iDreamPost

ఢిల్లీలో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు…

ఢిల్లీలో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు…

ఇటలీలో విద్యను అభ్యసించడానికి వెళ్లి ఇటలీని కరోనా వైరస్ కుదిపేస్తున్న నేపథ్యంలో స్వదేశానికి తిరిగి వచ్చిన తెలుగు విద్యార్థులు ఢిల్లీలో చిక్కుకుపోయారు. గత 26 రోజులుగా ఢిల్లీలోని ఐటీబీపీ క్వార్టర్స్ లో క్వారెంటయిన్ పేరిట కాలం వెళ్లదీస్తున్న వారి గోడును పట్టించుకునేవారు లేక అక్కడే మగ్గుతున్నారు..

ఉన్నత విద్య కోసం ఇటలీ వెళ్లిన 214 మంది భారత విద్యార్థులు ప్రత్యేక విమానంలో స్వదేశానికి తిరిగి వచ్చారు.. 14 రోజులు క్వారెంటయిన్ లో గడిపిన తర్వాత పంజాబ్,హర్యానా, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు తమ విద్యార్థులను ప్రత్యేక బస్సుల్లో తమ రాష్ట్రాలకు తరలించాయి.. కానీ తెలుగు విద్యార్థులను తరలింపును రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టలేదు..

మొత్తం 82 మంది తెలుగువారు ఇటలీ నుండి తిరిగిరాగా క్వారెంటయిన్ లో నిర్వహించిన పరీక్షల్లో అందరికి కరోనా నెగెటివ్ అని తేలింది..కాగా తెలంగాణ ప్రభుత్వం తమ విద్యార్థులను ప్రత్యేక విమానంలో కానీ, బస్సుల్లో కానీ రాష్ట్రానికి తరలిస్తామని వెల్లడించింది.. కానీ ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం స్పందించలేదు..ఆంధ్రప్రదేశ్ కి చెందిన 33 మంది విద్యార్థులు తమను స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేయమని కోరగా క్లియరెన్స్ లెటర్ ఇస్తే పంపిస్తామని ఆర్మీ అధికారులు స్పష్టం చేశారు..

ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ అధికారుల నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో విద్యార్థులు తమ గోడును ఎవరికి చెప్పుకోవాలో తెలియక తల్లడిల్లిపోతున్నారు. ఈ నెల 16 వరకూ ఢిల్లీలోనే ఉండాలని ఏపీభవన్ అధికారులు చెబుతున్నారని విద్యార్థులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరగా స్పందించి తమను స్వస్థలాలకు పంపించే ఏర్పాట్లు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విద్యార్థులు విజ్ఞప్తి చేస్తున్నారు..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి