iDreamPost

Ajay Devgn vs Kiccha Sudeep ఇద్దరు హీరోల హిందీ బాష రగడ

Ajay Devgn vs Kiccha Sudeep ఇద్దరు హీరోల హిందీ బాష రగడ

ఇటీవలే జరిగిన రామ్ గోపాల్ వర్మ – ఉపేంద్ర సినిమా లాంచ్ ఈవెంట్ లో హిందీ ఇకపై మాతృబాష కాదని ఈగ విలన్ కన్నడ హీరో కిచ్చ సుదీప్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. తన ఉద్దేశం కాసేపు పక్కన పెడితే దానికి అజయ్ దేవగన్ స్పందించిన తీరు మాత్రం ఇష్యూ ని పూర్తిగా పక్కదారి పట్టించేసింది. నిజానికి సుదీప్ చెప్పాలనుకున్న అర్థం వేరు. ఇకపై ప్యాన్ ఇండియా మూవీస్ అంటే హిందీ లాంటి బాషలకు పరిమితం కాదని, సౌత్ లో బాలీవుడ్ ను మించిన గ్రాండియర్లు తీస్తున్నారని, అందుకే హిందీని మాత్రమే జాతీయ భాషగా చూడలేమని అన్నాడు. సరే సుదీప్ అభిప్రాయం తప్పేమి లేదు కదాని మీడియా దాన్ని లైట్ తీసుకుంది.

ఎప్పుడైతే అజయ్ దేవగన్ దీన్ని తప్పుబడుతూ ట్వీట్ చేశాడో అక్కడి నుంచి కొత్త కథ మొదలయ్యింది. హిందీ జాతీయ భాషగా ఒప్పుకోనప్పుడు కన్నడ చిత్రాలను డబ్బింగ్ చేసి ఎందుకు వదులుతున్నావని ప్రశ్నించాడు. దీంతో ఎక్కడో మండిన సుదీప్ దానికి తగ్గట్టుగా ధీటుగానే బదులిచ్చాడు. మీరు హిందీలో ట్వీట్ చేశారు కానీ తనకది అర్థం కాదని. ఒకవేళ మీలాగే నేను కూడా మాతృబాషలో సమాధానం చెప్తే ఎలా ఉంటుందని చురకలు వేశాడు. ఇలా ఇద్దరూ పరస్పరం సాఫ్ట్ గా వాదులాడుకున్నారు. ఫైనల్ గా అజయ్ దేవగన్ తానే అపార్థం చేసుకున్నానని అర్థం వచ్చేలా చెప్పేసి ముగింపు పలికాడు. ఈ లోగా కింద కామెంట్స్ లో నానా రచ్చ అయిపోయింది.

ఇప్పుడిది మెల్లగా రాజకీయ రంగు పులుముకుంటోంది. కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య హిందీ ఎప్పటికీ జాతీయ బాష కాదని ట్వీట్ చేయడం నిప్పు రాజేసినట్టే అనుకోవాలి. ఆ ఇద్దరు హీరోలు సైలెంట్ అయ్యాక ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఇతర వర్గాలు యుద్ధానికి తెరతీస్తున్నాయి. నిజానికి రాజ్యాంగంలో హిందీని భారతదేశ జాతీయభాషగా అంగీకరించాలని ఎక్కడా లేదు. అలా ఉందన్నట్టు చెప్పుకుంటూ వచ్చారు అంతే. కానీ ఇప్పుడీ ట్విస్ట్ తో దీని మీద నిజానిజాలు వెలికితీయాలనే డిమాండ్లు మొదలవుతున్నాయి. ఎవరో జ్వాలలు రగిలించారు వేరెవరో దానికి బలి అయ్యారు పాట తరహాలో ఇదింకా ఎక్కడికి వెళ్తుందో.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి