iDreamPost

ఆన్లైన్‌లో గేమ్ ఆడి తల్లి అకౌంట్‌లో 36 లక్షలు పోగొట్టిన బాలుడు..

ఆన్లైన్‌లో గేమ్ ఆడి తల్లి అకౌంట్‌లో 36 లక్షలు పోగొట్టిన బాలుడు..

ఇటీవల పిల్లలు, టీనేజ్ లో ఉండే వాళ్ళు ఫోన్ గేమ్స్ కి బాగా అలవాటు పడ్డారు. ఒక్కసారి గేమ్ కి అలవాటు అయితే డబ్బులు కట్టి అయినా సరే గేమ్ ఆడాల్సిందే అని ఫిక్స్ అయిపోతున్నారు. ఇలాగే ఆన్లైన్ లో గేమ్ ఆడి తన తల్లి అకౌంట్ లో ఉన్న రూ.36 లక్షలు పోగొట్టాడు ఓ బాలుడు. అంబర్‌పేట్‌కు చెందిన ఓ 16 ఏళ్ళ బాలుడు తన తాత మొబైల్‌ తీసుకొని అందులో ‘ఫ్రీ ఫైర్‌ గేమింగ్‌’ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేశాడు. అయితే ఆ గేమ్ ఆడటానికి డబ్బులు పెట్టాల్సి రాగా తాత ఫోన్‌లో తన తల్లి అకౌంట్ యాడ్ అయి ఉంది. దీంతో తన తల్లి అకౌంట్‌ నుంచి మొదట రూ.1,500 పెట్టి గేమ్ మొదలు పెట్టాడు.

ఇక ఆ తర్వాత గేమ్ కంటిన్యూగా ఆడటం మొదలు పెట్టాడు. రెండోసారి రూ.10 వేల చొప్పున డబ్బులు పెట్టి గేమ్ ఆడాడు. అలా ఆడుతూ ఆడుతూ తన తల్లి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ నుంచి రూ.9 లక్షలు పోగొట్టేసాడు. అంతటితో ఆగకుండా ఈ ఘనుడు ఎస్‌బీఐ బ్యాంక్‌ ఖాతాని కూడా యాడ్ చేసి అందులోంచి ఒకసారి రూ.2 లక్షలు, రూ.1.60 లక్షలు, రూ.1.45 లక్షలు, ఇలా విడతలవారీగా రూ.27 లక్షలతో గేమ్ ఆడాడు.

ఆ బాలుడి తల్లి తనకు డబ్బులు అవసరమై బ్యాంక్‌కు వెళ్తే ఖాతా ఖాళీ అని అధికారులు చెప్పారు. దాంతో ఆ తల్లి షాక్ కి గురయింది. ఆ తర్వాత వెంటనే హైదరాబాద్‌ సైబర్‌ పోలీసులను ఆశ్రయించింది ఆ తల్లి. హెచ్‌డీఎఫ్‌సీ ఖాతాలోంచి రూ.9 లక్షలు, SBI ఖాతా నుంచి రూ.27 లక్షలు పోయాయని, ఆ డబ్బు తన భర్త కష్టార్జితమని, ఆయన సైబరాబాద్‌ పోలీసుశాఖలో పని చేశారని, ఆయన చనిపోయాక ఆ డబ్బులు వచ్చాయని పోలీసులకి చెప్పి వాపోయింది ఆ తల్లి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందుకే మీ పిల్లలకి ఫోన్ ఇచ్చేటప్పుడు జాగ్రత్త వహించండి, ఫోన్ ని పిల్లలకు ఎక్కువగా అలవాటు చేయకండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి