iDreamPost

నేటి నుంచి బడ్జెట్‌ సమావేశాలు.. అందరిలోనూ ఆసక్తి..

నేటి నుంచి బడ్జెట్‌ సమావేశాలు.. అందరిలోనూ ఆసక్తి..

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ఈ రోజు ప్రారంభం కాబోతున్నాయి. ఉదయం 11 గంటలకు గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఉభయ సభలను ఉద్దేశించి చేయనున్న ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం అవుతాయి. గవర్నర్‌ ప్రసంగం అనంతరం సభ మంగళవారానికి వాయిదా పడనుంది. సభ వాయిదా తర్వాత బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో శాసనసభ సమావేశాలు ఎన్నిరోజుల పాటు నిర్వహించాలనే విషయంపై చర్చించి నిర్ణయం తీసుకుంటారు.

బీఏసీ సమావేశం తర్వాత సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అధ్యక్షతన కేబినెట్‌ మీటింగ్‌ జరగనుంది. బడ్జెట్‌ సమావేశాల్లో ప్రవేశపెట్టాల్సిన బిల్లులు, చర్చించాల్సిన అంశాలపై ఈ సమావేశంలో నిర్ణయించనున్నారు. రెండో రోజు మంగళవారం సభలో ఇటీవల ఆకాలమరణం పొందిన మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డికి ఉభయ సభలు సంతాపం తెలియజేయనున్నాయి. అనంతరం సభలు బుధవారానికి వాయిదా పడనున్నాయి. బుధ, గురు వారాల్లో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరగనుంది. సభ్యుల ప్రశ్నలకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సమాధానాలు ఇవ్వనున్నారు. శుక్రవారం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

ప్రతి ఏడాది బడ్జెట్‌ సమావేశాలపై ఆసక్తి నెలకొని ఉంటుంది. అయితే ఈ సమావేశాలపై మునుపటి కన్నా ఎక్కువ ఆసక్తి అందరిలోనూ నెలకొంది. బడ్జెట్‌తోపాటు మూడు రాజధానుల అంశంపై కూడా ఈ సమావేశాల్లో చర్చ జరిగే అవకాశం ఉండడంతోనే అందరి దృష్టి ఈ సమావేశాలపై పడింది. రాజధాని వ్యవహారంలో ఇటీవల ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో.. రాష్ట్ర సర్కార్‌ ఏం చేయబోతుందనే ఉత్కంఠ నెలకొంది. రాజధానిపై చట్టాలు చేసే అధికారం శాసనసభకు లేదనేలా తీర్పు ఉన్న నేపథ్యంలో.. న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల అధికారాలు, విధులు, పరిధులపై చర్చించాలని వైసీపీ సీనియర్‌ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి లేఖ రాశారు.

ఆరు నెలల్లో అమరావతిని అభివృద్ధి చేయాలని, చట్టంలో పేర్కొన్న ప్రతి పనిని పూర్తిచేయాలని హైకోర్టు తీర్పు చెప్పింది. అంతేగాక ప్రభుత్వ కార్యాలయాలు మరో చోటకు తరలించకూడదని ఆదేశాలు జారీ చేసింది. మరో వైపు తమ ప్రభుత్వం మూడు రాజధానులకే కట్టుబడి ఉందని, రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యమని మంత్రులు బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, ధర్మాన కృష్ణదాస్‌లు స్పష్టం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుత శాసనసభ సమావేశాల్లో బడ్జెట్‌ కన్నా.. రాజధాని అంశం ప్రాధాన్యత సంతరించుకుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి