iDreamPost

వరుస ఎదురుదెబ్బలు.. అయినా నిమ్మగడ్డ తీరు మారదా..?

వరుస ఎదురుదెబ్బలు.. అయినా నిమ్మగడ్డ తీరు మారదా..?

చేస్తున్న పని, తీసుకున్న నిర్ణయాలు సరికాదని, తప్పని తేలిన తర్వాత సాధారణంగా ఓ వ్యక్తి మళ్లీ ఆ తప్పు చేయరు. ఏవరేమనుకున్నా.. తన దారి తనదే అనుకుంటే ఎవరూ ఏమీ చేయలేరు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ కూడా ఇలానే వ్యవహరిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ఎన్నికలకు సహకరించలేదని అధికారులపై చర్యలకు ఆదేశాలు జారీ చేసిన నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌.. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో ఉన్న వారిపై, ప్రజా ప్రతినిధులపై చర్యలు, ఆంక్షలు విధిసూ వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. నిమ్మగడ్డ తీసుకుంటున్న నిర్ణయాలను న్యాయస్థానాలు కొట్టివేయడం ద్వారా మొట్టికాయలు పడుతున్నా.. తాను పట్టిన కుందేలుకు మూడేకాళ్లన్నట్లుగా నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ వ్యవహరిస్తున్నారు.

తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఏకగ్రీవాలను ఆపాలంటూ నిమ్మగడ్డ జారీ చేసిన ఆదేశాలపై పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నిమ్మగడ్డ వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టారు. పెద్దిరెడ్డి బయట ఉంటే ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలుగుతుందంటూ, ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆయన్ను ఇంటిలోనే ఉంచాలని, మీడియాతోనూ మాట్లాడనీయోద్దంటూ నిమ్మగడ్డ వివాదాస్పద ఆదేశాలు జారీ చేశారు. పెద్దిరెడ్డి కోర్టును ఆశ్రయించారు. కోర్టు నిమ్మగడ్డ ఆదేశాలను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. పెద్దిరెడ్డిపై ఉన్న ఆంక్షలను తొలగించింది.

ఈ ఘటన తర్వాత మళ్లీ కృష్ణా జిల్లా పెడన ఎమ్మెల్యే జోగి రమేష్‌పై కూడా ఆంక్షలు విధిస్తూ నిమ్మగడ్డ ఆదేశాలు జారీ చేశారు. పెడన నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఎమ్మెల్యే జోగి రమేష్‌ను ఇంట్లోనే ఉంచాలని, మీడియాతో కూడా మాట్లాడనీయొద్దంటూ కృష్ణా జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నిమ్మగడ్డ నిర్ణయంపై జోగి రమేష్‌ ఏపీ హైకోర్టులో శుక్రవారం లంచ్‌ మోషన్‌పిటిషన్‌ దాఖలు చేశారు. విచారించిన న్యాయస్థానం.. నిమ్మగడ్డ ఆదేశాలను తోసిపుచ్చింది. పార్టీ సమావేశాలు, కార్యక్రమాలు, బహిరంగ సభల్లో పాల్గొనవచ్చని తెలుపుతూ తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ తీసుకున్న రెండు నిర్ణయాలు బెడిసికొట్టాయి. న్యాయస్థానాల్లో నిలబడలేదు. అయినా.. నిమ్మగడ్డ తన వ్యవహార శైలిని మాత్రం మార్చుకోలేదు. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఆదేశాలు కోర్టుల్లో నిలబడకపోయినా.. మళ్లీ యథాలాపంగా తన దారి తనదేనంటూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. మంత్రి కొడాలి నాని ఎన్నికల కమిషన్‌ గౌరవాన్ని తగ్గించేలా మాట్లాడారంటూ.. షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. శుక్రవారం సాయంత్రం ఐదు గంటల లోపు మంత్రిగాని, ఆయన తరఫు ప్రతినిధిగానీ వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్‌ను అగౌవర పరిచే ఉద్దేశం తనకు లేదని మంత్రి కొడాలి నాని.. తన లాయర్‌ ద్వారా వివారణ పంపారు. అయితే ఈ వివరణతో సంతృప్తి చెందని నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌.. ఈ నెల 21వ తేదీ వరకూ మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడనీయొద్దంటూ కృష్ణా జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మంత్రి పెద్దిరెడ్డి, ఎమ్మెల్యే జోగి రమేష్‌లపై తీసుకున్న చర్యలు కోర్టుల్లో నిలబడకపోయినా.. అదే తీరుతో మంత్రి కొడాలి నాని విషయంలో కూడా నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ప్రవర్తించడం ఆయన వ్యవహారశైలి ఏ విధంగా ఉందో తెలియజేస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి