iDreamPost

రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం వెనుక మర్మమేంటి..?

రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం వెనుక మర్మమేంటి..?

ఆంధ్రప్రదేశ్‌ లో మరోసారి స్థానిక ఎన్నికల వ్యవహారం చర్చకు దారితీస్తోంది. మార్చిలో ముగియాల్సిన ఎన్నికలను వాయిదా వేసి ఆ తర్వాత హైదరాబాద్ తరలివెళ్లిన నిమ్మగడ్డ వ్యవహారం ఇప్పుడు మళ్లీ రచ్చ చేయబోతుందా అనే సందేహాలు వినిపిస్తున్నాయి. మార్చి 15 నాడు కనీసం ఏపీ ప్రభుత్వానికి సమాచారం కూడా లేకుండా ఒంటెద్దుపోకడతో ఎన్నికలు వాయిదా వేశారు. కరోనా కారణంగా చూపించి ఎన్నికలు జరకుండా వాయిదా వేయడం అప్పట్లో పెను దుమారమే రేపింది. అనేక పరిణామాలకు ఆస్కారమిచ్చింది. ఆ సమయంలోనే హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్ కేంద్రంగా సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ తో రహస్యంగా భేటీ అయిన విజువల్స్ బయటకు రావడంతో నిమ్మగడ్డ బండారం బట్టబయలయ్యింది.

అప్పట్లో ఎన్నికల వాయిదా పై స్పష్టత లేని ప్రకటన చేసి సంచలనంగా మారిన నిమ్మగడ్డ ఈసారి మళ్లీ ఎన్నికల సన్నాహాలకు పూనుకున్నారు. ఈనెల 28న రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణ మీద పార్టీల అభిప్రాయాల సేకరణకు ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టుగా ఆయన ప్రకటించారు. అయితే వాస్తవానికి నాడు ఎన్నికలు వాయిదా వేసిన నాటి కన్నా ప్రస్తుతం కరోనా తీవ్రంగా ఉంది. కేసులు సంఖ్య దానికి నిదర్శనంగా ఉంది. మృతుల విషయంలోనూ దాని ప్రభావం స్పష్టమవుతోంది. అయినప్పటికీ నాడు వద్దన్న ఎన్నికలు ఇప్పుడు నిమ్మగడ్డకు ముద్దు అయ్యాయి.

దీని వెనుక నిమ్మగడ్డ ఎన్నికల అధికారిగా కన్నా రాజకీయంగానే ఎక్కువగా ఆలోచిస్తున్నారా అనే సందేహం వస్తోంది. వాస్తవానికి ఆయనకు మరో మూడు నెలల పదవీకాలం మాత్రమే ఉంది. 2015 జనవరిలో బాధ్యతలు స్వీకరించిన ఆయన పదవికి 2021 జనవరి నెలాఖరుకి గడువు ముగియబోతోంది. దాంతో ఈలోగా ఎన్నికలు నిర్వహించాలనే తాపత్రయం ఆయనలో కనిపిస్తోంది. మార్చి నెలలో ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసమే ఎన్నికలు వాయిదా వేసినట్టుగా చెప్పిన ఎస్ఈసీ ఇప్పుడు దానికి బిన్నంగా ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడతారా అని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తన హయంలోనే ఎన్నికలు పూర్తి చేయాలనే ఆతృత తప్ప రాష్ట్ర ప్రజల ప్రయోజనాలతో ఈ వ్యవహారానికి సంబంధం లేదని భావిస్తున్నారు.

ఏపీ ప్రభుత్వం తమకు సహకరించడం లేదని, నిధులు కూడా కేటాయించడం లేదని ఇటీవల హైకోర్టులో పిటీషన్లు వేశారు. అవి విచారణ దశలో ఉన్నాయి. ఆ సందర్భంగా న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు నిమ్మగడ్డ రమేష్ కి చెంపపెట్టుగానే భావించాలి. ఏపీలో ఆఫీసు ఉండగా, భారీగా నిధులు వెచ్చించి హైదరాబాద్ లో ఆఫీసు ఎందుకంటూ కోర్ట్ ప్రశ్నించింది. ఇక ప్రభుత్వం ఇచ్చిన నిధులన్నీ న్యాయవాదుల ఫీజులకే చెల్లిస్తారా అంటూ ఆశ్చర్యం కూడా వ్యక్తం చేసింది. ఇలా ఓవైపు హైకోర్ట్ నుంచి మొట్టికాయలు పడుతున్నా తన పంథాలో ఆయన సాగుతున్న తీరు రాజకీయ ప్రభావితంగానే చెప్పాలి.

ఇక రాజకీయ పార్టీల సమావేశంలో కూడా ఆయన ఆశించిన ఫలితాలు వస్తాయని చెప్పలేం. కేవలం టీడీపీ, ప్రస్తుతం ఆపార్టీ వెంట నడుస్తున్న సీపీఐ మినహా మిగిలిన పార్టీలు ఎన్నికల నిర్వహణకు సానుకూలత ప్రకటించే అవకాశం లేదు. వైఎస్సార్సీపీ ఎలానూ వ్యతిరేకంగా నిలుస్తుందని భావిస్తున్నారు. సీపీఎం కూడా ఇది తగిన సమయం కాదని చెబుతోంది. ఇక జనసేన, బీజేపీ కూడా ఎన్నికల వాయిదాకే మొగ్గు చూపబోతున్నట్టు ప్రచారంలో ఉంది. దాంతో నిమ్మగడ్డ ఆశలు ఫలిస్తాయా లేదా అన్నది సందేహమే. ఏమయినా ఇప్పుడిది రాజకీయంగా ఆసక్తికరం కాబోతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి