనే స్వయంగా కథను అందించడమే కాక రమణతేజ అనే దర్శకుడిని పరిచయం చేస్తూ పెద్ద రిస్కే తీసుకున్నాడు. ఇప్పటికే ప్రమోషన్లో భాగంగా వదిలిన ట్రైలర్లు ప్రోమోలు ఇదో క్రైమ్ థ్రిల్లర్ అనే ఇంప్రెషన్ ని బాగానే క్రియేట్ చేశాయి. సంక్రాంతి హడావిడి పూర్తిగా తగ్గిపోయాక వస్తున్న అశ్వద్ధామ మీద ప్రేక్షకుల్లో ఓ మోస్తరు అంచనాలు అయితే ఉన్నాయి. మరి వాటిని అందుకునేలా అశ్వద్ధామ ఉన్నాడా లేదా రివ్యూలో చూద్దాం

కథ

వైజాగ్ లో ఒక గుర్తు తెలియని ముఠా అమ్మాయిలను కిడ్నాప్ చేస్తుంటుంది. చెల్లి ప్రియ పెళ్లి కోసం యుఎస్ నుంచి నగరానికి వస్తాడు గణా(నాగశౌర్య). వేడుక సంబరాల్లో ఉన్న వేళ అనూహ్యంగా తను గర్భవతి అని తేలడంతో గణా షాక్ తింటాడు. అయినా బావ(ప్రిన్స్)పెద్ద మనసుతో అర్థం చేసుకోవడంతో ప్రియ అత్తారింటికి వెళ్ళిపోతుంది. మరోపక్క సిటీలో ఇలాంటి తరహాలోనే అమ్మాయిల అపహరణలతో పాటు వాళ్ళ ఆత్మహత్యలు జరుగుతుంటాయి. తన చెల్లికి ఇలా ఎందుకు జరిగిందన్న కోణంలో అన్వేషణ మొదలుపెట్టిన గణా దీని వెనుక ఉన్న అసలు హంతకుడిని పట్టుకోవడం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తాడు. అసలు ఆ దుర్మార్గుడు ఎవరు, అమ్మాయిల పట్ల ఇంత దారుణంగా ప్రవర్తించడానికి కారణం ఏంటి, అతని దాకా గణా ఎలా వెళ్లగలిగాడు అనేదే అసలు స్టోరీ

ఎవరెలా చేశారు

నాగ శౌర్యలో మంచి నటుడున్న మాట వాస్తవం. అది ఊహలు గుసగుసలాడే నుంచే ప్రూవ్ అవుతూ వచ్చింది. తన స్టామినాను పూర్తిగా వాడుకున్న ఛలో చూసాకే యూత్ లో ఫాలోయింగ్ పెరిగింది. అయితే చక్కని ఏజ్ లో ఉన్న నాగశౌర్య తన వయసుకు ఇమేజ్ కు తగ్గట్టు సాఫ్ట్ సబ్జెక్ట్స్ కాకుండా ఇలాంటి సీరియస్ థీమ్ ని ఎంచుకోవడం ఆశ్చర్యకరం. బహుశా కొత్తగా చేయాలన్న ఆలోచనతో ఒక రియల్ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకుని తనే కథ రాసుకున్నాడు కాబోలు. గణాగా శౌర్య మిస్ మ్యాచ్ అవ్వలేదు. తనవరకు బెస్ట్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. చాలా మటుకు సక్సెస్ అయ్యాడు కూడా.

సిస్టర్ సెంటిమెంట్ తో ఉన్న ఎమోషనల్ సీన్స్ లోనూ, యాక్షన్ ఎపిసోడ్స్ లోనూ మంచి అవుట్ ఫుట్ ఇచ్చాడు. సాధారణంగా తమిళ హీరోలు చేసే ఇలాంటి కథలు ఎక్కువ పెర్ఫార్మన్స్ ని డిమాండ్ చేస్తాయి. నాగ శౌర్య ఇలాంటి కథను ఎంచుకోవడానికి ఇదే కారణం కావొచ్చు. ఒకరకంగా చెప్పాలంటే నర్తనశాలలాంటి చెత్త కథల కన్నా టాలెంట్ ని ఉపయోగించుకునే అశ్వద్ధామ లాంటి కథలు నాగశౌర్య లాంటి హీరోలకు మేలు చేసేవే. కాకపోతే అది ఏ స్థాయిలో ఉపయోగపడుతుందనేది దీని కమర్షియల్ సక్సెస్ మీద ఆధారపడి ఉంటుంది

హీరోయిన్ మెహ్రీన్ కు ఇది ఏ మాత్రం చెప్పుకోదగ్గ పాత్ర కాదు. నిజానికి కథ ఉన్న ఫ్లోకి తను అవసరం లేదు కూడా. కాకపోతే తెలుగు సినిమా సూత్రాల ప్రకారం ఉండాలి కాబట్టి ఇరికించారు కానీ అశ్వద్ధామ అసలు లక్ష్యం మొదలవగానే దర్శకుడు తనని పూర్తిగా తప్పించేశాడు. అక్కడక్కడ హీరోకి హెల్ప్ చేస్తుందంతే. విలన్ గా చేసిన నటుడి గురించి టీం మైంటైన్ చేసిన సస్పెన్స్ ఒకరకంగా మంచి ఫలితాన్నే ఇచ్చింది. ఇక్కడ రివీల్ చేయడం భావ్యం కాదు కాబట్టి వాళ్ళ ఉద్దేశాన్ని గౌరవిస్తూ పేరుని ప్రస్తావించడం లేదు. కానీ అతని నటనే రెండో సగాన్ని నిలబెట్టింది. ప్రయోగాలు చేసే ప్యాతాలజీ డాక్టర్ గా జీవించేశాడు. తాతగా చేసిన తమిళ నటుడు తన అనుభవాన్ని చూపించాడు. పోసాని, కాశి విశ్వనాధ్, ప్రిన్స్, పవిత్ర లోకేష్, సురేఖావాణి, సత్య అందరివీ చిన్న పాత్రలే. అమ్మాయిలను కిడ్నాప్ చేసే జాలర్ల గ్యాంగ్ గా నటించిన బ్యాచ్ కొంతమేర భయపెట్టారు.

దర్శకుడి గురించి

సాధారణంగా క్రైమ్ థ్రిల్లర్స్ హంతకుడిని చూపించకుండా నడిచే డ్రామాతో సాగుతాయి. వీలైనంత సేపు దాన్ని రివీల్ చేయకుండా ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేపడం ద్వారా ఇలాంటి సినిమాలు సక్సెస్ కావడం కాకపోవడం ఆధారపడి ఉంటుంది. కాకపోతే బిగిసడలని స్క్రీన్ ప్లే వీటికి చాలా ముఖ్యం. బెల్లంకొండ రాక్షసుడు ఆకట్టుకోవడానికి కారణం ఇదే. ఇదే టెంపోతో అశ్వద్ధామను నడిపించేందుకు కొత్త దర్శకుడు రమణతేజ చేసిన హోమ్ వర్క్ పూర్తి ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. విదేశాల్లో స్క్రీన్ ప్లే కోర్స్ చేసిన ఇతను నాగశౌర్య ఇచ్చిన కథను వీలైనంత ఇంటెన్సిటీ తో చెప్పాలని గట్టి ప్రయత్నమే చేశాడు. కాకపోతే ప్రధాన కథలో ట్విస్టులు ఎక్కువ లేకపోవడంతో సింగల్ లైన్ మీద సాగే క్రైమ్ ని సెకండ్ హాఫ్ లో చూపించాలనే ఉద్దేశంతో ఫస్ట్ హాఫ్ ని సోసోగా నడిపించడం అశ్వద్ధామని ముందుకు వెనక్కు లాగుతూ వెళ్ళింది.

దాని వల్లే అవసరానికి మించిన సెంటిమెంట్, లవ్ ట్రాక్ వచ్చి పడ్డాయి. వీటిని తగ్గించినా లేక తీసేసినా వచ్చే నష్టం లేదు కానీ సిస్టర్ ఎమోషన్ ని బలంగా రిజిస్టర్ చేయడం కోసం ఎక్కువ టైం తీసుకోవడం ఒకరకంగా అశ్వద్ధామ వేగానికి స్పీడ్ బ్రేకర్ లా అడ్డుపడింది. లేకపోతే థ్రిల్ లెవెల్స్ పెరిగి ఆసక్తి తగ్గకుండా అశ్వద్ధామ పరిగెత్తేవాడు. రమణతేజ కథను వీలైనంత స్పష్టంగా చెప్పేందుకే ప్రాధాన్యం ఇచ్చాడు. కాకపోతే మన ప్రేక్షకులకు అంతగా అలవాటు లేని డార్క్ క్రైమ్ జానర్ ని బోల్డ్ గా చూపించాలన్న ఆలోచనతో విలన్ చేసే అరాచకాన్ని మరీ ఓపెన్ గా చూపించడం ఇలాంటి వ్యవహారాలు అలవాటు లేని మనవాళ్లకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తాయి. విలన్ వెర్షన్ లో తాను ఎందుకు అమ్మాయిలను టార్గెట్ చేస్తున్నాడనే వెర్షన్ కన్విన్సింగ్ గానే ఉన్నప్పటికీ దానికి ఇంత స్పాన్ ఇవ్వాలా అనే ప్రశ్న తలెత్తుతుంది. అందులోనూ మలుపులు మరీ ఉత్కంఠభరితంగా లేకపోవడం కొంత మేర ప్రభావం చూపించినప్పటికీ హీరో విలన్ ని వెతికే క్రమాన్ని ఆసక్తికరంగానే మలచడంతో రెండో సగం మరీ బోర్ కొట్టించకుండా సాగుతుంది.

రమణతేజ పనితనమంతా సెకండ్ హాఫ్ లోనే కనిపిస్తుంది. కానీ ఈ సినిమా అందరికి కనెక్ట్ అయ్యే యునివర్సల్ జానర్ కాదు కాబట్టి థ్రిల్లర్ లవర్స్ ని ఎంత గొప్పగా మెప్పిస్తుందనే దాన్ని బట్టే సక్సెస్ రేంజ్ ఆధారపడి ఉంది. ప్రధాన క్రైమ్ కు లింక్ అయ్యే ఏదైనా ఉపకథలతో స్టోరీని ఇంకాస్త ఎలాబరేట్ చేసుంటే అశ్వద్ధామ బెస్ట్ ఛాయిస్ గా నిలిచేది కానీ అవసరం లేని నెరేషన్ తో చేజేతులా రమణతేజ ఆ అవకాశాన్ని జారవిడచుకున్నాడు. హీరో ఫ్యామిలీని ఎస్టాబ్లిష్ చేయడానికి అంత టైం తీసుకోవడం కేవలం కథ పలుచగా ఉన్న కారణమే. దీని మీద కాస్త ఎక్కువ ఫోకస్ పెట్టి కథ నడిచే తీరుని మార్చుకుని ఉంటే మంచి క్రైమ్ థ్రిల్లర్ గా అశ్వద్ధామ నిలిచేది. కానీ ఆ ఛాన్స్ పూర్తిగా వాడుకోలేదు

టీమ్ వర్క్ సంగతి

సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాలే అయినప్పటికీ అతన్ని కేవలం పాటలకే పరిమితం చేసి బ్యాక్ గ్రౌండ్ కోసం జిబ్రాన్ ను తీసుకోవడం అశ్వద్ధామకు బాగా ప్లస్ అయ్యింది. చాలా సీన్స్ ని తన స్కోర్ తో ఎలివేట్ చేశాడు జిబ్రాన్. అయినప్పటికీ అక్కడక్కడ రాక్షసుడు సౌండింగ్ వినపడుతుంది. కథలో ఉన్న సారూప్యత అతన్ని సైతం ప్రభావితం చేసింది కాబోలు. పాటలు మాత్రం సోసోనే. ఏదో అలా వచ్చి వెళ్లిపోతుంటాయి కానీ తర్వాత ఏవి గుర్తుండవు. మెచ్చుకోదగిన అంశాల్లో కీలకమైంది మనోజ్ రెడ్డి ఛాయాగ్రహణం. మూడ్ ని క్యారీ చేస్తూ అతను సెట్ చేసుకున్న ఫ్రేమింగ్ చాలా రిచ్ లుక్ వచ్చెనందుకు దోహదపడ్డాయి.

గ్యారీ ఎడిటింగ్ షార్ప్ గానే ఉన్నప్పటికీ ఇంకో పదిహేను నిముషాలు కుదించి రెండు గంటలకు లాక్ చేసుంటే ఇంకా బాగా ఎంగేజ్ అయ్యేది. పరశురాం సంభాషణలు పర్వాలేదనిపిస్తాయి . ఇలాంటి జానర్ కథలు డైలాగ్ బేస్డ్ ఉండవు కాబట్టి ఇంతకన్నా ఆశించడం కరెక్ట్ కాదు. నాగ శౌర్య స్వంత బ్యానర్ ఐరా నిర్మాణ విలువలు రాజీ పడలేదు. సబ్జెక్టుకు తగ్గట్టు ఖర్చు పెట్టేశారు

ప్లస్ గా అనిపించేవి

నాగ శౌర్య పెర్ఫార్మన్స్
జిబ్రాన్ బిజిఎం
ఇంటర్వల్ బ్యాంగ్
కొన్ని ట్విస్టులు
విలన్ ట్రాక్

మైనస్ గా తోచేవి

ఫస్ట్ హాఫ్
సింక్ అవ్వని సెంటిమెంట్
పాటలు
కథ చిన్నదైపోవడం
మెహ్రీన్

చివరిగా చెప్పాలంటే

క్రైమ్ కథలన్నీ తెరమీద చూసేందుకు సూటవ్వవు. కొన్ని చదివేందుకు బాగుంటాయి. అశ్వద్ధామ ఈ రెండింటి మధ్య ఆగిపోయి ఎటు వెళ్లాలో అర్థం కాక ప్రేక్షకుడిని సైతం అయోమయంలో పడేసి ఓ మాములు థ్రిల్లర్ గా మిగిలిపోయింది. కథనంలో కావాల్సిన వేగం లేని కారణంగా యుద్ధంలో అశ్వద్ధామ ఎలాంటి ప్రత్యేకత లేకుండా ఓ మాములు సైనికుడిగా నిలిచిపోయాడు.

ఒక్క మాటలో చెప్పాలంటే

అశ్వద్ధామ – తడబడిన అశ్వం పరుగు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి