iDreamPost

ఆ ఇళ్ళే జ‌గ‌న్ కి పెట్ట‌ని కోట‌ల‌వుతాయి

ఆ ఇళ్ళే జ‌గ‌న్ కి పెట్ట‌ని కోట‌ల‌వుతాయి

ప్ర‌తీ మ‌నిషికి తిండి, బ‌ట్ట‌లు, నివాసం ఏర్పాటు చేసుకోవాల‌ని ఎన్నాళ్లుగానో ఆశిస్తున్నారు. ఎన్నో ప్ర‌భుత్వాలు వ‌స్తూ, పోతూ ఉన్నా అది ఆచ‌ర‌ణ రూపం దాల్చ‌లేదు. దాంతో ఖాళీ జాగా కోసం పెద్ద పెద్ద జ‌గ‌డాలే జ‌రిగాయి. ఇళ్ల స్థ‌లాల కోసం జ‌రిగిన ఉద్య‌మాల్లో పేద‌లు ప్రాణాలు కూడా కోల్పోయారు. అంద‌రికీ ఇళ్లు అనేవి నినాదంగా మిగల‌డంతో సామాన్యుల్లో నిరాశ పెరిగింది. రియ‌ల్ ఎస్ట‌ట్ బూమ్ వ‌చ్చిన త‌ర్వాత దిగువ మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లే ఇంటి స‌దుపాయం కోసం విల‌విల్లాడాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. ఇక సామాన్యుడికి అది పూర్తిగా క‌ల‌గా మిగిలిపోవ‌డ‌మేనా అనే అభిప్రాయం క‌లిగింది.

అలాంటి స‌మ‌యంలో వైఎస్ జ‌గ‌న్ సంచ‌లనానికి తెర‌లేపుతున్నారు. అనేక స‌మ‌స్య‌లు ఉన్నా చేధిస్తామ‌ని చెబుతున్నారు. గ‌తంలో వైఎస్సార్ హ‌యంలో ఇందిర‌మ్మ ఇళ్లు పేరుతో పేద‌వాడికి సొంతింటి క‌ల తీర్చే ప్ర‌య‌త్నం జ‌రిగింది. కానీ అది కూడా అంద‌రికీ ఇళ్లు అనే నిన‌దాన్ని వాస్త‌వ రూపంలోకి తీసుకురాలేక‌పోయింది. వైఎస్సార్ ఒక్క అడుగు వేస్తే తాను మ‌రో అడుగు వేస్తాన‌ని ముందుగా చెప్పిన‌ట్టుగా జ‌గ‌న్ ఇళ్ల స్థ‌లాల విష‌యంలో స‌మూల మార్పుల‌కు సిద్ధ‌మ‌య్యారు. ఏపీలో ఇళ్లు లేని పేద‌లు ఉండ‌కూడ‌ద‌నే సంక‌ల్పం తీసుకున్నారు. అది కూడా ఎన్నిక‌ల ముంగిట ఆఖ‌రి సంవ‌త్స‌రంలో కాకుండా తొలి ఏడాదిలోనే చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

ఉగాది కి 25ల‌క్షల మందికి ఇళ్ల ప‌ట్టాల పంపిణీ కార్య‌క్ర‌మం దేశ‌మంతా ఓ చ‌రిత్ర‌గా మార‌బోతోంది. దానికి ప్ర‌ధాని మోడీని కూడా సీఎం ఆహ్వానించారు. అయితే మోడీ రాక ఖ‌రార‌య్యే అవ‌కాశాలు లేవు. కానీ జ‌గ‌న్ ప్ర‌భుత్వం నిర్ణ‌యానికి అనుగుణంగా 25ల‌క్ష‌ల మందికి ఇళ్ల స్థ‌లాల పంపిణీ జ‌రిగితే రాబోయే ద‌శాబ్ద‌కాలం పాటు రాష్ట్రంలో ఇళ్లులేని పేద‌లు క‌నిపించే అవ‌కాశం లేదు. ఇప్ప‌టి వ‌ర‌కూ ప్ర‌భుత్వం తీస్తున్న లెక్క‌ల ప్ర‌కారం అర్హుల సంఖ్య 22 ల‌క్ష‌ల వ‌ర‌కూ ఉంది. ఇంకా జాబితాలోకి రాని మ‌రో 2,3ల‌క్ష‌ల మందిని చేర్చినా 25ల‌క్ష‌ల మందికి అనుగుణంగా స్థ‌లాల సేక‌ర‌ణే అస‌లైన స‌వాల్. ఇప్ప‌టికే మూడు నెల‌లుగా రెవెన్యూ యంత్రాంగం మొత్తం క‌స‌ర‌త్తులు చేస్తోంది. కానీ తీరా ఇప్పుడు రంగంలో దిగిన త‌ర్వాత ప‌లు ఆటంకాలు ఎదురవుతున్నాయి. భూమికోసం చేస్తున్న య‌త్నాల‌తో రైతుల నుంచి ప్ర‌తిఘ‌ట‌న వ‌స్తోంది. తాజాగా కృష్ణా జిల్లాలో వ‌న‌జాక్షి ఎపిసోడ్ అందులో భాగ‌మే.

అయినా పేద‌ల‌కు స్థ‌లాల పంపిణీ విష‌యంలో ప్ర‌భుత్వం ప‌ట్టుద‌ల ఆస‌క్తిగా క‌నిపిస్తోంది. నిజంగా జ‌గ‌న్ ఆశించిన‌ట్టు జ‌రిగితే రాజ‌కీయంగా అన్నింటికన్నా పెద్ద ఎచీవ్ మెంట్ అవుతుంది. దేశానికే మోడ‌ల్ గా నిలుస్తుంది. వైఎస్సార్సీపీని తిరుగులేని శ‌క్తిగా నిల‌బెడుతుంది. గ‌తంలో ఇందిర‌మ్మ స్కీమ్ వైఎస్సార్ రెండోసారి గెల‌వడానికి దోహ‌ద‌ప‌డిన వాటిలో ఒక‌టి. ఇప్పుడు జ‌గ‌న్ కూడా 25ల‌క్ష‌ల ఇళ్ల నిర్మాణంలో విజ‌య‌వంతం అయితే ఆ ఇళ్ల‌న్నీ జ‌గ‌న్ కి పెట్ట‌ని కోట‌ల‌వుతాయి. పేద‌లంతా సుదీర్ఘ‌క‌ల నెర‌వేరిన నేప‌థ్యంలో ప్ర‌భుత్వానికి బాస‌ట‌గా నిలవ‌డం ఖాయం. అది రాజ‌కీయంగా బ‌ల‌ప‌డేందుకు దోహ‌ద‌ప‌డుతుంది. మ‌రో నాలుగేళ్ళ పాటు అధికారంలో ఉండ‌బోతున్న నేప‌థ్యంలో రుణాల ద్వారా ఇంటి నిర్మాణాలు పూర్త‌యితే ఏపీ ప్ర‌భుత్వం కొత్త చ‌రిత్ర సృష్టించిన‌ట్ట‌వుతుందన‌డంలో సందేహం లేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి