iDreamPost

మోదీ వచ్చాక పలు రాష్ట్రాల్లో కూలిన భాజపాయేతర ప్రభుత్వాలు

మోదీ వచ్చాక పలు రాష్ట్రాల్లో కూలిన భాజపాయేతర ప్రభుత్వాలు

మన దేశంలో, రాష్ట్రాలలో ఒక్కోసారి ప్రభుత్వాలు కూలడం, అప్పటిదాకా ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు అధికారం చేపట్టడం జరుగుతూనే ఉంటుంది. అయితే ఇది పలు రాష్ట్రాల్లో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక ఎక్కువగా జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం మహారాష్ట్రం ప్రభుత్వానికి గండం ఏర్పడింది. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం రెండు పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వంగా ఏర్పడింది. ఇప్పుడు అది కూలిపోయే పరిస్థితి వచ్చింది. దీంతో విపక్షంలో ఉన్న బీజేపీ అధికారం కోసం చూస్తుంది. ఇలాగే గతంలోనూ బీజేపీ పలు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు కూలిపోతే తాము అధికారంలోకి వచ్చాయి.

మోదీ 2014లో తొలిసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా పలు రాష్ట్రాల్లో భాజపాయేతర ప్రభుత్వాలు పలు కారణాల వల్ల, అంతర్గత కారణాల వల్ల, రెబల్ ఎమ్మెల్యేల వల్ల కుప్పకూలాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేల మద్దతుతో చాలా చోట్ల కాషాయపార్టీ అధికారం చేపట్టింది.

అరుణాచల్‌ప్రదేశ్‌ లో 2014లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మొత్తం 60 సీట్లకు గాను కాంగ్రెస్‌ పార్టీ 42 స్థానాల్లో గెలుపొంది అతిపెద్ద పార్టీగా నిలిచింది. బీజేపీ అప్పుడు 11 స్థానాల్లోనే విజయం సాధించింది. అయితే 2016లో ముఖ్యమంత్రి పెమాఖండూ సహా మొత్తం 41 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఆ పార్టీ నుంచి ఫిరాయించి, భాజపా నేతృత్వంలోని ‘నార్త్‌-ఈస్ట్‌ డెమోక్రటిక్‌ అలయెన్స్‌’కు చెందిన పీపుల్స్‌ పార్టీ ఆఫ్‌ అరుణాచల్‌ప్రదేశ్‌లో చేరి బీజేపీ ప్రభుత్వంగా ఏర్పాటు చేశారు.

బిహార్‌లో 2015 శాసనసభ ఎన్నికల అనంతరం నీతీశ్‌కుమార్‌ నేతృత్వంలో జేడీ(యూ), ఆర్జేడీ, కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే ఈ కూటమి నుంచి 2017లో జేడీ(యూ) బయటకు వచ్చి భాజపాతో చేతులు కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

మధ్యప్రదేశ్‌ లో 2018 అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్‌ పార్టీ కమల్‌నాథ్‌ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పార్టీ ఎమ్మెల్యేలు, స్వతంత్రులు కలిపి మొత్తం 121 మంది సభ్యుల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే జ్యోతిరాదిత్య సింధియా సహా మొత్తం 26 మంది కాంగ్రెస్‌ శాసనసభ్యులు తిరుగుబాటు ప్రకటించడంతో 2020 మార్చిలో కాంగ్రెస్‌ సర్కారు కుప్పకూలి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ నేతృత్వంలో భాజపా సర్కారు కొలువుదీరింది.

మణిపుర్‌ లో 2017లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 60 స్థానాలకు గాను కాంగ్రెస్‌ 28 చోట్ల విజయం సాధించగా 21 స్థానాల్లో బీజేపీ గెలుపొందింది. అయితే 9 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను తనవైపుకు తిప్పుకొని వారి మద్దతుతో బీజేపీ అధికారం చేపట్టింది.

గోవాలో 2017 ఎన్నికల్లో 40 సీట్లకుగాను కాంగ్రెస్‌ 17 స్థానాలు గెలవగా బీజేపీ 13 స్థానాలు గెలిచింది. అయినా ఇతర పార్టీలకు చెందిన పది మంది సభ్యులు, ఓ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మద్దతుతో భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత 2019లో కాంగ్రెస్‌ నుంచి మరో 15 మంది ఎమ్మెల్యేలు బీజేపీ లో చేరారు.

కర్ణాటక 2018 ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన ఆధిక్యత లభించలేదు. 222 అసెంబ్లీ స్థానాలకు గానూ భాజపాకు అత్యధికంగా 104 సీట్లు, కాంగ్రెస్‌కు 80, జేడీ(ఎస్‌)కు 37 సీట్లు వచ్చాయి. భాజపా నేత యడియూరప్ప ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా విశ్వాస పరీక్షలో నెగ్గలేదు. దీంతో కుమారస్వామి నేతృత్వంలో కాంగ్రెస్‌-జేడీ(ఎస్‌) సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 2019లో కాంగ్రెస్‌, జేడీ(ఎస్‌)ల నుంచి రెబల్స్ గా మారిన 16 మందిని తమవైపు తిప్పుకొని కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది బీజేపీ.

ఉత్తరాఖండ్‌ 2016 మార్చిలో 9 మంది ఎమ్మెల్యేలు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడంతో అక్కడ రాష్ట్రపతి పాలన విధించగా బీజేపీ ఆ ఎమ్మెల్యేలతో మాట్లాడి తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

జమ్మూ-కశ్మీర్‌ లో 2014లో జరిగిన ఎన్నికల్లో 87 స్థానాలకు గాను ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ లభించలేదు. పీడీపీ 28 సీట్లు తెచ్చుకోగా, భాజపా 25 స్థానాలు సాధించింది. మొదట పీడీపీ బీజేపీతో ప్రభుత్వ ఏర్పాటుకు ఒప్పుకోకపోయినా తర్వాత మళ్ళీ వీళ్లిద్దరి కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 2018లో బీజేపీ తమ మద్దతు ఉపసంహరించుకోవడంతో ముఫ్తీ సర్కారు కుప్పకూలగా ప్రస్తుతం రాష్ట్రపతి పాలన నడుస్తుంది. ఇప్పుడు త్వరలో మహారాష్ట్రలో కూడా బీజేపీ మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేసే సూచనలు కనిపిస్తున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి