iDreamPost

జూదం కట్టడికి మరో ముందడుగు…

జూదం కట్టడికి మరో ముందడుగు…

జూదం.. ఒకప్పుడు జూదం అంటే ఒక రకమైన ఏహ్యభావం ఉండేది. ఎప్పుడైతే సెల్‌ఫోన్‌ల వినియోగం విస్తృతమైందో అప్పట్నుంచి జూదం నేరుగా చేతిలోకే వచ్చేస్తోంది. వివిధ రకాల యాప్‌లు, ఆకర్షణీయమైన ప్రకటనలు, అందులో నటించే సెలబ్రిటీలు పాపం అమాయక జీవులను ఆ వైపునకు గేలం వేసి లాగేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఈ గేలానికి చిక్కినవాళ్ళు జేబులు గుల్ల చేసుకుంటుంన్నారు.

ఆన్‌లైన్‌ గేమింగ్‌ను కట్టడి చేసేందుకు, జూద కార్యకలాపాలను అడ్డుకునేందుకు ప్రభుత్వాలు పలు చర్యలు చేపడుతున్నప్పటికీ వాటి ఫలితాలు పెద్దగా ప్రయోజనకరంగా ఉండడం లేదనే చెప్పాలి. ఎప్పటికప్పుడు కొత్త రూపును సంతరించుకుంటున్న ఈ జూదంను గుర్తించి, అడ్డుకునే లోపు మరో రూపంలో ఆశావహుల చేతుల్లోకి వచ్చి వాలిపోతోంది. దీంతో కట్టడి చేయడం అత్యంత క్లిష్టప్రక్రియగా మారిపోయింది.

ఖాళీగా ఉండే కలిగినోళ్ళు జూదం ఆడుకుంటే పెద్దగా ఎవ్వరికీ నొప్పి పుట్టకపోవచ్చు. కానీ మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి, పేదలు సైతం ఈ ఊబిలో చిక్కుకుంటుంటే ఆయా కుటుంబాలు రోడ్డు పడుతున్న ఉదాహరణలు అనేకం నేటి సమాజంలో కన్పిస్తున్నాయి. ఈ ఊబిలోనుంచి బైటపడలేక, అప్పుల భారం మోయలేక పలువురు బలవన్మరణాలు కూడా పాల్పడుతుండడం అత్యంత దారుణమైన విషాదంగానే చెప్పాలి.

ఒకప్పటి జూదానికి, ఇప్పటి జూదానికి కనీసం పోలికలు కూడా చెప్పడం కష్టమే. పూర్తిగా రూపం మార్చుకున్న జూదం అనేక మార్గాల్లో జనం జేబులను ఖాళీచేయిస్తోంది. ఇందుకోసం జూదం నిర్వాహకులు నేరుగా సెల్‌ఫోన్‌లు మెస్సేజ్‌లు పంపించి మరీ కవ్విస్తుండడం వంటి విపరీత పోకడలు కూడా అప్పుడడప్పుడు చోటు చేసుకుంటున్నాయి.

జూదం ఏ రూపంలో ఆడినప్పటికీ ఇందుకోసం ఖర్చు చేస్తున్న మొత్తం, కొన్ని దేశాల వార్షిక ఆదాయంతో సమానంగానే ఉంటుందన్న అంచనాలు కూడా ఉన్నాయి. ఈ స్థాయిలో వేళ్ళూనుకుపోయిన జూద ప్రక్రియను అడ్డుకట్ట వేసేందుకు న్యాయస్థానాల ద్వారా కూడా తమ వంతు కృషి చేస్తుండడం అభినందించాల్సిన విషయం. ఆన్‌లైన్‌ గ్యాంబ్లింగ్‌పై ప్రకటనల్లో నటించిన పలువురు సెలబ్రిటీలకు మద్రాసుహైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ ప్రకటనల్లో ఎందుకు నటించాల్సి వచ్చిందన్న వివరణను ఆ నోటీసుల ద్వారా కోరింది.

ఇదేదో డబ్బులు సంపాదించేసుకునేందుకు మహాద్భుతమైన అవకాశం అని భ్రమపడి అనేక మంది డబ్బులు పోగొట్టుకోవడంలో ఆయా నటీనటుల పాత్ర కూడా కాదనలేదని. ఇంట్లో అమ్మానాన్నలు చెప్పినది వినని వాళ్ళు సైతం అభిమాన నటుడు చెప్పిన మాటనడం మనం చూస్తుంటాం. ఈ క్రమంలో కొందరి డబ్బులైనా పొగొట్టుకునేందుకు సదరు నటులు పరోక్షంగానైనా కారణమయ్యారన్న భావనతోనే పిటీషనర్‌ ఈ పిటీషన్‌ను వేయడం జరిగింది. దీంతో హైకోర్టు నోటీసులకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి సదరు నటులకు ఎదురైంది.

ఇటువంటి చర్యల ద్వారానైనా ఇంకొందరు నటులు ఆయా గ్యాంబ్లింగ్‌ ప్రకటనల్లో నటించకుండా, అమాయకులను జూద గేలానికి చిక్కిపోకుండా కాపాడేందుకు అవకాశం ఉంటుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి