iDreamPost

గురువు విమర్శలను సహించలేకపోతున్న సోము వీర్రాజు..!

గురువు విమర్శలను సహించలేకపోతున్న సోము వీర్రాజు..!

ప్రభుత్వాల విధానాలు, నిర్ణయాలపై అనేక వర్గాలు విమర్శలు చేస్తుంటాయి. రాజకీయ పార్టీలు, ప్రజలు, తటస్థులైన రాజకీయ నేతలు, రాజకీయ విశ్లేషకులు ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తుంటారు. ప్రభుత్వం ఏ పని చేసినా విమర్శలు చేయాలనే ఉద్దేశంతో ప్రతిపక్ష పార్టీలు పని చేస్తుంటాయి. అదే ప్రజలు, విశ్లేషకులు, తటస్థులైన రాజకీయ నేతలు చేసేవి సద్విమర్శలుగా చూడవచ్చు. ఈ విమర్శలను ఆయా ప్రభుత్వాలు పరిగణలోకి తీసుకుని తమ విధానాలు, నిర్ణయాలలో లోపాలు ఉంటే సవరించుకుంటాయి కూడా. ప్రజా స్వామ్య మనుగడకు విమర్శలే ప్రాణం అనే మాట వింటుంటాం. ప్రభుత్వాలు కూడా విమర్శలు సహించలేకపోతే.. వారి పరిపాలన సజావుగా సాగదంటారు.

ప్రతిపక్షాలు ప్రభుత్వంపై చేస్తున్న అనవసరమైన విమర్శలు వల్ల ప్రజలకు లాభం లేకపోగా నష్టం ఎక్కువగా జరుగుతుంది. చీటికి మాటికి విమర్శలు చేయడం వల్ల ప్రభుత్వాలు కూడా రాజకీయ పార్టీల విమర్శలను పరిగణలోకి తీసుకోవడం లేదు. అయితే రాజకీయ నిపుణులు మాత్రం సద్విమర్శలనే చేయడం ఏపీ రాజకీయాల్లో కనిపిస్తోంది. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై అప్పుడప్పుడు సద్విమర్శలనే చేస్తుంటారు. ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు, విధానాలలోని లోపాలు, వాటి వల్ల ప్రజలకు కలిగే నష్టాలపై కులాంకషంగా వివరిస్తారు.

ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఉండవల్లి తన సద్విమర్శలను మాత్రం చేస్తూనే ఉంటారు. టీడీపీ, వైసీపీ, కేంద్రంలో బీజేపీ.. ఏ పార్టీ ప్రభుత్వంపైనైనా ఉండవల్లి విమర్శ తప్పక ఉంటుంది. పెద్దనోట్ల రద్దు, పోలవరం ప్రాజెక్టు.. ఇలా పలు అంశాలపై ఆయన మోదీ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. అదే విధంగా గతంలో టీడీపీ ప్రభుత్వ సమయంలో పోలవరం ప్రాజెక్టు సహా పలు అవినీతి వ్యవహారాలపై చంద్రబాబు ప్రభుత్వాన్ని కడిగిపారేసేవారు. ఇసుక, మద్యం, పోలవరం ప్రాజెక్టులపై వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపైనా ఉండవల్లి విమర్శలు చేశారు.

రాష్ట్ర విభజన తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఉండవల్లి.. తటస్థుడుగా గుర్తింపు పొందారు. ఉండవల్లి విమర్శలను గతంలో టీడీపీ, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వాలు పరిగణలోకి తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే కేంద్రంలో బీజేపీ మాత్రం ఉండవల్లి విమర్శలను.. సహించలేపోతోంది. ఆ పార్టీ ఏపీ నేతలు ఉండవల్లిపై అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ముఖ్యంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఉండవల్లిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు.

కేంద్రంపై ఉండవల్లి చేస్తున్న విమర్శలపై ఈ రోజు రాజహేంద్రవరంలో విలేకర్లతో మాట్లాడిన సోము వీర్రాజు.. ఈ మాజీ ఎంపీకి ఓ సలహా ఇచ్చారు. ఉండవల్లిని టీడీపీ లేదా వైసీపీలో చేరమనండంటూ విలేకర్లతో వ్యాఖ్యనించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఉండవల్లి చేస్తున్న విమర్శలు ఆ పార్టీ నేతలకు ఏ స్థాయిలో చికాకు తెప్పిస్తున్నాయో సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలతో స్పష్టంగా తెలుస్తోంది. బీజేపీ ప్రభుత్వం, ఆ పార్టీ నేతలు ప్రతిపక్ష పార్టీలే కాదు ఇతరుల విమర్శలను కూడా సహించలేని పరిస్థితిలో ఉన్నట్లు సోము తీరుతో స్పష్టమవుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి