iDreamPost

రేపు కేబినెట్‌ సమావేశం.. కీలక నిర్ణయం తీసుకోనున్న జగన్‌ సర్కార్‌..

రేపు కేబినెట్‌ సమావేశం.. కీలక నిర్ణయం తీసుకోనున్న జగన్‌ సర్కార్‌..

ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ సమావేశం రేపు శుక్రవారం జరగనుంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన కేబినెట్‌ మీటింగ్‌ ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. కరోనా వైరస్‌ ప్రభావంతో అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు వాయిదా పడిని నేపథ్యంలో ఈ కేబినెట్‌ భేటి నిర్వహిస్తున్నట్లు సమాచారం.

బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించే వీలులేకపోడంతో మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. వచ్చే ఆర్థిక ఏడాది 2020–21కి సంబంధించి మొదటి మూడు నెలలకు అవసరమైన బడ్జెట్‌ ఆమోదం కోసం ఆర్డినెన్స్‌ జారీ చేయాలని మంత్రివర్గం తీర్మానించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. జూన్‌ 30 వరకు బడ్జెట్‌కు అనుమతి తీసుకుని ఆ తర్వాత పరిస్థితిని బట్టి బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలనే లక్ష్యంతో జగన్‌ ప్రభుత్వం బడ్జెట్‌ సమావేశాలు మార్చి నెలాఖరుకు వాయిదా వేసుకుంది. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకపోతే ఆర్థిక సంఘం నిధులు నష్టపోయే ప్రమాదం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే నామినేషన్లు ఘట్టం ముగిసిన తర్వాత కరోనా వైరస్‌ కారణంగా ఎన్నికలు వాయిదా పడ్డాయి.

ఈ నేపథ్యంలో 27వ తేదీన బడ్జెట్‌ సమావేశాలు నిర్వహిస్తామని రాష్ట్రాన్ని లాక్‌డౌన్‌ చేస్తున్నట్లు ప్రకటించిన సమయంలో సీఎం వైఎస్‌ జగన్‌ చెప్పారు. ఈ నెల 22న జనతా కర్ఫ్యూ రోజు సాయంత్రం సీఎం వైఎస్‌ జగన్‌ విలేకర్ల సమావేశంలో లాక్‌డౌన్‌ విషయం వెల్లడించారు. అయితే కరోనా వైరస్‌ ప్రభావం అధికంగా ఉండడంతో తాజాగా సమావేశాలు వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో మూడు నెలల బడ్జెట్‌ కోసం ఆర్డినెన్స్‌ తీసుకువచ్చేందుకు సర్కార్‌ నిర్ణయించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి