iDreamPost

విద్యా సంవత్సరం మారిపోతోందా ? ఇకనుండి సెప్టెంబర్ నుండేనా ?

విద్యా సంవత్సరం మారిపోతోందా  ? ఇకనుండి సెప్టెంబర్ నుండేనా ?

దశాబ్దాలుగా జూలై నుండి మొదలవుతున్న విద్యా సంవత్సరం ఇక నుండి మారిపోతుందా ? కరోనా వైరస్ దెబ్బకు మొత్తం వ్యవస్ధల్లో దాదాపు కుప్పకూలినట్లే విద్యా సంవత్సరం కూడా పూర్తిగా దెబ్బ తినేసినట్లే. కరోనా వైరస్ తీవ్రత కారణంగా దేశంలోని అన్నీ రాష్ట్రాల్లోను విద్యా సంస్ధలను మార్చిలోనే మూసేసిన విషయం అందరికీ తెలిసిందే. మధ్యలోనే ఆగిపోయిన పదవ తరగతి పరీక్షలు ఏమవుతాయి ? ఇంటర్మీడియట్ పరీక్షల సంగతేమిటి ? ఏప్రిల్ లో మొదలవ్వాల్సిన ఇంజనీరింగ్ పరీక్షలు కూడా జరిగలేదు.

వార్షిక పరీక్షలు నిర్వహించలేకే 1వ తరగతి నుండి 9వ తరగతి వరకూ పరీక్షలు పెట్టకుండానే పై తరగతులకు ప్రమోట్ చేసేశారు. అస్తవ్యస్ధమైన విద్యా వ్యవస్ధను గాడిలో పెట్టటానికి యూనివర్సిటి గ్రాంట్స్ కమీషన్ రెండు కమిటిలను నియమించింది. అకడమిక్ అంశాలు, ఆన్ లైన్లో పరీక్షల నిర్వహణ తదితర అంశాలపై అధ్యయనం చేసి నివేదికలు ఇచ్చేందుకు యూజీసి రెండు కమిటిలను నియమించింది.

రెండు కమిటీలకు హరియాణా యూనివర్సిటి వైస్ ఛాన్సలర్ ఆర్సీ కుహద్, ఇందిరా గాంధి నేషనల్ ఓపెన్ యూనివర్సిటి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. దాదాపు పదిరోజుల పాటు రెండు కమిటీలు అనేక అంశాలను అధ్యయనం చేసి శుక్రవారం యూజీసికి తమ నివేదికలను అందించాయి.

కుహద్ కమిటి నివేదిక ప్రకారం విద్యా సంవత్సరం జూలై నుండి సెప్టెంబర్ కు మార్చాలని సూచించింది. అయితే ఈ ఒక్కసారికి విద్యా సంవత్సరాన్ని సెప్టెంబర్ కు మార్చాలా ? లేకపోతే ఇకనుండి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ టు సెప్టెంబర్ గానే పరిగణించాలని సూచించిందా ? అన్న విషయంలోనే క్లారిటి లేదు. ఇక నాగేశ్వరరావు కమిటి అయితే ఆన్ లైన్లో పరీక్షలు నిర్వహించటానికి అవసరమైన మౌళిక సదుపాయాలు ఉంటే ఆన్ లైన్లో పరీక్షలు నిర్వహించవచ్చని సూచించింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మరో పదిరోజుల్లో నిర్ణయాన్ని ప్రకటించనుంది. చూద్దాం ఎటువంటి నిర్వయం తీసుకుంటుందో.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి