iDreamPost

అమరావతి స్కామ్, దూకుడు పెంచిన సిట్, వలలో మరో ముగ్గురు డిప్యూటీ కలెక్టర్లు

అమరావతి స్కామ్, దూకుడు పెంచిన సిట్, వలలో మరో ముగ్గురు డిప్యూటీ కలెక్టర్లు

అమరావతి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే పలు ఆధారాలు సేకరించిన సిట్ స్పీడ్ పెంచుతోంది. బాధ్యులను బయటకు లాగుతోంది. ల్యాండ్ పూలింగ్ స్కామ్ బండారం బయటపెడుతోంది. ఆక్రమంలో పలువురు రెవెన్యూ అధికారుల పాత్రను గుర్తించింది. ఇప్పటికే ఒక డిప్యూటీ కలెక్టర్ ని అరెస్ట్ చేసింది. తాజాగా మరో ముగ్గురు డిప్యూటీ కలెక్టర్లు, ఆరుగురు తహశీల్దార్ల పాత్రపై కూడా కీలక అడుగులు వేయబోతున్నట్టు తెలుస్తోంది.

విజయవాడలో నివసిస్తున్న ఓ రెవెన్యూ అధికారి ల్యాండ్ ఫూలింగ్ పథకంలో పెద్ద మొత్తంలో అవినీతి, అక్రమాలకు సహకరించినట్టు తెలుస్తోంది. అందులో అధికార పార్టీ నేతలకు అన్ని రకాలుగా సహకరించడం ద్వారా రూ.80 కోట్ల అక్రమాలకు తెరలేపినట్టు చెబుతున్నారు. దానికి సంబంధించిన ఆధారాలను కూడా సిట్ సేకరించింది. ఆ తర్వాత ఆ తహశీల్దార్ స్థాయి అధికారి విజయవాడ సమీపంలోని ఓ రియల్ ఎస్టేట్ వెంచర్ లో పెద్దమొత్తంలో పెట్టుబడులు పెట్టిన విషయాన్ని గుర్తించారు. అంతేగాకుండా పేదలకు ఇళ్ల కేటాయింపు పథకంలో కూడా సదరు అధికారి పాత్ర ఉందని గుర్తించారు. ఏకంగా రూ.200 కోట్ల అక్రమాస్తులు కూడబెట్టినట్టుగా అనుమానిస్తున్నారు. ఈ విషయంలో సిట్ ప్రత్యేక దృష్టి సారించింది.

తీగలాగితే డొంక కదిలినట్టుగా ఇలాంటి వ్యవహారాలు మరిన్ని వెలుగులోకి రాబోతున్నట్టు కనిపిస్తోంది. రాజధాని ప్రాంతంలో రెవెన్యూ శాఖలో విధులు నిర్వహిస్తున్న సమయంలో అక్రమాలు సాగించి, ఆతర్వాత వివిధ ప్రాంతాల్లో బినామా పేరుతో ఆస్తులు కూడబెట్టిన వైనం కనుగొన్నారు. దాంతో తొలుత అలాంటి అధికారులపై కన్నేసి ఆరా తీయడంతో వ్యవహారం బయటపడుతోందని చెబుతున్నారు. ఈ జాబితాలో ఉన్న ముగ్గురు డిప్యూటీ కలెక్టర్లపై చాలాకాలంగా ఆరోపణలున్నాయి. ల్యాండ్ ఫూలింగ్ లో రికార్డులను తారుమారు చేసి పెద్ద మొత్తంలో కాజేసిన వైనం, టీడీపీ నేతలతో కుమ్మక్కయ్యి సాగించిన అవినీతి భాగోతం బయటపడబోతందని తెలుస్తోంది.

ఇప్పటికే ఈ సమాచారం తెలిసిన కొందరు రెవెన్యూ అధికారులు వ్యవహారం నుంచి తప్పించుకునే మార్గాల్లో ఉన్నట్టు అనుమానిస్తున్నారు. సిట్ దూకుడు చూసిన తర్వాత తమ గుట్టురట్టవుతుందని గ్రహించిన కొందరు దీర్గకాలిక సెలవుల పేరుతో తప్పించుకునే మార్గాలను అన్వేషిస్తున్నట్టు సిట్ అధికారులు భావిస్తున్నారు. దాంతో వీలయినంత వేగంగా సదరు అధికారుల వ్యవహారంలో కొలిక్కి తీసుకురావాలని ఆశిస్తోంది. అందుకు అనుగుణంగా విజయవాడ, గుంటూరు, హైదరాబాద్ ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో ఆస్తులు సంపాదించిన వివరాలను సేకరించడం పూర్తి చేసింది. ఇదే ఇప్పుడు పలువురి అధికారుల్లో అలజడి రేపుతోంది. టీడీపీ నేతల్లో కలవరం కలిగిస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి