iDreamPost

సీఎం రాజధాని ప్రకటనపై జనసేనాని వరుస ట్వీట్లు…

సీఎం రాజధాని ప్రకటనపై జనసేనాని వరుస ట్వీట్లు…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండే అవకాశం ఉందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ శాసనసభలో తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. రాజధాని అంశంపై జరిగిన చర్చలో జగన్ మాట్లాడుతూ అభివృద్ధి ఒకే ప్రాంతానికి పరిమితం కాకూడదని, వికేంద్రీకరణ జరగాలని పేర్కొన్నారు. సౌతాఫ్రికాకు మూడు రాజధానులు ఉన్నాయని తెలియజేసారు. ఏపీకి బహుశా మూడు రాజధానులు రావచ్చునని, రాజధానిపై ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ వారం రోజుల్లో నివేదిక ఇస్తుందని సభకు తెలియజేసారు. అమరావతిలో లెజిస్లేటివ్‌ క్యాపిటల్‌.. కర్నూలులో హైకోర్టు, జ్యూడిషియల్ క్యాపిటల్‌.. విశాఖలో ఎగ్జిక్యూటీవ్ క్యాపిటల్‌ పెట్టొచ్చని సీఎం జగన్‌ చెప్పారు.

అయితే రాష్ట్రానికి మూడు రాజధానులు రావొచ్చంటూ జగన్‌ పేర్కొన్న నేపథ్యంలో జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్ స్పందించారు. సీఎం జగన్‌ను ఉద్దేశించి వరుస ట్వీట్లు చేశారు. ‘తినడానికి మెతుకులు లేక తండ్రి ఏడుస్తుంటే.. కొడుకు వచ్చి పరమాన్నం అడిగాడంట. అమరావతి రాజధానికే ఇప్పటిదాకా దిక్కూ దివాణం లేదు. మరి జగన్‌రెడ్డి గారి మూడు అమరావతి నగరాలు అసలు అయ్యేనా? పాలకుల వలన రాష్ట్ర విభజన మొదలుకొని ఇప్పటి దాకా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు అనిశ్చితి, అశాంతి, అభద్రత తప్ప ఒరిగిందేమీ లేదు. కమిటీరిపోర్ట్‌ రాకమునుపే జగన్‌ రెడ్డి మూడు రాజధానులపై అభిప్రాయం చెప్పేశారు. ఇలాఅయితే అసలు కమిటీలు వేయడం దేనికి.? నిపుణుల్ని అపహాస్యం చేయడం దేనికి.?అని ప్రశ్నించారు

వైకాపా ప్లీనరీలో అమరావతికి ఒకే అన్నందుకు ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెబుతారా? మాట తప్పను.. మడమ తిప్పను అంటే ఇదేనా.? కేంద్రం అమరావతిని గుర్తించి మ్యాప్‌లో మార్పు చేసింది. ఏపీ నూతన రాజధానిగా కేంద్రం మూడు ప్రాంతాల్లో దేన్ని నోటిఫై చేయాలి? హైకోర్టు కర్నూలులో ఉంటే శ్రీకాకుళం నుంచి కర్నూలు వెళ్లాలా?అనంతపురం నుంచి ఉద్యోగులు విశాఖపట్నం వెళ్లి ఉద్యోగాలు చేయాలా? సామాన్య ప్రజలకు ఏదైనా కోర్టు, సెక్రటేరియట్‌లో పని ఉంటే వెళ్లడం సాధ్యమయ్యే పనేనా? ’ అంటూ పవన్‌ ట్విట్టర్ లో ప్రశ్నించారు.

సీజన్లో కొల్లేరుకి కొంగలు వచ్చినట్లుగా, సంవత్సరానికి మూడుసార్లు ఎమ్మెల్యేలు లెజిస్లేటివ్ రాజధానికి వెళ్ళాలన్నమాట. మూడుసీజన్లలో అమరావతికి వచ్చి, సభ నడిపి ఆ తర్వాత తాళాలు వేసేయాలనేది జగన్‌రెడ్డి ఆలోచనలా ఉంది. అమరావతిలో పరిపాలన ఇంకా పూర్తిగా కుదురుకోలేదు. వేలమంది ఉద్యోగులు, వారి కుటుంబాలు ఇప్పుడిప్పుడే రాజధాని ప్రాంతానికి అలవాటుపడుతున్నారు. వారి పిల్లల్లు కూడా రాజధాని ప్రాంతంలో విద్యాలయాల్లో చేరారు. వాళ్లని మళ్లీ ఎగ్జిక్యూటివ్ రాజధాని అని మరోచోటికి వెళ్లిపోమంటే ఎలా?రాజధాని మార్పు అంటే ఆఫీసు ఒకచోటు నుంచి మరోచోటుకు మార్చడం కాదు. కొన్నివేల జీవితాలను బలవంతంగా తరలించడమే. వారికయ్యే వ్యయప్రయాసలకి బాధ్యత ఎవరు తీసుకుంటారు అని పవన్‌ మరో ట్వీట్ లో ప్రశ్నించారు.

జగన్‌రెడ్డి అసెంబ్లీలో ప్రకటన ఒక వ్యూహం ప్రకారమే చేశారు. నేను పోరాటయాత్రలో ఉన్నప్పుడు ఉత్తరాంధ్ర భూములు చాలావరకు వైసీపీ నాయకుల చేతుల్లోకి వెళ్లిపోయాయని స్థానికులు చెప్పారు. విశాఖప్రాంతంలో భూములను ముందుగానే హస్తగతం చేసుకుంటూ వచ్చారు. అలాగే వివాదాస్పద భూముల పంచాయతీలు మొదలు పెట్టారు. విలువైన భూముల రికార్డులు లేవు. వాటిపై కఠినంగా ఉన్న జాయింట్‌ కలెక్టర్‌ శివశంకర్‌ను ఆగమేఘాలపై తప్పించి అక్కడే కింది పోస్టుకు మార్చి అవమానించారు. ఆ పోస్టులో తమకు అనుకూలమైన వేణుగోపాలరెడ్డిని నియమించుకున్నారు. ఈ హడావిడీ బదిలీ వారం రోజుల కిందటే చేశారు. ఇలా చేయడాన్ని సీనియర్‌ ఐఏఎస్‌లు కూడా తప్పుబడుతున్నారు. అయినా జగన్‌రెడ్డి పట్టించుకోవడం లేదు. ఇక అక్కడ పులివెందుల పంచాయతీలు మొదలవుతాయి’’ అని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.

అయితే గతంలో పవన్ కళ్యాణ్ రాజధాని విషయంలో అనేక రకాలుగా మాట్లాడారు.. రాజధాని రైతుల గురించి ఒకసారి మాట్లాడుతూ ఎక్కడైనా ఊరు ఉన్నచోట రోడ్లు వేయాలని కానీ అమరావతిలో రోడ్లు వేయడం కోసం ఊర్లు కాళీ చేయిస్తున్నారన్నారు. ఇంకోసారి అమరావతికి నిర్మాణానికి తాను వ్యతిరేకం కాదని కానీ అన్ని వేల ఎకరాల భూములు తీసుకోవడం కరెక్ట్ కాదన్నారు. మరోసారి అమరావతి రైతుల ఉసురుతో రాజధాని కట్టొద్దన్నారు. మరో సందర్భంలో రైతులకు అన్యాయం చేయాలని చూస్తే తాను తిరగబడి పోరాటం చేస్తానన్నారు. కొద్దికాలం క్రితం కర్నూలులో పర్యటిస్తూ.. ఏమో మీకు అమరావతి రాజధానిలా కనిపిస్తుందేమో కానీ నా మనసుకు కర్నూలే రాజధాని అన్నారు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే కచ్చితంగా కర్నూలులో రాజధాని పెడతామన్నారు. ఈ విధంగా వివిధ సందర్భాల్లో రాజకీయంగా మాటలు మార్చినట్టుగా, నిలకడలేని వ్యాఖ్యలు చేసినట్టుగానే మాట్లాడిన జనసేనాని ఇప్పుడు రాజధానిపైనా ఆ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు. పవన్ సలహాలు, ప్రభుత్వంపై ఆయన చేసే విమర్శలు ఎంతవరకూ ప్రభావం చూపుతాయో వేచి చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి