iDreamPost

ఆంధ్రజ్యోతే సాక్ష్యం..! మండలి రద్దుకు కారణం ఇది కాదు..!

ఆంధ్రజ్యోతే సాక్ష్యం..! మండలి రద్దుకు కారణం ఇది కాదు..!

ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి రద్దు చేయాలని శాసన సభ తీర్మానించింది. కథ ఇప్పుడు కేంద్రం వద్దకు చేరింది. మండలి రద్దు కారణాలపై అనేక వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్, ఓ వర్గం మీడియా, ఇతర నేతలు.. మండలిలో మూడు రాజధానులు ఏర్పాటుకు సంబంధించిన పరిపాలన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులు పాస్‌ కాకపోవడంతోనే సీఎం జగన్‌ మండలి రద్దు చేశారని మాట్లాడుతున్నారు. అది ఎంత మాత్రం నిజం కాదని చంద్రబాబు అనుకూల పత్రిక ఆంధ్రజ్యోతి చెబుతోంది. అందుకు సాక్ష్యం కూడా చూపిస్తోంది.

మండలిని రద్దు చేస్తారని గత ఏడాది డిసెంబర్‌ 22న ‘‘ మండలికి మంగళం’’ శీర్షికన ఆంధ్రజ్యోతి ప్రధాన పేజీలో కథనం ప్రచురించింది. ఆ కథనం క్లిప్పింగ్‌ను ఈ రోజు కూడా ప్రచురిస్తూ.. తాము అప్పుడే చెప్పామని రాసింది. డిసెంబర్‌ 11న వైఎస్సార్‌సీపీ ఎంపీ అవినాష్‌ లోక్‌సభలో మండలిపై అడిగిన ప్రశ్నను ఆధారంగా తాము అంచనా వేశామని పేర్కొంది. అదే నేడు నిజమైందంటూ క్రెడిట్‌ తీసుకుంది. ఆంధ్రజ్యోతి చెప్పిన ప్రకారం మండలి రద్దుకు తాజాగా జరిగిన పరిణామాలు కారణం కాదని తేటతెల్లమవుతోంది. బిల్లులు పాస్‌కాకపోవడంతోనే రద్దు చేశారని మాట్లాడుతున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌లు తదితరులు ఈ విషయం ఇప్పటికైనా గమనిస్తారా..?.

Read Also: మండలి రద్దు బీజేపీకే లాభమా..?

మూడు రాజధానుల ఏర్పాటు అంశం గత ఏడాది డిసెంబర్‌ 17వ తేదీన వెలుగులోకి వచ్చింది. అసెంబ్లీ శీతాకాల సమావేశాల చివరి రోజున మూడు రాజధానులు ఉండొచ్చని సీఎం జగన్‌ తన ఆలోచనను వెల్లడించారు. అప్పటి నుంచి మూడు రాజధానుల వ్యవహారం హాట్‌ టాపికైంది. ఈ విషయంపై అనేక తర్జనలు భర్జనలు, జీఎన్‌రావు కమిటీ, బీసీజీ నివేదిక.. వాటిపై హైపవర్‌ కమిటీ.. ఇలా నెలరోజులకు పైగా కథ నడిచింది.

Read Also: జగన్ చెప్పినట్లు మండలి రద్దుకు రామోజీ రావే కారణమా?

హైపవర్‌ కమిటీ నివేదిక ఆధారంగా మూడు రాజధానుల ఏర్పాటుకు ఈ నెల 20వ తేదీన రాష్ట్ర మంత్రివర్గం అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. అదే రోజున అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో మూడు రాజధానులకు సభ ఆమోదం తెలిపింది. వెంటనే మండలికి ఆ బిల్లులను పంపగా 22 తేదీన వాటిని సెలక్ట్‌ కమిటీకి పంపుతూ మండలి నిర్ణయం తీసుకుంది. అంటే మండలి రద్దుకు పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులు ఏ మాత్రం కారణం కాదని స్పష్టమవుతోంది. దీనికి ఆంధ్రజ్యోతి కూడా సాక్ష్యంగా నిలిచింది. ఆంధ్రజ్యోతి చెప్పిన నేపథ్యంలో మరి ఇప్పుడైనా చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లు.. మండలి రద్దుకు ఈ కారణాలు చెప్పడం ఆపేస్తారా..? లేక కొనసాగిస్తారా..? చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి