iDreamPost

అజిత్ తెగింపులో పాత కథల ఛాయలు

అజిత్ తెగింపులో పాత కథల ఛాయలు

సంక్రాంతి భారీ సినిమాల్లో తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే చాలా తక్కువ హైప్ ఉన్నది అజిత్ తెగింపుకే. దిల్ రాజు నైజామ్, వైజాగ్ హక్కులను కొన్నాక కొంచెం చర్చలోకి వచ్చింది కానీ దీనికి చెప్పుకోదగ్గ థియేటర్లు దొరకడం ఇప్పుడున్న పరిస్థితుల్లో అనుమానమే. తమిళనాడులో తలా ఫీవర్ ఓ రేంజ్ లో ఉంటుంది కానీ ఏపీ తెలంగాణలో మాత్రం తన మార్కెట్ ఎప్పుడో డౌన్ అయ్యింది. ఒకప్పుడు ప్రేమలేఖ లాంటి సూపర్ హిట్స్ తో పేరు తెచ్చుకోవడం వల్లే అంతో ఇంతో ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టే ఇప్పటికీ వలిమై లాంటివి టైటిల్ మార్చకుండా కేవలం డబ్బింగ్ చేసి రిలీజ్ చేసినా దానికి జరిగిన బిజినెస్ కు తగ్గట్టు డీసెంట్ గా వర్కౌట్ చేసుకున్నాయి

కానీ తెగింపు కేసు వేరు. మొన్న ట్రైలర్ వచ్చింది. రెండు నిమిషాల వీడియో మొత్తం యాక్షన్ బిట్స్ తో నింపేశారు. కథ ఏంటో దాదాపుగా గుట్టు విప్పేశారు. పట్టపగలు ఓ బ్యాంకు దొంగతానికి తెగబడ్డ ముఠా నాయకుడు హీరో అజిత్. కోట్లాది రూపాయలు కొల్లగొట్టేసి పోలీస్ డిపార్ట్ మెంట్ కి సవాల్ విసిరి తప్పించుకుని పోతాడు. అతన్ని వెంటపడే క్రమంలో జరిగే భీభత్సమైన అరాచక సంఘటనలే ఈ తెగింపు. స్టోరీ లైన్ విజువల్స్ టేకింగ్ ఆ మధ్య విజయ్ బీస్ట్ కు దగ్గరగా ఉందని నెటిజెన్లు అభిప్రాయపడుతున్నారు. నెట్ ఫ్లిక్స్ సూపర్ హిట్ వెబ్ సిరీస్ మనీ హీస్ట్ కూడా ఇదే ప్లాట్ మీద నడిచే విషయం తెలిసిందే.ఇలాంటివి కొరియన్ భాషలో చాలా ఉన్నాయి

అసలు వీటికి మూలం మన తెలుగులోనే ఉందని తెలిస్తే ఆశ్చర్యం కలగకమానదు. సుమారు ముప్పై ఐదేళ్ల క్రితం మల్లాది వెంకట కృష్ణమూర్తి గారు 9 గంటలు అనే నవల రాశారు. ఆ టైంలో అది పాపులర్ పుస్తకం. బ్యాంకు దోపిడీకి వచ్చిన దుండగులు అందులోనే చిక్కుకుపోతే వాళ్లకు పోలీసులకు మధ్య జరిగే గేమ్ ఆధారంగా దాన్ని రాశారు. ఆ మధ్య దర్శకుడు క్రిష్ నిర్మాతగా మారి తారకరత్నతో తీసిన 9 అవర్స్ వెబ్ సిరీస్ కి ఇదే ఆధారం. తెగింపులో దీని ఛాయలు కనిపిస్తున్నాయి. విజువల్స్ మాత్రం హాలీవుడ్ స్టైల్ లో ఉన్నాయి కానీ కథాకథనాలు దేశీయబాణీలో ఉంటేనే కదా ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేది.అసలే విపరీతమైన పోటీ మధ్య వస్తున్న తెగింపు టైటిల్ కి తగ్గట్టు తెగించి మెప్పిస్తుందో లేదో లెట్ వెయిట్ అండ్ సీ

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి