iDreamPost

చంద్రబాబు పిటిషన్‌.. హైకోర్టులో మొదలైన విచారణ

చంద్రబాబు పిటిషన్‌.. హైకోర్టులో మొదలైన విచారణ

అమరావతి అసైన్మెంట్‌ భూముల అక్రమాల నేపథ్యంలో ఏపీ సీఐడీ తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని, ఈ కేసులో సీఐడీ తదుపరి చర్యలు చేపట్టకుండా, అరెస్ట్‌ చేయకుండా ఆదేశించాలంటూ ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. చంద్రబాబుతోపాటు మాజీ మంత్రి నారాయణ కూడా సీఐడీ కేసును సవాల్‌ చేస్తూ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లను కలిపి హైకోర్టు విచారిస్తోంది.

చంద్రబాబు నాయుడు తరఫున సుప్రిం కోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూద్రా, నారాయణ తరఫున మాజీ ఏజీ, న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపిస్తున్నారు. ప్రతిపక్ష నేతలపై వైసీపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పూనుకుంటోందని, ఈ కోవలోనే సీఐడీ కూడా కేసు నమోదు చేసిందని ఇద్దరు న్యాయవాదులు వాదిస్తున్నారు. అమరావతి భూ కుంభకోణంపై సిట్, సీఐడీ, ఏసీబీ విచారణలను గతంలో ఏపీ హైకోర్టు నిలిపివేసిందని గుర్తు చేస్తున్నారు. సీఐడీ నమోదు చేసిన అభియోగాల్లో వాస్తవం లేదని, ముఖ్యమంత్రిగా చంద్రబాబు, మంత్రిగా నారాయణలు తమ పరిధి మేరకే నడుచుకున్నారని విన్నవిస్తున్నారు.

అమరావతి ప్రాంతం మంగళగిరిలో దళితులకు సంబంధించిన దాదాపు 500 ఎకరాల అసైన్మెంట్‌ భూములపై ఇతరులు కుట్ర చేసి, కారు చౌకగా కొనుగోలు చేసిన తర్వాత వాటిని విక్రయించేలా అనుమతిస్తూ చంద్రబాబు, మంత్రి నారాయణలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనేది ప్రధాన అభియోగం. అసైన్మెంట్‌ భూములు కొనడానికి, అమ్మడానికి అవకాశం లేదు. కానీ దళితుల నుంచి ఆ భూములు కొనుగోలు చేసిన తర్వాత.. ఆ అవకాశం కల్పించిన టీడీపీ ప్రభుత్వం.. ఆ భూములను ల్యాండ్‌ పూలింగ్‌లో తీసుకుని వారికి భారీగా లబ్ధి చేకూర్చేలా నిర్ణయాలు తీసుకుంది.

తమకు జరిగిన అన్యాయాన్ని దళిత రైతులు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దృష్టికి తీసుకురాగా.. ఆయన గత నెల 24వ తేదీన సీఐడీ కి ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణ తర్వాత ఈ నెల 12వ తేదీన సీఐడీ చంద్రబాబు, నారాయణలపై కేసు నమోదు చేసింది. ఇటీవల నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22వ తేదీన నారాయణ, 23వ తేదీన చంద్రబాబులు విచారణకు హాజరుకావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. అయితే చంద్రబాబు, నారాయణలు సీఐడీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని, తమను అరెస్ట్‌ చేయకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.

Also Read : బాబు పిటీషన్ పై సానుకూల స్పందన దక్కేనా, 23 టెన్షన్ తగ్గేనా?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి