iDreamPost

Beast : కన్నడ సినిమా ఛాయల్లో విజయ్ మూవీ

Beast : కన్నడ సినిమా ఛాయల్లో విజయ్ మూవీ

విజయ్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న బీస్ట్ షూటింగ్ దాదాపు పూర్తయినట్టే. రేపు విడుదల తేదీ ప్రకటించబోతున్నారు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఏప్రిల్ 13 లేదా 14 వీటిలో ఒక డేట్ పక్కాగా ఉంటుందని అంటున్నారు. అయితే కెజిఎఫ్ 2తో నేరుగా తలపడేందుకు సిద్ధపడటం ప్యాన్ ఇండియా లెవెల్ లో కొంత ప్రభావం చూపించొచ్చు. ఇంకొద్ది గంటల్లో అదేంటో తేలిపోతుంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో ఫస్ట్ ఆడియో సింగల్ ఇటీవలే ఎంత సెన్సేషన్ సృష్టించిందో సోషల్ మీడియా వేదికగా చూశాం. అనిరుద్ రవిచందర్ ట్యూన్ జనానికి బాగా కనెక్ట్ అయిపోయింది.

ఇప్పుడు దీని తాలూకు లీక్డ్ స్టోరీ లైన్ ఫ్యాన్స్ లో పెద్ద చర్చకే దారి తీసింది. దాని ప్రకారం బీస్ట్ స్టోరీ మొత్తం ఒక పెద్ద షాపింగ్ మాల్ లో జరుగుతుందట. ఇంట్రోడక్షన్, పాటలు మినహాయించి సినిమా చివరిదాకా విజయ్ ఒకే కాస్ట్యూమ్ లో అది కూడా తెల్లని ప్యాంట్ బనియన్ తో ఉంటాడని వినికిడి. వినడానికి వెరైటీగా ఉంది కదూ. మాల్ లో బందీలు కాబడిన వారిని కాపాడే మిషన్ మీద వచ్చిన ఆఫీసర్ గా విజయ్ క్యారెక్టర్ డిఫరెంట్ గా ఉంటుందని అంటున్నారు ఇదెంత వరకు నిజమో ట్రైలర్ వచ్చాక క్లారిటీ వస్తుంది. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ లాంటి ప్లానింగ్ ఏదీ బీస్ట్ టీమ్ పెట్టుకోలేదట. టైం తక్కువగా ఉండటంతో డ్రాప్ అయ్యారని అంటున్నారు.

బీస్ట్ తెలుగులోనూ ఒకేసారి రిలీజ్ అవుతుంది. ఇక్కడ హక్కులు కొన్న నిర్మాత ఎవరో ఇంకా తెలియలేదు. సన్ పిక్చర్స్ నిర్మాణం కాబట్టి పెద్దన్న, ఈటిల ద్వారా నష్టపోయిన వాళ్ళకే దీన్ని ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి కథతో గతంలో వచ్చిన సినిమాలు తక్కువ. 90 దశకంలో ఇదే తరహాలో బ్యాంక్ లో సాగే కథతో కన్నడలో విష్ణువర్ధన్ హీరోగా నిష్కర్ష అనే మూవీ వచ్చింది. అప్పట్లో పెద్ద హిట్టు. తెలుగులో నిర్బంధం పేరుతో డబ్బింగ్ చేశారు. ఇందులో కూడా హీరో సింగల్ డ్రెస్సుతో టెర్రరిస్టుల నుంచి బందీలను కాపాడే పాయింట్ తో సాగుతుంది. మరి బీస్ట్ కూడా అదే ఛాయల్లో కనిపిస్తోంది. రిలీజయ్యాకే ఇది నిజమో కాదో తెలుస్తుంది

Also Read : James : భారీ ఎత్తున విడుదల కానున్న పునీత్ చివరి సినిమా