iDreamPost

ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ఒంటెద్దు పోకడ

ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ఒంటెద్దు పోకడ

రాష్ట్రంలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏకపక్షంగా వ్యవహరిస్తోన్న తీరు చర్చనీయాంశంగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి సమన్వయంతో చేయవలసిన పనిని వైరంతో చేసేందుకే ఆయన సిద్దపడుతున్నారు. తాజాగా ఫిబ్రవరి 2021లో స్థానిక సంస్థల ఎన్నికలను పునరుద్దరించాలని సంసిద్ధత వ్యక్తం చేస్తూ అందుకు సంబంధించిన అంశాలు చర్చించేందుకు జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులతో బుధవారం మధ్యాహ్నం వీడియో సమావేశం ఏర్పాటుకు ఆదేశాలు ఇస్తూ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు.

గతంలో సుప్రీం కోర్టు చెప్పిన ప్రకారం రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించిన తర్వాత ఎన్నికల విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా అటువంటి సంప్రదింపులేవీ లేకుండానే ఏకంగా ఆయన జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి కయ్యానికి కాలుదువ్వారు. గతంలో ఓసారి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ తో సమావేశం నిర్వయించినప్పుడు ఎన్నికల పునరుద్దరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం సిద్ధంగా లేదని, ఎప్పుడు నిర్వహించవచ్చో సరయిన సమయంలో తెలియజేస్తాం అన్నప్పటికీ ఆయన ప్రభుత్వ సంసిద్ధత కోసం ఎదురు చూడకుండానే ఏకపక్షంగా ఫిబ్రవరిలో ఎన్నికలు అంటూ ప్రభుత్వంపై బాణం వదిలారు.

ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు ఆయన చెపుతున్న కారణాలు అసంబద్దంగానే ఉన్నాయి. ఈ యేడాది మార్చిలో ఏ కారణాలతో ఎన్నికలను రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించకుండానే వాయిదా వేశారో అవే కారణాలతో ఇప్పుడు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే ఎన్నికలు పునరుద్ధరించేందుకు సిద్ధం అవుతున్నారు.

“స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగి స్థానిక నాయకత్వం ఏర్పడితే కరోనాను మరింత సమర్ధవంతంగా నిర్వహించవచ్చు” అని ఇప్పుడు చెపుతున్న ఎన్నికల కమిషనర్ ఈ విషయం మార్చిలో కరోనా ప్రారంభ దశలో ఉన్నప్పుడు ఎలా మర్చిపోయారు?

“అనేక రాష్ట్రాలు ఎన్నికలు నిర్వహిస్తున్నాయి” అందువల్ల ఈ రాష్ట్రంలో కూడా ఎన్నికలు నిర్వహించవచ్చు అంటున్నప్పుడు ఏ రాష్ట్రం ఎన్నికలు వాయిదా వేసిందని మార్చి నెలలో ఈయన ఎన్నికలు వాయిదా వేశారో జవాబు చెప్పాల్సి ఉంటుంది.

స్థానిక ఎన్నికలు నిర్వహించడం రాజ్యాంగబద్ద నిర్ణయం లేదా బాధ్యత అంటున్న రమేష్ కుమార్ 2018లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ రాజ్యాంగ బాధ్యతను ఎలా విస్మరించారో కూడా ప్రజలకు చెప్పాల్సి ఉంది.

మొత్తంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తరహాలోనే ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వంతో ఘర్షణ వైఖరితోనే పనిచేస్తున్నారని ఇప్పటికే ప్రజలు విశ్వసిస్తున్నారు. నిమ్మగడ్డ వైఖరి చంద్రబాబు వైఖరికి భిన్నంగా అయితే లేదని గ్రామాల్లో కూడా ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు అంటే ఎన్నికల కమిషనర్ తన పనితీరు ఓసారి సమీక్షించుకోవాల్సి ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి