iDreamPost

Amazon Prime కొత్త మోడల్ తో OTT సినిమాలు

Amazon Prime కొత్త మోడల్ తో OTT సినిమాలు

ఇండియా వరకు ఓటిటిలో గణనీయమైన మార్కెట్ సంపాదించుకున్న అమెజాన్ ప్రైమ్ త్వరలో కొత్త స్ట్రాటజీతో వినోదాన్ని అందించబోతోంది. ఇప్పటి దాకా ఉన్న పద్ధతి ఏడాదికి లేదా నెల మూడు నెలలు చందా కట్టేసి నాన్ స్టాప్ గా అందులో ఉన్నవి ఎంతసేపైనా చూసుకోవడం. కానీ దీంతో పాటు ఇంకో మోడల్ ని ప్రైమ్ తీసుకురాబోతోంది. దీని ప్రకారం ఏదైనా ప్రీమియర్ షోని ప్రత్యేకంగా మిగిలినవాటితో సంబంధం లేకుండా చూడాలంటే 99 రూపాయలు చెల్లించాలన్న మాట. దీనికో టైం లిమిట్ ఉంటుంది. ఒక్కసారి డబ్బులు కట్టేసి ఓకే అన్నాక ఆలోగా చూసేయడం పూర్తి చేయాలి. లేదంటే మళ్ళీ కొనుక్కోవాల్సి వస్తుంది.

ఈ తరహా పద్ధతి ఇప్పటికే బుక్ మై షోలో ఉంది. స్పైడర్ మ్యాన్ నో వే హోమ్, ది బ్యాట్ మ్యాన్ లాంటి ఎన్నో హిట్లు ఈ టైపులోనే అందుబాటులో ఉన్నాయి. హెచ్డిలో ఒక ధర, మాములు క్లారిటీ చాలనుకుంటే మరో రేట్ ఇలా పెట్టారు. ఇప్పుడు ప్రైమ్ కూడా అచ్చంగా ఇదే పద్ధతి తీసుకురాబోతోంది. అయితే అధికారికంగా ఇంకా చెప్పలేదు కానీ త్వరలోనే లాంచ్ చేయబోతున్నట్టు ఓటిటి వర్గాల సమాచారం. విదేశాల్లో ఆల్రెడీ అమలులో ఉన్న ఇలాంటి మోడల్ ఇక్కడ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. కరోనా తర్వాత ఓటిటి రంగంలో వచ్చిన అనూహ్యమైన మార్పుల్లో ఇప్పుడిది కొత్త ట్రెండ్ కి దారి తీసే అవకాశం ఉంది.

త్వరలో నెట్ ఫ్లిక్స్ కూడా ఇదే తరహా ఎత్తుగడను అనుసరించవచ్చు. యుట్యూబ్ లో ఇది ఎప్పటి నుంచో చెలామణిలో ఉన్నప్పటికీ రెవిన్యూ అంత మెరుగ్గా ఏమి లేదు. ఫ్రీ యాప్ గా దానికి ఉన్న గుర్తింపు వల్ల డబ్బులు కట్టి చూసే విషయంలో ప్రేక్షకులు కొంత వెనుకడుగు వేస్తున్నారు. అందులోనూ అక్కడ మరీ కొత్త సినిమాలు ఉండవు. థియేటర్లలో ఫైనల్ రన్ పూర్తి చేసుకున్నవి మాత్రమే అందుబాటులో ఉంచుతారు. ఒకవేళ ప్రైమ్ కనక ఇందులో సక్సెస్ అయితే మిగిలినవాళ్లు కూడా అనుసరించే అవకాశం లేకపోలేదు. కాకపోతే ఏడాదికి ఇలా డబ్బులు కట్టి చూసే సినిమాలు కనక ఎక్కువ ఉంటే మాత్రం బడ్జెట్ కి చిల్లులే

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి