iDreamPost

కరోనా దెబ్బకు అల్లాడిపోతున్న అగ్రరాజ్యం .. 4591 మంది మృతి

కరోనా దెబ్బకు అల్లాడిపోతున్న అగ్రరాజ్యం .. 4591 మంది మృతి

ప్రపంచం దేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తి, తీవ్రత తగ్గుతున్నట్లు అనిపిస్తున్నా అగ్రరాజ్యం అమెరికాను మాత్రం అల్లకల్లోలం చేసేస్తోంది. అన్నీ రికార్డులను బద్దలు చేస్తు గడచిన 24 గంటల్లో మొత్తం అమెరికాలో 4591 మంది వైరస్ దెబ్బకు చనిపోయినట్లు అమెరికా ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించింది. మంగళవారం రాత్రి నుండి బుధవారం రాత్రి వరకూ మరణించిన 2569 మరణాలు అమెరికా రికార్డని తేలటంతో ప్రభుత్వం వణికిపోయింది. అలాంటిది ఆ తర్వాత నమోదైన 4591 మరణాలతో వైరస్ నియంత్రణ విషయంలో అమెరికా ప్రభుత్వం చేతులెత్తేసినట్లే కనపిస్తోంది.

వైరస్ దెబ్బకు విలవిల్లాడిపోయిన ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ లాంటి దేశాల్లో గడచిన ఐదు రోజులుగా వైరస్ తీవ్రత తగ్గుతోందని ఆయా దేశాలు విడుదల చేస్తున్న గణాంకాలతో అర్ధమవుతోంది. బాధితుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్య కూడా తగ్గుతున్నట్లే అనుకోవాలి. అయితే పై దేశాలకు విరుద్ధంగా అమెరికాలో మాత్రం బాధితులు, మరణాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుండటమే అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఒకవైపు నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా మరోవైపు కేసులు, మరణాలు ఎందుకు పెరిగిపోతున్నాయో అర్ధం కావటం లేదు.

బహుశా మొదట్లో వైరస్ కట్టడికి ప్రభుత్వం చూపించిన నిర్లక్ష్యం ప్రభావమే ఇపుడు జనాలను బలి తీసుకుంటోందేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా మొత్తం మీద న్యూయార్క్, న్యూజెర్సీ రాష్ట్రాల్లోనే కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇక్కడే ఎందుకంటే పై రాష్ట్రాల్లో చైనా వాళ్ళు ఎక్కువగా ఉండటంతో పాటు ఐరోపా దేశాల నుండి పై రాష్ట్రాలకు జనాలు వచ్చేయటం కూడా మరో కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు.

అమెరికాలో సోకిన మొత్తం కేసుల్లో 30 శాతం అమెరికన్ ఆఫ్రికన్లేనట. కరోనా వైరస్ నియంత్రణకు అవసరమైన మెడికల్ ఎక్విప్మెంట్ ను చైనా నుండి అమెరికా ఓ రకంగా హైజాక్ చేసుకుని వెళుతోందనే చెప్పాలి. ఎలాగంటే ఫ్రాన్స్, ఇండియా, బ్రెజిల్ లాంటి దేశాలకు వెళ్ళాల్సిన మాస్కులు, గ్లౌజులు లాంటి వాటిని చైనాపై ఒత్తిడి పెట్టి అమెరికా తన దేశానికి తీసుకెళ్ళిన సంగతి అందరూ చూసిందే. కరోనా నియంత్రణకు ప్రభుత్వం ఎంత చేస్తున్నా సమస్యయితే పెరిగిపోతుంగటమే విచిత్రంగా ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి