iDreamPost

ఇళ్ళ స్థలాలేమో గాని భూములు గుంజుకుంటున్నారు

ఇళ్ళ స్థలాలేమో గాని భూములు గుంజుకుంటున్నారు

వచ్చే ఉగాది నాటికి రాష్ట్రంలో 25 లక్షల మందికి ఇళ్ళస్థలాలు పంపిణీచేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం హర్షించతగ్గదే. ఆహ్వానించవలసిందే. ఈ రాష్ట్రంలో గత కొన్నేళ్ళుగా పేదలకు ఇళ్ళు నిర్మించడమే కానీ కొత్తగా ఇళ్ళస్థలాలు ఇవ్వడం ఆగిపోయి చాలా యేళ్ళయింది. ఎక్కడైనా ఇచ్చినా ఒకటో, రెండో ఊళ్ళకు పరిమితమవుతోంది.

బహుశా 1970-80 దశకం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు ఇళ్ళస్థలాలు ఇచ్చిన దాఖలాలు లేవు. ఆ ఉన్న స్థలాల్లోనే మొదట్లో 1990-2000 దశకం వరకూ పెంకుటిళ్ళు ఆ తర్వాత 2010-2019 వరకూ పక్కా ఇళ్ళ నిర్మాణం పెద్ద ఎత్తున జరిగింది. పేదలకు పక్కా ఇళ్ళు పథకం ఈ రాష్ట్రంలో విస్తృత స్థాయిలో మొదట ఎన్టీఆర్ ప్రారంభిస్తే దాన్ని మరింత విస్తృతంగా అమలు చేసిన ఘనత వైఎస్సార్ కు దక్కుతుంది. ఆ తర్వాతనే ఈ కార్యక్రమం జాతీయ స్థాయికి చేరింది. కేంద్ర ప్రభుత్వం కూడా పేదలకు పక్కా ఇళ్ళ నిర్మాణం ఒక ప్రాధమిక అంశంగా తీసుకుంది.

ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చాలా యేళ్ళ తర్వాత ఇళ్ళస్థలాలు ఇవ్వబోతున్నారు. ఇప్పటివరకూ గతంలో ఇచ్చిన ఇళ్ళస్థలాల్లోనే పేదలు రెండుమూడు తరాలుగా నివాసం ఉంటున్నారు. కొత్తగా వచ్చిన పక్కా ఇళ్ళు కూడా ఆ స్థలాల్లోనే నిర్మించుకుంటున్నారు. తాతల కాలంలో ఇచ్చిన ఇళ్ళ స్థలాల్లో తండ్రులు, ఇప్పుడు కొడుకులూ పంచుకొని ఉంటున్నారు. పక్కా ఇళ్ళు వచ్చాయని సంతోషించాలో, ఉన్న ఆ కాస్త చోటులోనే వాటాలు వేసుకొని ఉండాల్సి వస్తోందని బాధపడాలో తెలియనిపరిస్థితి.

ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఇంటి స్థలం పథకం స్వాగతించవలసిందే. అయితే, కొండనాలుకకు మందు వేస్తే ఉన్నా నాలుక ఊడిపోయింది అనే సామెత చందంగా తయారయ్యింది పేదల పరిస్థితి. ఇళ్ళస్థలాలు పంపిణీ కోసం ఖాళీ భూములు వెతకండి అని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేస్తే అధికారులు ఖాళీగా ఉన్న పేదల స్థలాలను, అస్సైన్డ్ భూములను సమీకరిస్తున్నారు. గతంలో కేటాయించిన ఇళ్ళ స్థలాల్లో మూడు సెంట్లకు మించి ఎక్కువ ఉంటే ఆ ఎక్కువ స్థలాన్ని విడగొట్టి తీసేసుకుంటున్నారు అధికారులు. లబ్ధిదారులు లబోదిబో అన్నా వినడం లేదు. పోలీసులను చూపించి భయపెట్టేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి