iDreamPost

ఒక నిర్ణయం పలు సందిగ్దత స్థితులు …

ఒక నిర్ణయం పలు సందిగ్దత స్థితులు …

గత ఏడాది మార్చిలో కరోనా పేరిట స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ నాటి నుండి నేటి వరకూ వివిధ చర్యలతో పలు ఆరోపణలు మూటగట్టుకోవడంతో పాటు వివాదాస్పద నిర్ణయాలతో నిత్యం కోర్టు మెట్లు ఎక్కుతూ దిగుతూ పదవి కాపాడుకొన్నారు . ఈ క్రమంలో జరిగిన చర్యలన్నీ నిమ్మగడ్డ ఏకపక్ష వైఖరినీ , టీడీపీ అనుకూల ధోరణిని పలుమార్లు బహిర్గత పరిచినా ఒంటెద్దు పోకడలు మానలేదు .
ఒకానొక సమయంలో ఎన్నికల కమిషనర్ హోదాలో ఉండి టీడీపీ నేతలతో ఓ ప్రయివేటు హోటల్ లో ఆంతరంగిక మంతనాలు జరపడం తీవ్ర విమర్శలకు తావిచ్చినా ఆయన ధోరణి మారలేదు .

తాజాగా పంచాయితీ ఎన్నికల నిర్వహణకు ఇచ్చిన షెడ్యూల్ మరింత వివాదాస్పదంగా మారింది .

రాష్ట్ర వ్యాప్తంగా మూడు కరోనా కేసులు మాత్రమే ఉన్నప్పుడు ప్రభుత్వంతో సంప్రదించకుండా ఏకపక్షంగా ఎన్నికలు వాయిదా వేసిన నిమ్మగడ్డ , ప్రస్తుతం రోజుకి నాలుగు నుండి ఐదు వందల కేసులు వస్తున్న తరుణంలో మళ్లీ ఎన్నికల నిర్వహణకు పూనుకోవడం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటం కాదా అనే ప్రశ్నకు నిమ్మగడ్డ నుండి ఏ విధమైన వివరణా లేదు . నిమ్మగడ్డని ఎన్నికల కమిషనర్ విధులనుండి రాష్ట్ర ప్రభుత్వం తొలగించిన తరువాత పలు కోర్టుల చుట్టూ తిరిగి పదవి తెచ్చుకున్న రమేష్ ఆ తర్వాత ప్రభుత్వంతో సిగపట్లకి సిద్ధపడ్డారు అనేది బహిరంగ రహస్యం .

ఈ వ్యవహారం నిమ్మగడ్డకి , ప్రభుత్వానికి కాక నిమ్మగడ్డకి చెలగాటం ప్రజలకి ప్రాణసంకటంగా మారడం బాధాకరం .

పట్టుమని పది కేసులు లేనినాడు ఏకపక్షంగా ఎన్నికలు వాయిదా వేసిన నిమ్మగడ్డ ప్రస్తుతం రోజుకి నాలుగొందల కేసులు వస్తున్న తరుణంలో ఇంకా పలు కోవిడ్ నిబంధనలు అమలవుతుండగానే పంచాయితీ ఎన్నికలకు పూనుకోవడం కరోనా అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొంటున్న పలు చర్యలకు తీవ్ర విఘాతం కాగలదు . అంతేకాక కోవిడ్ నివారణకు ఫ్రంట్ లైన్ వారియర్స్ గా నిలబడి కరోనా బారిన పడి మరణించిన , కోలుకున్న ఉద్యోగస్తుల త్యాగానికి విలువ పోగొట్టటమే కాక మరోసారి వారి ఆరోగ్యాన్ని , ప్రాణాల్ని ప్రమాదస్థితిలోకి తీసుకెళ్లే పరిస్థితి ఈ ఏకపక్ష నిర్ణయం వలన ఉత్పన్నమవుతుంది .

కొత్తగా వ్యాప్తి చెందే ముప్పు ఉన్న కరోనా స్ట్రెయిన్ వైరస్ ప్రమాదం దృష్ట్యా పలు దేశాలు అప్రమత్తం కావడంతో పాటు కొన్ని దేశాలు రాకపోకలు నిలిపివేయడం తీవ్రత ఉన్న దేశాలు మళ్లీ లాక్ డౌన్ విధించడం వంటి చర్యలు చేపడుతున్న వేల ఎస్ఈసీ తీసుకొన్న ఈ నిర్ణయం పూర్తి భాధ్యతారాహిత్యం . మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పంపిణీ మార్గదర్శకాల గురించి చర్చించడానికి కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ఈ నెల తొమ్మిదిన రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు . వెంటనే ఈ నెల పదకొండవ తారీఖు దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి వ్యాక్సినేషన్ ప్రక్రియకు తెర తీయబోతున్న తరుణంలో పలు రాష్ట్ర ప్రభుత్వ శాఖల ఉద్యోగస్తులు ఈ కార్యక్రమంలో నిమగ్నం కానుండగా నిమ్మగడ్డ తీసుకొన్న నిర్ణయం రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియని అస్తవ్యస్తం చేసే దురుద్దేశ్యంతో కూడుకొన్నదిగా కనిపిస్తుంది .

కోర్టు సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి ఎన్నికల షెడ్యూల్ ఖరారు చేయాల్సి ఉండగా నిన్న ఎన్నికల కమిషన్ కార్యాలయంలో జరిగిన మీటింగ్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అదిత్యనాధ్ , పీఆర్ శాఖ కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది ,పబ్లిక్ హెల్త్ కార్యదర్శి సింఘాల్ లు ఇవే అంశాల్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ ఎన్నికల నిర్వహణకు తగిన వాతావరణం లేదని వ్యాక్సినేషన్ ప్రక్రియ మార్గదర్శకాలు వచ్చాక పరిస్థితిని బట్టీ మళ్లీ చర్చలు జరపాలని కోరిన గంటల వ్యవధిలోనే సామరస్యపూర్వకంగా ఉమ్మడి నిర్ణయం తీసుకోవాలన్న కోర్టు ఆదేశాలు ఉల్లంఘిస్తూ విడుదల చేసిన ఈ షెడ్యూల్ పట్ల ఉద్యోగుల్లోనే కాదు ప్రజల్లో కూడా విస్మయం వ్యక్తమవుతోంది .

ఈ భేటీకి ముందు ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించే పరిస్థితులు లేవని కొత్త సీఎస్ ఎస్ఈసీకి లేఖ రాయగా భేటీ తర్వాత ఎన్నికల షెడ్యూల్ విడుదల నిర్ణయాన్ని నిరసిస్తూ ప్రస్తుతం పలు శాఖల ఉద్యోగులు కరోనా నివారణ విధుల్లో నిమగ్నమై ఉన్న తీరుని , కోవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియలో భాగంగా చేపట్టబోతున్న చర్యలను ఎస్ఈసీ నిర్ణయంతో ఆయా చర్యల పై పడే ప్రభావాన్ని వివరిస్తూ మీడియాకు ఓ లేఖ విడుదల చేసారు పీఆర్ శాఖ కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది .

ఈ అంశాలు అన్నిటినీ బట్టి చూస్తే ఎన్నికలు జరుగుతాయా లేదా అనే సందేహంతో పాటు మళ్లీ వివాదాస్పద , గందరగోళ స్థితికి నిమ్మగడ్డ కారణభూతం అవ్వబోతున్నాడని చెప్పొచ్చు . అంతిమంగా ఈ నిర్ణయం ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టటమే .

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి