iDreamPost
android-app
ios-app

ఆసియా కప్ 2023 షెడ్యూల్ రిలీజ్! భారత్, పాక్ తలపడేది ఆ రోజే!

  • Author singhj Updated - 05:05 PM, Wed - 19 July 23
  • Author singhj Updated - 05:05 PM, Wed - 19 July 23
ఆసియా కప్ 2023 షెడ్యూల్ రిలీజ్! భారత్, పాక్ తలపడేది ఆ రోజే!

ప్రతిష్టాత్మకమైన ఆసియా కప్ టోర్నీకి అంతా సిద్ధమవుతోంది. ఈ టోర్నీ నిర్వహణపై ఎన్నో చర్చోపచర్చలు, వాదోపవాదాలు జరిగిన విషయం తెలిసిందే. భారత్, పాకిస్థాన్ క్రికెట్ బోర్డుల నడుమ గత ఏడెనిమిది నెలలుగా అలకలు, అవమానాలు, బెదిరింపులు, బహిష్కరణ హెచ్చరికలు నడిచాయి. ఎట్టకేలకు ఈ టోర్నీలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఆసియా కప్-2023 షెడ్యూల్ వచ్చేసింది. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు జరగనున్న ఈ టోర్నీ షెడ్యూల్​ను తాజాగా ప్రకటించారు. పాకిస్థాన్​తో పాటు శ్రీలంక కూడా ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా టోర్నీకి కౌంట్​డౌన్ మొదలైంది.

పాకిస్థాన్​ వర్సెస్ నేపాల్ మధ్య ఆగస్టు 30వ తేదీన జరిగే ఫస్ట్ మ్యాచ్​తో ఆసియా కప్​కు తెరలేవనుంది. ఈ మ్యాచ్​కు పాక్​లోని ముల్తాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. టోర్నీ మొత్తంలో ఫైనల్​తో కలుపుకొని 13 మ్యాచ్​లు జరగనున్నాయి. ఇందులో 4 మ్యాచ్​లకు పాక్ ఆతిథ్యం ఇవ్వనుంది. సూపర్-4, ఫైనల్ సహా మిగిలిన అన్ని మ్యాచ్​లు శ్రీలంకలోనే జరగనున్నాయి. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో భారత్ తన తొలి మ్యాచ్​లో దాయాది పాకిస్థాన్​తో తలపడనుంది. లంకలోని క్యాండీ వేదికగా సెప్టెంబర్ 2న జరిగే ఈ మ్యాచ్​ టోర్నీలోనే హైలెట్​గా నిలవనుంది. దీని కోసం ఇరు దేశాల క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

రౌండ్​-1లో పాక్​తో మ్యాచ్​ తర్వాత నేపాల్​తో భారత్ తలపడనుంది. రౌండ్-1 ఫలితాలను బట్టి సూపర్-4కు చేరుకునే టీమ్స్ ఏవో తేలుతుంది. సూపర్-4లో ఒక్కో జట్టు మిగిలిన టీమ్​తో ఒక్కో మ్యాచ్​లో ఆడుతుంది. ఇందులో టాప్​-2లో నిలిచిన టీమ్స్ సెప్టెంబర్ 17న జరిగే ఫైనల్స్​లో కప్ కోసం తలపడతాయి. ఒకవేళ భారత్, పాకిస్థాన్​లు సూపర్-4తో పాటు ఫైనల్స్​కు కూడా అర్హత సాధిస్తే ఇరు జట్ల మధ్య టోర్నీలో మూడు మ్యాచ్​లు చూసే ఛాన్స్ ఫ్యాన్స్​కు దొరుకుతుంది. ఇకపోతే, గత ఆసియా కప్​ సూపర్​-4లో పాక్ చేతిలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని భారత్ భావిస్తోంది. అదే టైమ్​లో ఇండియాను మరోమారు ఓడించాలని దాయాది కలలు కంటోంది.