iDreamPost

దాస్తే దాగని అసంతృప్తి..!

దాస్తే దాగని అసంతృప్తి..!

‘‘దేశ్‌కీ వాసియోం..’’ అంటూ ప్రధాని నరేంద్రమోడీ మన్‌కీ బాత్‌లో పదేపదే ఎంతగా గొప్పలు చెబుతున్నప్పటికీ దేశ ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోతుందా? దాని ప్రభావ ఫలితమే ఇప్పుడు రైతు పోరాటంలో ప్రతిఫలిస్తుందా? అన్న ప్రశ్నలకు అవుననే సమాధానాలు సూటిగానే వస్తున్నాయి. భారత దేశ ఆర్ధిక వ్యవస్థ మొత్తం వ్యవసాయం చుట్టూనే తిరుగుతుంది. ఎంతగా పారిశ్రామిక ప్రగతి సాధించేసామని ఢంకాభజాయించేసుకున్నప్పటికీ దేశ ఆర్ధిక వ్యవస్థలో ఇప్పటిక్కూడా 60–70శాతం వ్యవసాయానిదే ప్రాముఖ్యత.

వ్యవసాయానికి మూలాధారమైన రైతు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాడు. వ్యవసాయ ఉత్పత్తులకు కనీస ధర రాకపోగా.. ఏ ఏటికాయేడు ప్రకృతి విపత్తుల దాడి, పెరిగిపోయే పెట్టుబడులతో సాగుకే దూరమై పోయే పరిస్థితులు ఉన్నాయన్నది అందరికీ కనిపిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కార్పొరేట్‌ వ్యవసాయం నెమ్మదిగా ఊపందుకుంటోంది. లాభసాటి వ్యవసాయం పేరిట కేంద్ర ప్రభుత్వం కూడా కార్పొరేట్‌ సంస్థలకు వెసులుబాటు కల్పించే విధంగా నిర్ణయాలు తీసుకుంటోంది. రైతులకు నేరుగా ఇచ్చే విషయంలో అనేకానేక కొర్రీలు వేసే ప్రభుత్వం, కార్పొరేట్‌ సంస్థలకు మాత్రం పలు సౌలభ్యాలను కల్పిస్తోందన్నది ఇప్పుడు రైతు పోరాటానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వారి మాట.

ఇన్ని కోట్ల మంది రైతులకు ఇవ్వాల్సింది, కొన్ని కార్పొరేట్‌ కంపెనీలకు ఎందుకు ఇచ్చేస్తున్నారన్నది రైతు నాయకులు సూటిగానే అడుగుతున్న ప్రశ్న. కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఆరోపణలు చెప్పిన్పటికీ రైతులు వెలిబుచ్చే అనుమానాలు సబబుగానే ఉన్నాయని పలువురు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రంతో జరిగే చర్చల్లో మరో మాట లేకుండా మూడు చట్టాలను వెనక్కి తీసుకోవాలని ఏకైక డిమాండే అజెండాగా రైతులు పెట్టుకున్నారు. అందులో భాగంగా దేశ వ్యాప్తంగా సమ్మెకు కూడా పిలుపునిచ్చారు. ఇందుకు రవాణా, బ్యాంకింగ్, ఇతర కీలక రంగాల్లో యూనియన్లు కూడా రైతులకు మద్దతుగా నిలిచేందుకు సిద్ధమయ్యాయి. భారత్‌ బంద్‌కు మద్దతు ఇస్తున్నట్లు బాహాటంగానే ప్రకటించాయి.

ఒక పక్క దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీ జెండా ఎగరేయాలని బీజేపీ పెద్దలు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇంకో పక్క జమిలి ఎన్నికలు అంటూ పథక రచనలు చేస్తునానరు. ఏకపక్షంగా ఈ స్థాయిలో బీజేపీ అత్మసై్థర్యానికి గత ఎన్నికల్లో సాధించిన సీట్లు, ఇటీవలి పలు ఎన్నికల్లో వచ్చిన గెలుపులేనని ఘంటాపథంగా చెప్పొచ్చు. అధికార పీఠం మీద ఉన్న శ్రద్ద ప్రజల ఇబ్బందులు తీర్చడంలో బీజేపీ నాయకత్వం పెట్టడం లేదన్న ఆరోపణలను ప్రత్యర్ధి పార్టీలు ఎప్పట్నుంచో చేస్తున్నారు. ఈ భావన ప్రజలకు కూడా చేరిందని రైతు పోరాటంతో స్పష్టమవుతోందని పరిశీలకులు భావిస్తున్నారు.

బీఎస్‌ఎన్‌ఎల్‌ వంటి సంస్థను నిట్టనిలువునా నిర్వీర్యం చేయడం, బంగారు బాతులాంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు సంస్థలకు దఖలు పరిచే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని వాటి ఇప్పటి పరిస్థితులను, ఆర్ధిక స్థితిగతులను నిదర్శనాలుగా చూపించేవారి సంఖ్య ఇటీవలి కాలంలో ఎక్కువైందనే చెప్పాలి. ప్రత్యర్ధి రాజకీయ పార్టీలే కాకుండా మేథావివర్గం కూడా ఈ విషయాన్ని బహిరంగ వేదికలపై కూడా పలు మార్లు ప్రస్తావిస్తూంది. తద్వారా జరుగుతున్న తంతును, తతంగాన్నీ ప్రజల ముందు ఉంచుతోంది.

ఈ నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్న పోరాటాన్ని కేవలం రైతు వర్గానికి సంబంధించినదిగానే చూస్తే అంతకంటే పొరపాటు ఇంకొకటి ఉండదని చెబుతున్నారు. దేశ వ్యాప్తంగా పెల్లుబికుతున్న అసంతృప్తుల్లో భాగంగానే ఇటువంటి సంఘటిత పోరాటాలు వెలుగులో కొస్తాయని వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎటువంటి నష్ట నివారణ చర్యలు చేపడుతుందన్నది ఉత్కంఠంగా మారింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి