iDreamPost

నిమ్మగడ్డకు షాక్‌ ఇచ్చే యోచనలో ఏపీ ఉద్యోగులు..!

నిమ్మగడ్డకు షాక్‌ ఇచ్చే యోచనలో ఏపీ ఉద్యోగులు..!

ఓ వైపు కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతూ వందల సంఖ్యలో కేసులు నమోదువుతున్నా.., స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు ఏపీ ఉద్యోగ సంఘాలు షాక్‌ ఇచ్చే యోచనలో ఉన్నాయి. ప్రస్తుత కరోనా సమయంలో ప్రజలు, అధికారుల రక్షణ దృష్ట్యా ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం చెప్పినా.. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలంటూ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ తరచూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖలు రాస్తున్నారు. కోర్టు తీర్పు కాపీలు చూపిస్తున్నారు. గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలిసి తన ప్రయాత్నాలను కొనసాగిస్తున్నారు. ఎన్నికలకు సహకరించడంలేదంటూ హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసేందుకు నిమ్మగడ్డ యోచిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.

మార్చి 31వ తేదీన నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఉద్యోగ విమరణ చేయబోతున్నారు. ఈ లోపు ఎన్నికలు నిర్వహించాలనే యోచనలో నిమ్మగడ్డ ఉన్నట్లు ఆయన చర్యల ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. అయితే నిమ్మగడ్డ ప్రయత్నాలకు ఏపీ ఉద్యోగ సంఘాలు చెక్‌ పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. కరోనా వ్యాప్తి, సెకండ్‌ వేవ్‌ ఉంటుందన్న హెచ్చరికల నేపథ్యంలో ఎన్నికలు నిర్వహణను ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్రంలో ఒకటి, రెండు కరోనా కేసులు ఉన్నప్పుడు వాటిని కారణంగా చూపుతూ ఎన్నికలను వాయిదా వేసిన నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌.. ప్రస్తుతం వైరస్‌ వ్యాప్తి కొనసాగుతున్న తరుణంలో ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించొద్దని అవసరమైతే కోర్టులకు వెళతామని ఏపీ ఎన్‌జీవోల సంఘం అధ్యక్షుడు ఎస్‌.చంద్రశేఖర్‌ రెడ్డి స్పష్టం చేశారు.

స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేంది ఎన్నికల కమిషనర్‌ అయినా.. క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించాల్సిన బాధ్యత ఉద్యోగులదే. అందులోనూ పోలీస్, రెవెన్యూ, ఉపాధ్యాయ, ఇతర ఉద్యోగులదే ఎన్నికల్లో కీలక పాత్ర. ఓటరు స్లిప్పుల పంపిణీ నుంచి, పోలింగ్, కౌంటింగ్‌ వరకూ అన్ని పనులు ఉద్యోగులే చేయాలి. స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్‌ పద్ధతిలో నిర్వహించాల్సిన తరుణంలో బ్యాలెట్‌ వల్ల కోవిడ్‌ ముప్పు అధికంగా ఉంటుందే హెచ్చరికలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలకు వెళితే.. తమ ప్రాణాలకు ముప్పు వాటిళ్లితే ఎవరు బాధ్యత వహిస్తారని కూడా ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగుల ఆందోళన కూడా న్యాయబద్ధంగా ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కోర్టుల్లో కూడా తమ వాదనకు మద్ధతు లభిస్తుందని ఉద్యోగుల ధీమాగా ఉన్నారు. కరోనాపై ఉద్యోగుల్లో నెలకొన్న ఆందోళన.. ఎన్నికలు నిర్వహించాలనుకునే నిమ్మగడ్డ ప్రయత్నాలకు గండికొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి