iDreamPost

హృదయాలు గెలిచిన అల్లరి ‘యువకుడు’

హృదయాలు గెలిచిన అల్లరి ‘యువకుడు’

2000 సంవత్సరం. సుమంత్ కది రెండో సినిమా. డెబ్యు మూవీ ప్రేమకథ ఫ్లాపయ్యింది. రామ్ గోపాల్ వర్మ మ్యూజికల్ గా మెప్పించాడు కాని కంటెంట్ మాత్రం ప్రేక్షకుల తిరస్కారానికి గురయ్యింది. అందుకేB ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఫెయిలవ్వకూడదని అప్పటికే పవన్ కళ్యాణ్ తొలిప్రేమతో మొదటి చిత్రంతోనే సెన్సేషన్ సృష్టించిన కరుణాకరన్ ని రంగంలోకి దించారు నాగార్జున. అతనికి పెద్ద స్టార్ల నుంచి ఆఫర్లు వేచి చూస్తున్నాయి. అయినా యువకుడు కథకి ఫ్రెష్ గా కనిపించడంతో పాటు అందం టాలెంట్ ఉన్న సుమంత్ ని రైట్ ఛాయస్ గా అనుకున్నాడు. అలా అక్కినేని నాగేశ్వర్ రావు గారి క్లాప్ తో సినిమా మొదలైంది.

కథ పరంగా యువకుడిలో ఎలాంటి లోపాలు కనిపించవు. శివ(సుమంత్) అనే యువకుడు ఆర్మీలో చేరాలనే లక్ష్యంతో ఉంటాడు. కాని అదే ఉద్యోగం చేస్తూ ప్రాణాలు కోల్పోయిన భర్తను తలుచుకుని శివ తల్లి (జయసుధ)అందుకు ఏ మాత్రం అంగీకరించదు. కాని శివ ఆమెకు తెలియకుండా తన ప్రయత్నాలు సిన్సియర్ గా చేస్తుంటాడు. వ్యాపారం తప్ప ఇంకేది పట్టని నాన్న ప్రేమను నోచుకోలేని సింధు(భూమిక)తో శివ పరిచయం గొడవతో మొదలవుతుంది. కాని సింధు అనుకోకుండా శివ అమ్మకు బాగా దగ్గరవుతుంది. అనూహ్య పరిస్థితిలో శివ, సింధులు పెళ్లి చేసుకుంటారు. తర్వాత శివకు ఆర్మీ నుంచి పిలుపు వస్తుంది. ఎవరి మనసు నొప్పించకుండా అతను ఏం చేశాడనేదే క్లైమాక్స్

యువకుడులో అన్ని అంశాలు ఉన్నాయి. కావలసినంత కామెడీ, చక్కని ఎమోషన్, తల్లి కొడుకుల మధ్య అందమైన భావోద్వేగాలు, మణిశర్మ హృద్యమైన సంగీతం, హాయినిచ్చే పాటలు, సీనియర్లతో కూడిన క్యాస్టింగ్ ఒకటేమిటి అన్ని సమపాళ్లలో కూర్చాడు కరుణాకరన్. అయితే పెద్ద పేక మేడను చిన్న వేలితో కూల్చేసినట్టు ప్రీ క్లైమాక్స్ తో మొదలుపెట్టిన ఆర్మీ ఎపిసోడ్ అప్పటిదాకా నడించిన ఫ్లోకి అడ్డం పడి ఫీల్ ని పూర్తిగా తగ్గించేసింది. దీన్ని మినహాయిస్తే యువకుడు ఒక మంచి ఎంటర్ టైనర్ గా చెప్పొచ్చు. ప్రభుత్వ ఉద్యోగాల గురించి ఆలీ చెప్పే డైలాగ్ ఆ టైంలో ఓ రేంజ్ లో పేలింది. కోట శ్రీనివాసరావు, వేణు మాధవ్, తదితరులు కామెడీ ట్రాక్ ని బాగా నడిపించారు. మణిశర్మ మార్కు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఒక హై లైట్ గా చెప్పారు. భూమిక ఇంట్రో సీన్లోనే ఆయన పనితనం తెలిసిపోతుంది. కరుణాకరన్ పొయెటిక్ థింకింగ్ ని కూడా ఆ సీన్ లో చూడొచ్చు.

యువకుడు ఒకరకంగా చెప్పాలంటే ప్రేమకథ స్థాయిలో నిరాశపరచనప్పటికీ ప్రేమ, ఎమోషన్ మధ్యలో ఆర్మీ అనే బాధ్యతను ఇరికించడంతో జస్ట్ యావరేజ్ గానే మిగిలిపోయింది. మరీ బోర్ కొట్టించకుండా సాగిన నెరేషన్ అభిమానులను సంతృప్తి పరిచినప్పటికీ మోతాదుకు మించిన సెకండ్ హాఫ్ సెంటిమెంట్ తో పాటు శివ సింధుల క్లాష్ తో ప్రేక్షకులు పూర్తి స్థాయిలో కనెక్ట్ కాలేకపోయారు. నటీనటులు మరియు టెక్నీషియన్స్ పెర్ఫార్మన్స్ తో పాటు కరుణాకరన్ సెన్సిబిలిటీస్ యువకుడుని బ్యాడ్ క్యాటగిరీలో పడకుండా కాపాడాయి. లేదంటే డ్యామేజ్ ఇంకా ఎక్కువే అయ్యుండేది. అందుకే ఓ మోస్తరు ఫలితంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సుమంత్ లోని నటుడిని పరిచయం చేయడంలో మాత్రం కరుణాకరన్ సక్సెస్ అయ్యాడు. అంతేకాదు భూమిక రూపంలో పరిచయం చేసిన హోమ్లీ బ్యూటీ ఆ తర్వాత టాలీవుడ్ స్టార్ల వరుసగా సినిమాలు చేసే స్థాయికి ఎదిగింది. అందుకే కొన్ని కారణాల వల్ల యువకుడుని అక్కినేని ఫ్యాన్స్ స్పెషల్ మూవీగా భావిస్తారు. ఈ రోజుతో ఇది 20 ఏళ్ళు పూర్తి చేసుకుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి