iDreamPost

కుతుబ్ మినార్ మాదే, తెర మీదకు మరో వివాదం

కుతుబ్ మినార్ మాదే, తెర మీదకు మరో వివాదం

కుతుబ్ మినార్ చుట్టూ రోజుకో వివాదం ముసురుకుంటోంది. ఇక్కడ ప్రార్థనలు చేసే విషయమై ఓవైపు కోర్టులో కేసు నడుస్తుండగానే, ఏకంగా ఇది మా ఆస్తి అంటూ ఒకాయన తెర మీదకొచ్చాడు. ఆగ్రా రాజవంశానికి చివరి వారసుడిగా చెప్పుకుంటున్న ఆయన పేరు కువర్ మహేంద్ర ధ్వజ్ ప్రసాద్ సింగ్. 1695లో చనిపోయిన రాజా నంద రామ్ వంశీకులైన బెస్వాన్ రాజ కుటుంబానికి చెందినవాడినని ఈయన చెబుతున్నాడు. చెప్పడమే కాదు మీరట్ నుంచి ఆగ్రా వరకు విస్తరించి ఉన్న ప్రాంతమంతా తమకే చెందుతుందని, దానిపై హక్కులు కల్పించాలని భారత పురాతత్వ సంస్థ (ASI)కి ఒక అర్జీ పెట్టుకున్నాడు. ఆయన వాదన ప్రకారం నంద రామ్, ఔరంగజేబు చక్రవర్తికి సామంతరాజుగా మారి “ఖిద్మత్ జమీందారీ”ని పొందాడు. అంటే జోర్, తోచిగఢ్ ప్రాంతాల పన్ను వసూళ్ళను ఆయనే చూసుకున్నాడట. అయితే స్వాతంత్ర్యం వచ్చాక భారత ప్రభుత్వం ఈ ప్రాంతంపై హక్కుల కోసం తమ కుటుంబంతో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని ప్రసాద్ సింగ్ అర్జీలో పేర్కొన్నాడు. అయితే ASI ఈ అభ్యర్థనను తోసిపుచ్చింది. 150 ఏళ్ళ నుంచి ఆ రాజవంశం నిద్రపోతుందా అని ASI వర్గాలు వ్యాఖ్యానించాయి.

మరోవైపు కుతుబ్ మినార్ కాంప్లెక్స్ లో ఒకప్పుడున్న దేవాలయాన్ని పునరుద్ధరించి అక్కడ ప్రార్థనలకు అనుమతించాలంటూ హిందువులు, జైనులు పెట్టుకున్న పిటిషన్ పై విచారణ ఢిల్లీలోని సాకేత్ జిల్లా కోర్టులో కొనసాగుతోంది. తదుపరి విచారణ సెప్టెంబర్ 13కి వాయిదా పడింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి