iDreamPost

ఈ సారి ఎక్కువ రోజులు అసెంబ్లీ.. అచ్చెం నాయుడుకి సీఎం అక్షింతలు..

ఈ సారి ఎక్కువ రోజులు అసెంబ్లీ.. అచ్చెం నాయుడుకి సీఎం అక్షింతలు..

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ఎక్కువరోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ రోజు గవర్నర్‌ ప్రసంగం తర్వాత అసెంబ్లీ వాయిదా పడింది. ఈ తర్వాత స్పీకర్‌ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ(బీఏసీ) సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, కురసాల కన్నబాబు, అనిల్‌కుమార్‌ యాదవ్‌లు, ప్రతిపక్ష పార్టీ తరపున అచ్చెంనాయుడు హాజరయ్యారు. సమావేశాలు ఎన్నిరోజుల పాటు నిర్వహించాలనే అంశంపై చర్చించిన తర్వాత.. ఈ నెల 25వ తేదీ వరకు కొనసాగించాలని బీఏసీ నిర్ణయించింది. మంత్రి గౌతమ్‌ రెడ్డి మృతికి గౌరవ సూచికగా ఈ నెల 9వ తేదీన అసెంబ్లీకి సెలవు ఇవ్వాలని నిర్ణయించారు.

కోవిడ్‌ కారణంగా రెండేళ్లుగా అసెంబ్లీ సమావేశాలు తక్కువ రోజుల పాటు సాగాయి. ముఖ్యమైన బిల్లులు, బడ్జెట్‌ ఆమోదం కోసం మాత్రమే సభను నిర్వహించాల్సిన పరిస్థితి కరోనా కారణంగా నెలకొంది. అయితే కోవిడ్‌ తీవ్రత పూర్తిగా తగ్గడంతో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో రోజు వారీగా నమోదయ్యే కేసులు రెండంకెల సంఖ్యకు దిగివచ్చాయి. ఫలితంగా అసెంబ్లీ సమావేశాలు ఎక్కువ రోజులు నిర్వహించేందుకు మార్గం సుగమమైంది.

గౌతమ్‌కు నివాళి..

సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశం ప్రారంభంలో ఇటీవల అకాలమరణం పొందిన మేకపాటి గౌతమ్‌ రెడ్డికి మంత్రివర్గం నివాళి అర్పించింది. సీఎం జగన్, మంత్రులు అందరూ నిలబడి రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలిపారు.

అచ్చెన్నాయుడికి అక్షింతలు..

గవర్నర్‌ను దూషిస్తూ, ప్రసంగం ప్రతులను టీడీపీ సభ్యులు చించి గవర్నర్‌పై విసిరేయడంపై బీఏసీ సమావేశంలో టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడిపై సీఎం జగన్‌ సీరియస్‌ అయ్యారు. గవర్నర్‌ ప్రసంగాన్ని అడ్డుకోవడంపై మంచి పద్ధతి కాదని సీఎం జగన్‌ హితవు పలికారు. గతంలో ఇలాంటి సంస్కృతి ఎన్నడూ లేదనే సంగతిని గుర్తుచేశారు. గవర్నర్‌ వయసులో పెద్దవారని, ఆయనకు మనం గౌరవం ఇవ్వాలని ఈ సందర్భంగా సీఎం జగన్‌ తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి