iDreamPost

లాక్ డౌన్ రివ్యూ 8 – అమృతరామమ్

లాక్ డౌన్ రివ్యూ 8 – అమృతరామమ్

థియేటర్ల రీ ఓపెనింగ్ ప్రశ్నార్థకంగా మారిన తరుణంలో చిన్న సినిమాల నిర్మాతలు మెల్లగా ఓటిటి వైపు అడుగులు వేస్తున్నారు. ఎక్కువ రోజులు ల్యాబుల్లో మగ్గితే పెట్టుబడికి వడ్డీలు కట్టడం భారమవుతుంది కాబట్టి వేరే ఆప్షన్ లేక డిజిటల్ ద్వారా ప్రేక్షకులకు చేరువయ్యే నిర్ణయం తీసుకున్నారు. తమిళ్ లో వచ్చేనెల భారీ ఎత్తున స్ట్రీమింగ్ యాప్స్ ద్వారా మూవీస్ క్యూ కడుతున్న నేపథ్యంలో తెలుగులో మాత్రం ఈ బోణి అమృతరామమ్ తో మొదలైంది. మరి ఇవాళే అందుబాటులోకి వచ్చి ఇంటికే వినోదాన్ని అందిస్తున్న ఈ చిత్రం కనీస అంచనాలు అందుకుందా లేదా రివ్యూలో చూద్దాం

కథ

ఆస్ట్రేలియాకు మాస్టర్స్ చదివేందుకు వచ్చిన అమృత(అమితా రంగనాథ్)తొలిచూపులోనే ఉద్యోగం లేక ఖాళీగా ఉన్న రామ్(రామ్ మిట్టకంటి)ప్రేమలో పడిపోతుంది. కానీ తనది అనుకున్నది ఇంకొకరికి చేరడం ఊహనైనా భరించే తత్వం లేని అమృత అతి ప్రవర్తన వల్ల రామ్ చాలా ఇబ్బందులు ఎదురుకుంటాడు. చివరికి బ్రేకప్ కు సైతం సిద్ధపడతాడు. ఈ క్రమంలో కొన్ని అనూహ్య పరిణామాలు జరుగుతాయి. ఆ తర్వాత అమృత, రామ్ ల ప్రేమకథ చివరికి ఏ మజిలి చేరుకుందో తెలియాలంటే సినిమా పూర్తయ్యేదాకా చూడాలి

నటీనటులు

మెయిన్ లీడ్ లో రామ్ గా నటించిన కొత్త కుర్రాడు రామ్ మిట్టకంటిలో హీరో ఫీచర్స్ లేవు. ఫిజికల్ గా ఆకర్షణ పెద్ద సీరియస్ గా ఆలోచించాల్సిన విషయం కాదని అనుకున్నా ఎక్స్ ప్రెషన్స్ లోనూ అబ్బాయి వీక్ గానే అనిపించాడు. కలర్, టోన్ లాంటివి పక్కనపెడితే కనీసం చూడగానే ఆకట్టుకునే చిన్న స్పార్క్ లాంటిది కూడా ఏదీ రామ్ లో లేదు. ఇంకో అవకాశం వస్తే మెరుగుపడతాడేమో చూడాలి. ఒకరకంగా సినిమాను అంతోఇంతో కాపాడింది అమితానే. గ్లామర్ స్కిన్ కాకపోయినా సహజమైన అందంతో పాటు భావోద్వేగాలను ఉన్నంతలో బాగానే పలికించింది. హెవీ ఎమోషన్స్ ఉన్న సీన్స్ లో కొంత ఇబ్బంది పడింది కూడా. విలనో కమెడియననో అర్థం కానీ పాత్రలో జెడి చెరుకూరు పూర్తిగా తేలిపోయారు. హీరోయిన్ అన్నయ్య వరస రోల్ లో కనిపించే శ్రీజిత్ డబ్బింగ్ సినిమా ఆర్టిస్ట్ లా ఉన్నారు. ఇంకో రెండు మూడు స్నేహితుల పాత్రలు తప్ప ఇంకేవి లేవు

డైరెక్టర్ అండ్ టీమ్

దర్శకుడు సురేష్ కొంటడ్డి తీసుకున్న కథలోనే ఏ కొత్తదనమూ లేదు. ప్రేమించిన వాళ్ళ కోసం దేనికైనా తెగించే హీరో హీరోయిన్ల త్యాగాల మీద గతంలో చాలా సినిమాలు వచ్చాయి. ఇది విదేశాల్లో సింగల్ లొకేషన్ లో జరిగే కథగా తప్పించి ఎలాంటి నవ్యతను సురేష్ చూపించలేకపోయారు. చదువు కోసం ఎయిర్ పోర్ట్ లో దిగిన అమ్మాయి కనీసం మాట పరిచయం కూడా కాకుండానే పడి చచ్చిపోయే స్థాయిలో హీరో ప్రేమలో పడటం ఎక్కడా కన్విన్సింగ్ గా అనిపించదు. పైగా ఆస్ట్రేలియాకు వచ్చిందే లవ్ కోసం అన్న తరహాలో అమృతను చూపించడం కొంచెం ఓవర్ అనిపిస్తుంది.

సింగల్ పాయింట్ మీద మధ్యమధ్యలో వద్దన్నా వచ్చే పాటలతో అమృతారామమ్ మొదలైన కాసేపటికే సహనానికి పరీక్షగా మారిపోతుంది. దర్శకుడు తన డైరీలో రాసుకున్న కొటేషన్స్ ని డైలాగ్స్ లో ఇరికించాలనే తాపత్రయం అడుగడుగునా కనిపిస్తుంది కానీ అంత ఎమోషన్ ని చూపించే సన్నివేశాలు మాత్రం ఒకటి అరా తప్ప ఏమి లేకపోవడం అమృతారామమ్ లోని అసలు మైనస్. సంతోష్ ఛాయాగ్రహణం పర్వాలేదు. ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ రెండు గంటల్లోపే కట్ చేసినా చాలా బోర్ ఉంది. ఎన్ఆర్ ప్రసు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, పాటలు ఫీల్ తో ఉన్నాయి కానీ వాటికి న్యాయం చేకూర్చే మ్యాటర్ సినిమాలో లేదు. ప్రొడక్షన్ క్వాలిటీ కూడా అంతంతే. ఆస్ట్రేలియాలో తీశారన్న మాటే కానీ చాలా చోట్ల షార్ట్ ఫిలిం మేకింగ్ కనిపిస్తుంది

చివరి మాట

ప్రతి ప్రేమకథ గీతాంజలినో, మరో చరిత్రనో అవ్వలేదు. అలా ఆశించడం కూడా తప్పే. కానీ ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా ప్రమోషన్ జరిగినప్పుడు ఏదైనా కొత్త సినిమాలో కనీస అంచనాలు పెట్టుకోవడం ప్రేక్షకుల హక్కు. అమృతరామమ్ ఆ విషయంలో పూర్తిగా నిరాశపరిచింది. హీరోయిన్ పెర్ఫార్మన్స్ ఎంతోకొంత నిలబెట్టింది కానీ ఆ ఒక్క కారణంతోనూ చివరిదాకా ఓపిగ్గా భరించడం కష్టమే. థియేటర్లో కాకుండా నేరుగా ఓటిటిలో రావడం వల్ల చూసేవాళ్లు డబ్బు ఆదా చేసిందని సంతోషించి ఓ లుక్ వేయడం తప్ప అమృతారామమ్ మీద కనీస అంచనాలు పెట్టుకున్నా నిరాశ తప్పదు

అమృతరామమ్ – భరించడం కష్టం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి