iDreamPost

బీజేపీ వైపు రేవంత్ చూపు, కమలనాథుల ఆశలన్నీ హరీష్ వైపు

బీజేపీ వైపు రేవంత్ చూపు, కమలనాథుల ఆశలన్నీ హరీష్ వైపు

తెలంగాణా రాజకీయాల్లో కీలక మలుపులు ఖాయమనే సంకేతాలు కనిపిస్తున్నాయి. దుబ్బాక ఉప ఎన్నికల్లో తమ ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ కాదని, బీజేపీగా ప్రకటించడం ద్వారా టీఆర్ఎస్ ఓ సంకేతానికి సిద్దమయినట్టు కనిపించింది. కాంగ్రెస్ తో సహా కేసీఆర్ ని వ్యతిరేకించే శక్తులన్నీ బీజేపీని బలపరిచేందుకు ఆ ప్రకటన తోడ్పడింది. చివరకు బీజేపీ విజయానికి టీఆర్ఎస్ ప్రకటన కూడా ఓ కారణంగా భావించేవాళ్లున్నారు. అంతేగాకుండా భవిష్యత్ తెలంగాణా రాజకీయ ముఖచిత్రంపై పలు మార్పులకు దోహదపడేందుకు దుబ్బాక ఫలితాలు తోడ్పడినట్టు కనిపిస్తోం ది.

తాజా పరిణామాలతో మూలంగా బీజేపీలో వచ్చిన జోష్ ని ఉపయోగించుకోవాలని కమలనాథులు పావులు కదుపుతున్నారు. దానికి అనుగుణంగా వివిధ పార్టీల్లోని నేతలను తమవైపు తిప్పుకునే వ్యూహాన్ని రచిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ కి చెందిన కీలక నేతల కొందరు కమలం వైపు చూస్తున్నట్టు కథనాలు వస్తున్నాయి. అందుకు అనుగుణంగా విజయశాంతి త్వరలో బీజేపీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్దమవుతున్నారు. ఆమె రాకకు బీజేపీలో అడ్డు లేకపోవడంతో త్వరలో మళ్లీ పాత గూటికి ఆమె చేరిక అనివార్యం అవుతోంది.

విజయశాంతితో పాటుగా ప్రస్తుతం మల్కాజ్ గిరి ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా బీజేపీ బాటలో సాగబోతున్నట్టు ప్రచారం మొదలయ్యింది. రేవంత్ రెడ్డి నేపథ్యం కూడా ఏబీవీపీ నుంచి మొదలుకావడంతో అది తోడ్పడే అవకాశం ఉంది. అదే సమయంలో రెడ్డి సామాజికవర్గాన్ని దగ్గర చేర్చుకోవాలని బీజేపీ ఆశిస్తున్న తరుణంలో రేవంత్ రెడ్డి దానికి తగిన నాయకుడిగా భావిస్తున్నారు. రేవంత్ రెడ్డికి ఉన్న వ్యక్తిగత ఫాలోయింగ్ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నారు. ఇక కాంగ్రెస్ తెలంగాణాలో బలహీనపడుతున్న సమయంలో తన భవిష్యత్ కోసం బీజేపీకి జై కొట్టే యోచన చేస్తున్నట్టు కనిపిస్తోంది. జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ కోలుకుంటుందనే విశ్వాసం కూడా చాలామందిలో కనిపిస్తోంది. అందుకు అనుగుణంగానే రేవంత్ రెడ్డి కూడా ఇటు తెలంగాణాలో కాంగ్రెస్ పునాదులు కోల్పోతుండగా, జాతీయ స్థాయిలో పూర్వవైభవం సందేహాస్పదంగా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే ఎన్నికల నాటికి బీజేపీ తో సాగడం శ్రేయస్కరమనే లెక్కలు వేస్తున్నట్టు కనిపిస్తోంది.

బీజేపీతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ టీడీపీ ద్వారానే రేవంత్ రెడ్డి గుర్తింపు సాధించారు. ఆ తర్వాత టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో ఆయన కయ్యానికి దిగారు. చివరకు ఓటుకి నోటు కేసులో ఆయన పట్టుబడిన తర్వాత పరిణామాలు మారిపోవడంతో టీడీపీని వీడి కాంగ్రెస్ గూటికి చేరి మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో పట్టు నిలుపుకున్నారు. కేసీఆర్ ఎంత ప్రయత్నించినా రేవంత్ రెడ్డి విజయం సాధించడం ద్వారా తెలంగాణా రాజకీయాల్లో గట్టి నేతగా గుర్తింపు సాధించారు. అయితే చంద్రబాబు వ్యూహంలో భాగంగానే రేవంత్ రెడ్డి టీడీపీ ని వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారనే విమర్శలున్నాయి. దానికి తగ్గట్టుగానే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. ఇక ప్రస్తుతం ఏపీలో టీడీపీ అధినేత బీజేపీతో మళ్లీ స్నేహం చేయాలని ఆశిస్తుండగా, తెలంగాణాలో బాబు అనుచరుడు కూడా బీజేపీ బాటలో సాగుతున్నట్టు సంకేతాలు రావడం కూడా విశేషంగానే భావించాలి.

అదే సమయంలో బీజేపీ నేతలు మాత్రం బలమైన నేతగా ఉన్న హరీష్ రావు కోసం ఆశాభావంతో ఎదురుచూస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే హరీష్ రావు వ్యవహారశైలి మీద పలుమార్లు కథనాలు వచ్చాయి. టీఆర్ఎస్ లో కేటీఆర్ హవాని ఆయన సహించలేకపోతున్నట్టు సందేహిస్తున్నారు. మొన్నటి దుబ్బాక ఎన్నికల్లో కూడా హరీష్‌, కేటీఆర్ మధ్య సమన్వయం లోపం కూడా ప్రభావం చూపిందనే వాదనలున్నాయి. ఈ తరుణంలో టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరాలని ఆయనకు ఆహ్వానం పలుకుతున్నట్టు చెబుతున్నారు. హరీష్‌ వస్తే టీఆర్ఎస్ ని తీవ్రంగా దెబ్బకొట్టే అవకాశం ఉంటుందని బీజేపీ ఆశిస్తోంది. దానికి అనుగుణంగానే ఆయనకు ఎరవేసే పనిలో ఉంది. ఆయితే ఆయన మాత్రం ప్రస్తుతానికి అటువైపు మొగ్గుచూపే అవకాశం లేదని పలువురు అంచనా వేస్తున్నారు. ఏమయినా బీజేపీ దీర్గకాల లక్ష్యాలతో సాగిస్తున్న ప్రచార ఎత్తుగడలు ఇప్పుడు తెలంగాణా రాజకీయాల్లో తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం కనిపిస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి