iDreamPost

నిన్నటి వరకు ప్రభుత్వం.. నేడు రైతులు.. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌లో కొత్త మలుపు

నిన్నటి వరకు ప్రభుత్వం.. నేడు రైతులు.. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌లో కొత్త మలుపు

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి ప్రాంతంలో జరిగిన ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. అమరావతి రాజధానిగా ప్రకటించకముందే అక్కడ రైతుల వద్ద నుంచి కారు చౌకగా టీడీపీ నేతలు వేలాది ఎకరాల భూములు కొనుగోలు చేశారని అధికార పార్టీ ఆరోపిస్తోంది. ఈ విషయంపై అసెంబ్లీ బయట, లోపలా చర్చ సాగింది. ఎవరెవరు ఎంత.. ఏ సర్వే నంబర్‌లో కొన్నారో కూడా వివరాలతో సహా ప్రభుత్వం వెల్లడిస్తోంది.

అయితే ఇంత జరుగుతున్నా బాదిత రైతులు ఎందుకు మౌనంగా ఉన్నారు..? అసలు ప్రభుత్వం చెబుతున్నట్లు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందా..? అన్న అనుమానాలు ఉన్నాయి. వైఎస్సార్‌సీపీ, మంత్రులు చేస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చేలా తాజాగా ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై కీలక పరిణామం చోటుచేసుకుంది. తమ భూములను బెదిరించి లాక్కొవడమే కాకుండా, అన్యాయం చేశారంటూ అమరావతి ప్రాంత వెంకటపాలెం గ్రామానికి చెందిన బుజ్జమ్మ సీఐడీకి ఫిర్యాదు చేసింది.

Read Also: ఇన్ సైడర్ ట్రేడింగ్ పై అసెంబ్లీ కీలక నిర్ణయం.. టిడిపికి తలనొప్పులు ప్రారంభమైనట్లేనా..?

అసైన్డ్‌ భూములను లాక్కున్నారని బుజ్జమ్మ ఫిర్యాదు చేయడంతో భూ కుంభకోణం కొత్త మలుపు తిరిగింది. ఈ ఫిర్యాదుతో టీడీపీ నేత బెల్లంకొండ నరశింహారావు, మాజీ మంత్రులు పి.నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావులపై సీఐడీ కేసులు నమోదు చేసింది. సెక్షన్‌ 420, 506, 120/బి తోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేసింది.

రాజధాని ప్రకటనకు మందు, తర్వాత కూడా అమరావతిలో అసైన్డ్‌ భూములను టీడీపీ నేతలు, ప్రజా ప్రతినిధులు చేజిక్కించుకున్నారు. అసైన్డ్‌ భూములకు పరిహారం రాదని, ప్రభుత్వం తీసుకుంటుందని ప్రచారం చేసి తృణమో ఫలమో ఇచ్చి ఆ భూములను టీడీపీ నేతలు కొన్నారు. మరికొంత మంది దళితులు భూములు అమ్మబోమని భీష్మించినా .. వారిని బెదిరించి తీసుకున్నారని ఆరోపణలున్నాయి.

Read Also: ఆయన్ని నమ్మితే చివరకు గోచీ కూడా ఉంచడు–మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ !

అమరావతిలో 338.88 ఎకరాల అసైన్డ్‌ భూముల కుంభకోణం జరిగిందిని ఇటీవల అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ప్రకటించారు. ఇందులో నారా లోకేష్‌ సన్నిహితులుగా చెప్పబడుతున్న కొల్లి శివరాం 47.39 ఎకరాలు, బలుసు శ్రీనివాసరావు 14.07, గుమ్మడి సురేష్‌ 42.925 ఎకరాలు కొనుగోలు చేశారు. ఈ భూములను ప్రభుత్వానికి ఇచ్చిన ప్రతిఫలంగా రాజధాని ప్రాంతంలో విలువైన ఫ్లాట్లు పొందారని ఆర్థిక మంత్రి వెల్లడించారు.

ఓ పక్క ప్రభుత్వం ఆధార సహితంగా కుంభకోణంపై మాట్లాడుతూ విచారణ జరిపించేందుకు సిద్ధమైంది. మొన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలోనూ, తాజాగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనూ ఇన్‌సైడర్‌ ట్రేడింగ్, అమరావతిలో జరిగిన భూ కుంభకోణాలపై సమగ్ర విచారణ జరిపిచేందుకు తీర్మానాలు జరిగాయి. తాజాగా బాధితులు కూడా ఫిర్యాదులు చేయనారంభించడంతో ఈ వ్యవహారంలో భాగస్వాములైన టీడీపీ నేతలకు చిక్కులు తప్పేలా లేవు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి