iDreamPost

వివాదాలు కలెక్షన్లు కొల్లగొట్టిన రౌడీ – Nostalgia

వివాదాలు కలెక్షన్లు కొల్లగొట్టిన రౌడీ – Nostalgia

కొన్ని కథలు సినిమాలుగా మలిచే సమయంలో ఎదురుకునే సున్నితమైన పరిస్థితులు దర్శక నిర్మాతలకు పెను సవాళ్లుగా మారతాయి. వాటిని దాటుకుని మరీ ఘనవిజయం సాధించినప్పుడు కలిగే ఆనందమే వేరు. ఒక మంచి ఉదాహరణ చూద్దాం. 1990 సంవత్సరం ఆగస్ట్ 15న తమిళంలో పి వాసు దర్శకత్వంలో వచ్చిన ‘వేలైకిడైచుడుచు’ సూపర్ హిట్ అయ్యింది. సత్యరాజ్ కి హీరోగా మరింత బలమైన ఇమేజ్ రావడానికి ఇది పోషించిన పాత్ర చాలా కీలకం. సహజంగానే రీమేక్ రైట్స్ కోసం విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. సోలో హీరోగా అప్పుడే తన మార్కెట్ ని బలపరుచుకుంటున్న మోహన్ బాబుకు ఇదో మంచి అవకాశంగా అనిపించి వెంటనే హక్కులను కొనేశారు.

దర్శకత్వం వహించేందుకు బి గోపాల్ ని ఒప్పించారు. లారీ డ్రైవర్, బొబ్బిలిరాజా ఇలా వరస బ్లాక్ బస్టర్లతో ఆయన మంచి ఊపు మీదున్న సమయం. తక్కువ టైంలో పూర్తి చేసే మాట మీద సరే అన్నారు. పరుచూరి బ్రదర్స్ కేవలం రెండు రోజుల్లో దీనికి డైలాగులు రాసేయడం అప్పట్లో రికార్డుగా చెప్పుకునేవారు. ‘మంగమ్మ గారి మనవడు’తో సెకండ్ ఇన్నింగ్స్ ని గ్రాండ్ గా కొనసాగిస్తున్న మామ కెవి మహదేవన్ గారికి స్వరాలు సమకూర్చే బాధ్యత ఇచ్చారు. ‘అల్లుడుగారు’కి ఆయన మ్యూజిక్ ఎంత ప్లస్ అయ్యిందో మోహన్ బాబుకి గుర్తే. హీరోయిన్ గా దివ్యభారతి తప్ప వేరే ఆప్షన్ పెట్టుకోలేదు గోపాల్. కేవలం 41 రోజుల్లో షూటింగ్ ఫినిష్ చేశారు.

ఊరిలో జులాయిగా తిరిగే ఓ కుర్రాడు స్థానిక గూండాను ఎదిరించే క్రమంలో హత్య కేసులో ఇరుక్కుని జైలు నుంచే ఎంఎల్ఏగా పోటీ చేసి గెలిచి బయటికి రావడమనే పాయింట్ జనానికి బ్రహ్మాండంగా నచ్చింది. హీరోయిజం, రొమాన్స్, యాక్షన్, మాస్ మసాలా అన్ని పర్ఫెక్ట్ గా కుదిరాయి. దెబ్బకు 1991 మార్చి 22 విడుదలైన అసెంబ్లీ రౌడీ నీరాజనం అందుకుంది. అందమైన వెన్నెలలోనా పాట రాష్ట్రం నలుమూలల మారుమ్రోగింది. మోహన్ బాబు పంచు డైలాగులు ఓ రేంజ్ లో పేలాయి. రిలీజ్ కు ముందు టైటిల్ మీద వివాదం రేగింది. అప్పటి స్పీకర్ ధర్మారావు సినిమా చూశాక ఓకే అన్నారు. శాసనసభలో ఒక సినిమా గురించి మూడు రోజులు చర్చ జరగడం అప్పట్లో విశేషం. స్వర్గం నరకంలో హీరో హీరోయిన్లుగా నటించిన మోహన్ బాబు అన్నపూర్ణ ఇందులో తల్లికొడుకులుగా నటించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి