iDreamPost

నయా మోసం.. లుంగీలు కొనేందుకు వచ్చి యజమానికే టోకరా

నయా మోసం.. లుంగీలు కొనేందుకు వచ్చి యజమానికే టోకరా

ఇంట్లో, చేతిలో నగదు వాడకం చాలా వరకు తగ్గిపోయింది. ఫోన్ పే, గూగుల్ పే, పేటీయం వంటి సోషల్ మీడియా యాప్స్ ద్వారా ఆన్ లైన్ ట్రాన్సాక్షన్ జరిగిపోతుండటంతో దొంగలకు నగదు రూపంలో ఓ పట్టాన ఏమీ దొరకడం లేదు. అయితే అందులో కూడా మన డబ్బులు సేఫ్ అనలేం. సైబర్ నేరగాళ్ల రూపంలో నగదు మాయం అవుతుంది. మన మొబైల్‌కే కాల్ చేసి బ్యాంకు నుండి కాల్ చేస్తున్నామని చెప్పి, ఏటీఎం నంబర్, పిన్ నంబర్ చెప్పండి అంటూ మభ్యపెడుతూ.. డబ్బులు గుంజేస్తున్నారు. ఆధునిక టెక్నాలజీ సాయంతో మనకు తెలియకుండానే ఖాతాల్లోని దుడ్డును దోచేస్తున్నారు. అయితే ఎప్పటికప్పుడు దొంగలు నయా దందాను అనుసరిస్తూనే ఉన్నారు. తాజాగా ఓ వ్యక్తి బట్టలు కొనుగోలు చేసేందుకు వచ్చి యజమాని నుండి సుమారు లక్ష రూపాయలు కొట్టేశాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. యర్రగొండపాలెంలో శ్రీలక్ష్మి వెంకటేశ్వర క్లాత్ ఎంపోరియం పేరుతో బట్టల దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు గుడిపాటి కోటేశ్వరరావు. అయితే ఓ వ్యక్తి తన దుకాణానికి లుంగీలు కొనేందుకు వచ్చాడు. లుంగీలు కొన్నాక.. తన వద్ద డబ్బులు లేవని, ఫోన్ పే చేస్తానంటూ యజమానికి చెప్పాడు. అనంతరం అక్కడ ఉన్న స్కానర్‌కు స్కాన్ చేసి డబ్బులు పంపించినట్లు నటించాడు. డబ్బులు వచ్చాయంటూ చెప్పాడు. అయితే పరిశీలించిన యజమాని డబ్బులు రాలేదని చెప్పాడు. అయితే ఆ సమయంలో కోటేశ్వరరావు ఫోన్ లాక్ తీయడం, ఫోన్ పే పాస్ట్ వర్డ్ వినియోగించడాన్ని గమనించాడు. ఆ నంబర్లను గుర్తుపెట్టుకున్నాడు కేటుగాడు. షాపు యజమాని డబ్బులు రాలేదు అనేసరికి.. ఇటువ్వండి నేను చూస్తానంటూ అతడి వద్ద నుండి ఫోన్ తీసుకున్నాడు కేటుగాడు. ఫోన్ తనిఖీ చేస్తున్నట్లు నటించాడు.

అంతలో యజమాని ఫోన్ పే ఖాతాలో నుండి రూ. 98 వేలను దుండగుడు తన ఖాతాకు ట్రాన్స్ ఫర్ చేసుకున్నాడు. వెంటనే మొబైల్ ఫోనును షాపు యజమానికి ఇచ్చి.. తను చెల్లించాల్సిన డబ్బులు జమ చేసేశాడు. అనంతరం మెల్లిగా అక్కడ నుండి జారుకున్నాడు. అతడు వెళ్లిపోయాక.. తన ఖాతాను తనిఖీ చేసుకున్న యజమాని కోటేశ్వరరావు రూ. 98 వేల మాయం అయినట్లు గుర్తించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే పోలీసులు ఆ ఖాతా వివరాలను పరిశీలించి, నిందితుడు కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. దొంగ ఆచూకీ కోసం సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి