iDreamPost

బొత్స అన్న మాటలు నిజం కానున్నాయా ??

బొత్స అన్న మాటలు నిజం కానున్నాయా ??

రాష్ట్ర ప్రయోజనాలకోసం.. రాష్ట్రానికి మంచి జరుగుతుంది అనుకుంటే తమ పార్టీ కేంద్ర ప్రభుత్వంలో చేరడానికి సిద్ధమంటూ శుక్రవారం విశాఖపట్నంలో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో దీనిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఆయన మాట్లాడుతూ తాము బిజెపి తో అంటిపెట్టుకొని లేమని.. అలాగని దూరంగానూ లేమని.. అనవసరంగా బిజెపితో ఘర్షణ పడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఎన్డీయే లో చేరమని ప్రతిపాదన వస్తే తమ నాయకుడు తప్పకుండా పరిశీలిస్తారని బొత్సా సత్యనారాయణ స్పష్టం చేశారు. రాష్ట్రానికి ఏది మేలు అనుకుంటే అది చేయడానికి మా నాయకుడు సిద్దమేనని తెలిపారు.

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చేరబోతోందని, ఈ క్రమంలోనే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్, బీజేపీ పెద్దల మధ్య చర్చలు సాగుతున్నాయని ఇటీవల కాలంలో ఢిల్లీ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. దీనిలో భాగంగానే బుధవారం వైఎస్‌ జగన్‌ ప్రధాని మోదీతో దాదాపు గంటన్నర పాటు సమావేశమైన సందర్భంగా జగన్ ని తమ ప్రభుత్వంలో చేరాల్సిందిగా మోడీ ఆహ్వానించారని, దానిపై అమిత్ షా తో కలసి చర్చించమని జగన్ కు సూచించారని దేశ రాజధానిలో జోరుగా ప్రచారం జరుగుతుంది.

తాజాగా శుక్రవారం సాయంత్రం కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ మాజీ అధ్యక్షుడు అమిత్‌ షాతో వైఎస్‌ జగన్‌ భేటీ అయిన నేపథ్యంలో, ఈ ఊహాగానాలకు బలం చేకూర్చేవిధంగా, జగన్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న మంత్రి బొత్సా సత్యనారాయణ వంటి వారు ఈ వ్యాఖ్యలు చెయ్యడం చూస్తుంటే, పైకి ప్రజాప్రయోజనాల దృష్ట్యా అని చెప్తున్నప్పటికీ… ఒకరితో మరొకరికున్నా పరస్పర రాజకీయ అవసరాల దృష్యా త్వరలోనే బీజేపీ, వైఎస్సార్‌సీపీ మధ్య కొత్త పొత్తులు, మిత్రత్వాలు ఏర్పడబోతున్నాయని సమాచారం.

ఒక పక్క కేంద్ర ప్రభుత్వం మద్ధతు ఉంటే రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చెయ్యడంతో పాటు, రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుగుతున్న సంక్షేమ పధకాలకు నిధుల కొరత ఉండదని ఏపీలో అధికార పక్షం భావిస్తోంది. మరోవైపు రాజ్యసభలో బలం లేమితో కీలక బిల్లులు పాస్‌ చేయించుకోవడంలో బీజేపీ శక్తుయుక్తులను కూడగట్టుకోవాల్సి వస్తోంది. మిత్రపక్షమైన శివసేన ఇప్పటికే దూరం కాగా, బీహార్‌లో జేడీయూ కూడా అదే బాటలో ఉన్నట్లుగా సంకేతాలు వెలువడుతున్నాయి.

ఈ క్రమంలో త్వరలో మరికొన్ని రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ కూడా బిజెపి కి అనుకూలమైన వాతావరణం కనపడకపోవడంతో, రాజ్యసభలో ఇప్పటికే అత్యధికంగా 85 స్థానాలున్న బీజేపీకి, ఇటీవల కాలంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాలు తమ చేయి జారడంతో, రాబోయే రెండు మూడేళ్ళలో రాజ్యసభలో బిజెపి బలం మరింతగా తగ్గిపోనుంది.

ఈ నేపథ్యంలో రాజ్యసభలో ప్రభుత్వం కీలక బిల్లులను ఆమోదించుకోవాలంటే బిజెపి కి కనీసం 120 మంది రాజ్యసభ సభ్యుల మద్దతు అవసరం. ఈ రాజకీయ కారణాల వలనే బిజెపికి కొత్త మిత్రులు అవసరం పడుతోంది. ఈ ఏప్రిల్ లో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కనీసం 4-5 రాజ్యసభ స్థానాలు దక్కనున్న దృష్యా ఇప్పుడు బిజెపి-వైసిపి ఇరు పార్టీలు రాష్ట్ర, దేశ ప్రయోజనాల కోసం పొత్తుపెట్టుకోవాలని నిర్ణయానికొచ్చినట్లు ఢిల్లీలో జోరుగా చర్చ జరుగుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి