iDreamPost

కరెంటుపై కన్నాకి క్లారిటీ ఇచ్చిన సర్కారు

కరెంటుపై కన్నాకి క్లారిటీ ఇచ్చిన సర్కారు

ఏపీ సర్కారు కొత్త పద్ధతి అనుసరిస్తోంది. ఆందోళన చెందుతున్న వారికి నేరుగా అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నట్టుగా కనిపిస్తోంది. అందులో భాగంగా నేరుగా ప్రతిపక్ష నేతల ఇళ్లకు కూడా అధికారులను పంపించే ప్రయత్నం చేస్తోంది. తద్వారా వివిధ సమస్యలపై వారిలో ఉన్న అభిప్రాయాలకు తగిన సమాధానం చెప్పడం ద్వారా శాంతింపజేసే విధానం అనుసరిస్తోంది. అందులో భాగంగా తాజాగా విద్యుత్ బిల్లులకు సబంధించి వివిధ పార్టీల నేతల వాదనలకు తగిన సమాధానం చెప్పేందుకు ప్రయత్నం చేసింది. బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇంటికి కూడా వెళ్లి నేరుగా ఆయనతోనే ఏపీఎస్పీడీసీఎల్ అధికారులు సమావేశం కావడం విశేషంగా మారింది.

సహజంగా ప్రభుత్వ నిర్ణయాల మీద ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తూ ఉంటాయి. వాటికి కౌంటర్ గా అధికార పార్టీ నేతలు ఎదురుదాడికి దిగుతూ ఉంటారు. మొత్తంగా వ్యవహారం రాజకీయ ప్రయోజనాల చుట్టూ తిప్పుతారు. తద్వారా ప్రజల ఆలోచనలకు , అనుమానాలకు తగిన సమాధానం లభించే అవకాశం మాత్రం ఉండేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. తాజాగా కరెంటు బిల్లుల విషయంలో ప్రభుత్వం భిన్నమైన రీతిలో సాగుతోంది. ఏ పార్టీ నాయకుడైన విమర్శలు చేస్తే దానిని రాజకీయంగా ఎదుర్కోవడం కన్నా నేరుగా అధికారులతో సమాధానం చెప్పించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. చివరకు మీడియాలో ఏదయినా బిల్లు ఎక్కువ వచ్చిందనే కథనాలు వస్తే దానికి కూడా అధికారులు నేరుగా జవాబు చెప్పేందుకు సిద్ధమవుతున్నారు.

ఇటీవల గుంటూరులో ఓ పూరింటికి ఏకంగా రూ.4 వేల బిల్లు వచ్చిందంటూ ఆంధ్రజ్యోతిలో కథనం వచ్చింది. ఆ మరునాడే అధికారులు ఆ ఇంటికి వెళ్లారు. వారి బిల్లుని పరిశీలించారు. కరెంటు బిల్లు ఎక్కువ రావడానికి కారణాలు అన్వేషించారు. ఆ ఇంట్లో పిండి రుబ్బేందుకు వాడుతున్న గ్రౌండర్ వినియోగం కారణంగా బిల్లు ఎక్కువ వచ్చిందని తేల్చారు. చుట్టు పక్కల ప్రజలకు అక్కడే వివిధ రకాల పథార్థాలను రుబ్బుతున్నట్టు స్పష్టం కావడంతో ఇంట్లో ఏసీ వినియోగం లేకపోయినప్పటికీ బిల్లు ఎక్కువ వచ్చిందనే విషయం వెల్లడించారు. ఆ తర్వాత టీడీపీ నేతల బోండా ఉమా సహా పలువురు చేసిన విమర్శలకు కూడా అదే రీతిలో అధికారులనే సమాధానంగా వివరణాలు ఇవ్వడం విశేషం.

అన్నింటికీ మించి తాజాగా ఏపీ బీజేపీ అధ్యర్వంలో విద్యుత్ ఛార్జీలపై ఆందోళన జరిగింది. ఆ వెంటనే స్పందించిన ఏపీ ఎస్పీడీసీఎల్ అధికారులు ఆపార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇంటికి వెళ్లారు. ఆయన బిల్లు ఎక్కువ వచ్చిందంటూ చేసిన ఆరోపణలకు వివరణ ఇచ్చారు. వినియోగం, యూనిట్ ఛార్జీ, మొత్తం బిల్లు సహా అన్నింటినీ ఆయన వివరించడంతో చివరకు కన్నా కి కూడా క్లారిటీ వచ్చినట్టయ్యింది. ఇలా అధికార యంత్రాంగం స్వయంగా కదిలి నాయకులకు క్లారిటీ ఇచ్చేందుకు చేస్తున్న ప్రయత్నం విశేషంగా మారింది. పెరిగిన విద్యుత్ బిల్లుల వెనుక ఈఆర్సీ నిర్ణయం సహా అన్నింటినీ స్పష్టం చేస్తున్నట్టు కనిపిస్తోంది. అధికార పార్టీ వ్యూహం విపక్షాలకు మింగుడు పడే అవకాశం లేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి