iDreamPost

అబ్బురపరిచిన అపరిచితుడు – Nostalgia

అబ్బురపరిచిన అపరిచితుడు  – Nostalgia

సామాజిక సమస్యల మీద స్టార్ హీరోలతో కమర్షియల్ సినిమాలు తీసి మెప్పించడం చాలా కష్టం. కానీ బడ్జెట్ కు వెనుకాడకుండా దర్శకుడికి తగిన స్వేచ్ఛ ఇస్తే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో శంకర్ జెంటిల్ మెన్, భారతీయుడు, ఒకే ఒక్కడు ద్వారా నిరూపించారు. అలా అని ఒక ఫార్ములా ప్రకారం రొటీన్ గా ఎప్పుడూ తీయకపోవడమే శంకర్ ప్రత్యేకత. బాయ్స్ షూటింగ్ జరుగుతున్న టైంలో ఆయన మనసులో రోబో కథ బలంగా తిరుగుతోంది. కానీ అన్ని కోట్లు పొసే నిర్మాత అప్పటికప్పుడు దొరికే పరిస్థితి లేదు. అందుకే రచయిత సుజాత ఇచ్చిన అన్నియన్ ని తీస్తే ఎలా ఉంటుందన్న ప్రతిపాదనతో ఆస్కార్ ఫిలిమ్స్ రవిచంద్రన్ ని కలిశాడు శంకర్. అందులో హీరోకు మల్టిఫుల్ పర్సనాలిటీ డిజార్డర్ వ్యాధిని పెట్టడం నిర్మాతను బాగా ఆకట్టుకుంది.

2003 సంవత్సరం ద్వితీయార్థంలో దీనికి సంబంధించి విపరీతమైన చర్చలు జరిగాయి. ముందు రజినీకాంత్ ను అనుకున్నారు. ఆయన నో చెప్పారు. తర్వాత కమల్ ని ట్రై చేశారు. కానీ ఆ టైంలో ఆయన విపరీతమైన బిజీ. దీంతో అవకాశం కాస్తా విక్రమ్ ని వరించింది. రామం – రెమో – అపరిచితుడు అనే మూడు పాత్రలను ట్రిపుల్ రోల్ చేయకుండా ఎలా మెప్పించాలనే దాని మీద విక్రమ్ తీవ్రమైన కసరత్తు చేశాడు. మొదటిసారి శంకర్ సినిమాకు ఏఆర్ రెహమాన్ బదులు హారీస్ జైరాజ్ సంగీతం కార్డు పడింది. హీరోయిన్ గా ఐశ్వర్య రాయ్ ని అనుకుంటే డేట్ల సమస్య వల్ల ఆ అదృష్టం కాస్తా జయంతో సంచలనం అందుకున్న సదాను వరించింది.

అలా 2004 మార్చి మొదటివారం అన్నియన్ షూటింగ్ మొదలయ్యింది. ఆరు నెలలు అనుకుంటే ఏకంగా ఏడాది దాటింది. కెమెరామెన్ గా ఉన్న మణికందన్ నుంచి ఛాయాగ్రహణం బాధ్యతలు రవివర్మన్ కు వెళ్లాయి. విక్రమ్ వర్ణించలేనంత శారీరక శ్రమ తీసుకున్నాడు. క్లైమాక్స్ తీస్తున్నప్పుడు స్పాట్ లో ఉన్న యూనిట్ సభ్యులు అతని యాక్టింగ్ కి సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. తెలుగు డబ్బింగ్ హక్కులు ఏకంగా 7 కోట్లకు అమ్ముడుపోవడం అప్పట్లో రికార్డు. 2005 జూన్ 17న తెలుగులో అపరిచితుడుగా తమిళంతో పాటు రిలీజైన ఈ మూవీ భారీ వసూళ్లతో అదరగొట్టింది. వియాత్నం నుంచి పిలిపించిన 125 మార్షల్ ఎక్స్ పర్ట్స్ తో తీసిన ఫైట్, నిజంగానే షూట్ చేసిన త్యాగరాజ మహోత్సవాలు, గ్రాఫిక్స్ ఇలా ఎన్నో అపరిచితుడిని అబ్బురపడుతూ చూసేలా చేశాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి