iDreamPost

కరోనా కారణంగా ఒక్కరోజులో 2003 మరణాలు

కరోనా కారణంగా ఒక్కరోజులో 2003 మరణాలు

ఒక్కరోజులో 10974 పాజిటివ్ కేసులు

కరోనా వైరస్ ప్రస్తుతం దేశాన్ని వణికిస్తోంది.. గతంలో ఎన్నడూ లేనివిధంగా వైరస్ ఉధృతి రోజు రోజుకీ తీవ్రంగా పెరుగుతుంది. రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గత కొన్ని రోజులుగా రోజుకి 10 వేలకు పైగా కేసులు, 300 పైగా మరణాలు సంభవించడం నిత్యంగా మారింది. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 2003 మరణాలు సంభవించాయి. ఇప్పటివరకూ ఈ స్థాయిలో మరణాలు బయట పడటం ఇదే మొదటిసారి. 10974 పాజిటివ్ కేసులు నిర్దారణ కాగా, 2003 మరణాలు సంభవించాయి. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 3,43,091 కి చేరింది.  అంతేకాకుండా మరణాల సంఖ్య 11903 కు చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది.  ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న దేశాల్లో భారత్ నాలుగవ స్థానంలో కొనసాగుతోంది.  కరోనా వైరస్ బారినుండి 1,86,934గా మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. 1,55,227 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. డెత్ రేటు 2.9 శాతం నుంచి 3.4 శాతానికి పెరగడం గ‌మ‌నార్హం.

మహారాష్ట్రలో 1409 కరోనా మరణాల నమోదు

మహారాష్ట్రలో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట పడేలా లేదు. మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజులోనే 2701 పాజిటివ్ కేసులు నిర్దారణ అయ్యాయి. అత్యధిక పాజిటివ్ కేసులతో పాటుగా అత్యధిక మరణాలు కూడా మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో ఇప్పటివరకు 1,13,445 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్దారణ అయ్యాయి.నిన్న ఒక్కరోజులో 1409 మరణాలు సంభవించాయి. కరోనా కారణంగా ఇప్పటివరకు మహారాష్ట్రలో 5537 మంది మృత్యువాతపడ్డారని మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఒక్క ముంబయి నగరంలోనే కరోనా బాధితుల సంఖ్య 60,228 మంది ఉండటం అక్కడి తీవ్రతను తెలియజేస్తుంది. 3,167 మంది ప్రాణాలు కోల్పోయారు.

తెలంగాణలో నిన్న కొత్తగా అత్యధికంగా 213 మందికి కరోనా నిర్దారణ అయ్యింది. తెలంగాణలో ఇప్పటివరకు 5406 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2188 మంది హాస్పిటల్స్ లో చికిత్స పొందుతుండగా 3027 మంది కరోనా బారినుండి కోలుకున్నారు. 191 మంది మృత్యువాత పడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న 264 కొత్త  కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ లో 6720 మందికి కరోనా సోకగా 88 మంది మృత్యువాత పడ్డారు. 3513 మంది వ్యాధి నుండి కోలుకుని రికవర్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3119 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా 8,264,468 మందికి కోవిడ్ 19 సోకగా 446,135 మంది కరోనా మహమ్మారి బారిన పడి మృతిచెందారు. 4,321,498 మంది వైరస్ నుండి కోలుకున్నారు..కాగా కరోనా వైరస్ కారణంగా అమెరికా అతిపెద్ద బాధిత దేశంగా ఉంది. అమెరికాలో సుమారు 2,208,400 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా తేలగా 119,132 మంది మరణించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి