iDreamPost

పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల

పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. కొద్ది సేపటి క్రితం ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ మీడియా సమావేశంలో నోటిఫికేషన్‌ వివరాలు వెల్లడించారు. నాలుగు దశల్లో రెవెన్యూ డివిజన్ల ప్రాతిపదికన ఎన్నికలు జరుపుతామని వెల్లడించారు. మొదటి దశ ఎన్నికల నుంచి ప్రకాశం, విజయనగరం జిల్లాలను మినహాయించారు. ఈ రెండు జిల్లాలు మినహా మిగతా 11 జిల్లాల్లో తొలి విడత ఎన్నికలు జరుగుతాయని పేర్కొన్నారు. 

తొలి దశలో 14 రెవెన్యూ డివిజన్లలో ఎన్నికలు జరుగుతాయని నిమ్మగడ్డ తెలిపారు. శ్రీకాకళం, టెక్కలి, పాలకొండ, విశాఖ, అమలాపురం, ఏలూరు, నూజివీడు, గుంటూరు, నెల్లూరు, ఆదోని, పెనుగోండ, తిరుపతి, కడçప, జమ్మలమడుగు డివిజన్లలో జరుగుతాయని తెలిపారు. నామినేషన్లకు 27వ తేదీ తుది గడువు, 28వ తేదీన పరిశీలన, 30వ తేదీ అభ్యంతరాల స్వీకరణ, పరిశీలన, 29వ తేదీన అభ్యంతరాలపై తుది నిర్ణయం, 31వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ, అదే రోజు తుది జాబితా వెల్లడిస్తామని నిమ్మగడ్డ తెలిపారు. వచ్చే నెల 5వ తేదీన ఉదయం 6:30 గంటల నుంచి సాయంత్రం 3:30 గంటల వరకు పోలింగ్, 4 గంటల నుంచి లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుందని పేర్కొన్నారు. తుది ఫలితాల తర్వాత ఉప సర్పంచ్‌ ఎన్నిక జరుగుతుందని నిమ్మగడ్డ తెలిపారు.

పంచాయతీ ఎన్నికలపై సుప్రిం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ సోమవారం విచారణకు వస్తుందని, అప్పటి వరకు ఆగాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఓ వినతిని ఇచ్చిందని నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ తెలిపారు. ఆ వినతి సహేతుకంగా లేకపోవడంతో తిరస్కరిస్తున్నామని వెల్లడించారు. రెండున్నర సంవత్సరాలుగా పంచాయతీలు ప్రత్యేక అధికారుల పాలనలోనే ఉన్నాయన్న నిమ్మగడ్డ.. ఎన్నికలు జరిగితేనే పాలన సక్రమంగా సాగుతుందన్నారు. ఎన్నికలు సజావుగా జరిగేలా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. విఘాతం కలిగిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తాను వ్యక్తిగత ఆసక్తితో ఏ నిర్ణయం తీసుకోవడం లేదన్నారు. రాజ్యాగంబద్ధ సంస్థ అయిన ఎన్నికల సంఘం విధులను నిర్వర్తిస్తున్నాని చెప్పుకొచ్చారు. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి