iDreamPost

వరుస సస్పెన్షన్లతో సాధించేదేముంటుంది, టీడీపీ ఎమ్మెల్యేల్లోనే అసహనం

వరుస సస్పెన్షన్లతో సాధించేదేముంటుంది, టీడీపీ ఎమ్మెల్యేల్లోనే అసహనం

ఏపీలో కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మరో వారంలో ముగియబోతున్నాయి. ఇప్పటికే రెండువారాల సమావేశాల్లో విపక్షం తీరు అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. వాస్తవానికి సభకు హాజరుకావాలా లేదా అన్న దానిపైనే ఆపార్టీలో మల్లగుల్లాలు పడ్డారు. చివరకు సభకు వెళ్లాలనే నిర్ణయాన్ని చివరి నిమిషంలో తీసుకున్నారు. ఇక సభకు హాజరు విషయంలో తమ పార్టీ అధినేత దూరంగా ఉండి, తాము మాత్రమే అడుగుపెట్టాలనే విషయంలోనూ గందరగోళం ఏర్పడింది. నారా భువనేశ్వరిని ఏదో అన్నారని చెబుతూ చంద్రబాబు గైర్హాజరయితే ఆయన తనయుడు మాత్రం దర్జాగా మండలిలో మొఖం చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తండ్రిది ఓ దారి, తనయుడిది మరో దారి అనే రీతిలో విమర్శలు కూడా వస్తున్నాయి.

సభకు హజరయిన నేపథ్యంలో విపక్షం హుందాగా వ్యవహరిస్తుందని అంతా ఆశించారు. అసలు అంతంతమాత్రపు సంఖ్య ఆపార్టీకి ఉంది. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు చంద్రబాబు వైఖరితో విసుగెత్తి ఆపార్టీకి దూరంగా ఉన్నారు. గంటా శ్రీనివాసరావు కూడా రాజీనామా పేరుతో చంద్రబాబు పిలిచినా పలకడం లేదు. దాంతో తెలుగుదేశం పార్టీ బలం కుచించుకుపోయింది. ఈ తరుణంలో తమ బలానికి తగ్గట్టుగా టీడీపీ వ్యవహరిస్తుందని పలువురు భావించారు. కానీ ఆపార్టీ తీరు అందుకు భిన్నంగా ఉండడం విశేషం. రెండువారాలుగా సభ నడుస్తున్నా టీడీపీ ఏవిధంగానూ ప్రభావితం చేయలేకపోయింది. కనీసం ప్రజా సమస్యలను ప్రస్తావించలేకపోయింది. పట్టుమని రెండు గంటలు ఒకే అంశం మీద చర్చించడానికి కూడా సిద్ధం కాలేకపోయింది.

గవర్నర్ ప్రసంగంతోనే గందరగోళం సృష్టించే యత్నం చేసింది. సభలో తమ బలానికి ఎలానూ అవకాశాలు రావని నిర్ధారించుకుని, సభ ముందుకు సాగకుండా చేయాలనే సంకల్పానికి వచ్చినట్టు కనిపించింది. చర్చల సందర్భంగానూ సమర్థవంతంగా తమ వాణి వినిపించేందుకు బదులుగా గలాటా సృష్టించి బయటకు వెళ్లిపోవాలనే ఉబలాటం ప్రదర్శించింది. అందుకు తగ్గట్టుగానే జంగారెడ్డిగూడెం ఘటనను సాకుగా చూపించి నాలుగురోజుల పాటు నిత్యం బహిష్కరణలకు గురయ్యింది. అధినేత లేని పార్టీ అసలే ప్రభావితం చేయలేని స్థితికి చేరగా, చర్చలు సాగితే తమకే చిక్కులని భావించి పలాయనం చిత్తగించేందుకు శ్రద్ధపెట్టింది. ఈ పరిస్థితుల్లో టీడీపీ ప్రజా సమస్యలకు ప్రాధాన్యతనివ్వడం లేదనే అభిప్రాయం వినిపిస్తోంది. చివరకు తాము వేసిన ప్రశ్నలకు కూడా సమాధానం వినడానికి ఓపిక లేని స్థితికి టీడీపీ చేరింది.

ఈ పరిస్థితుల పట్ల టీడీపీ నేతల్లోనే అసహనం కనిపిస్తోంది. ఇలాంటి స్థితిలో సభను బహిష్కరించడమే ఉత్తమం కదా అంటూ కొందరు అసంతృప్తి ప్రదర్శిస్తున్నారు.తాము వేసిన ప్రశ్నలు కూడా తాము వినడానికి సిద్ధంగా లేకుండా వ్యవహరించడం గతంలో ఎన్నడూలేదని చెబుతున్నారు. సభకు రాలేదనే ముద్ర పడకుండా చూడాలనే పేరుతో హాజరుకావడం, రోజూ కల్తీ మద్యం అంటూ కలకలం సృష్టించడం వల్ల ఒరిగేదేమీ ఉండదని వాపోతున్నారు. అధినేత తీరు పార్టీని అభివృద్ధి పథంలో నడిపించేందుకు బదులుగా మరింత అవస్థలు కొనితెచ్చేలా ఉందని, అందుకు సాక్షంగా తాజా అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ తీరు కనిపిస్తోందని సీనియర్ ఎమ్మెల్యేలే చెబుతుండడం విశేషం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి