iDreamPost

స్థానిక ఎన్నిక‌లు కొన‌సాగించండి..సీఎస్ ప్ర‌త్యుత్త‌రం

స్థానిక ఎన్నిక‌లు కొన‌సాగించండి..సీఎస్ ప్ర‌త్యుత్త‌రం

రాష్ట్రంలో స్థానిక ఎన్నిక‌లు నిలిపివేయాల‌ని రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం తీసుకున్న నిర్ణ‌యం మార్చుకోవాల‌ని ఏపీ ప్ర‌భుత్వం కోరింది. ఈ మేర‌కు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లేఖ రాశారు. రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం అధికారికి రాసిన లేఖ‌లో ఆమె ఆస‌క్తిక‌ర అంశాలు ప్ర‌స్తావించారు.

ఏపీలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి ప్ర‌భావం త‌క్కువేన‌ని సీఎస్ నీలం సాహ్ని పేర్కొన్నారు. క‌రోనా కార‌ణంతో ఎన్నిక‌లు వాయిదా వేయ‌డం స‌రికాద‌ని తెలిపారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి లేనందున ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ కొన‌సాగించ‌డానికి స‌మ‌స్య‌లు రావ‌ని తెలిపారు. రాబోయే నాలుగు వారాల పాటు క‌రోనా వ్యాప్తి నియంత్ర‌ణ‌లోనే ఉంటుంద‌ని ఆమె వివ‌రించారు. ఎన్నిక‌ల సంద‌ర్భంగా పోలింగ్ రోజున అవ‌స‌రం అయితే త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌చ్చ‌ని సూచించారు. పోలింగ్ రోజున జనం గుమికూడకుండా నియంత్రించే అవ‌కాశం ఉంద‌న్నారు. రాబోయే మూడు నాలుగు వారాల పాటు కరోనా అదుపులోనే ఉంటుందని సీఎస్ స్పష్టీక‌రించారు. స్థానిక ఎన్నికలు యధాతథంగా నిర్వహించాలని విజ్ఞ‌ప్తి చేశారు.

ఇప్ప‌టికే కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి అన్ని నియంత్రణ చర్యలను ఏపీ ప్ర‌భుత్వం చేప‌ట్టింద‌న్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ దానికి త‌గ్గ‌ట్టుగా ప‌లు చ‌ర్య‌లు చేప‌ట్టింద‌ని వివ‌రించారు. ఎన్నికల నిర్వహణకు అడ్డంకి కాకుండా కరోనా నియంత్రణ చర్యలు చేపట్టడానికి అభ్యంత‌రం లేద‌న్నారు. ఎన్నిక‌లు మాత్రం య‌ధావిధిగా నిర్వ‌హించాల‌ని ఆమె లేఖ‌లో కోరారు.

ఎన్నిక‌ల వాయిదా విష‌యంలో నిన్న సీఎం అభ్యంత‌రాలు వ్య‌క్తం చేయ‌గా తాజాగా సీఎస్ లేఖ నేప‌థ్యంలో ఎస్ ఈ సీ ఎలా స్పందిస్తుంద‌న్న‌ది ఆస‌క్తిగా మారింది. ఎన్నిక‌ల సంఘం త‌న నిర్ణ‌యాన్ని మార్చుకుంటే ఏం జ‌రుగుతుంది,,దానికి భిన్నంగా వాయిదాకే క‌ట్టుబ‌డి ఉంటే ఎలాంటి ప‌రిణామాలు ఉత్ప‌న్న‌మ‌వుతాయ‌న్న‌ది రాష్ట్రంలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. రాజ‌కీయ ప‌రిణామాల‌ను ప్ర‌భావితం చేసే అంశంగా ఇది తయార‌య్యింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి