iDreamPost

ఒకే రోజు విడుదల : 2 వంద రోజులు – Nostalgia

ఒకే రోజు విడుదల : 2 వంద రోజులు – Nostalgia

ప్రస్తుతం ఒక స్టార్ హీరో సినిమా ఏడాదికి ఒకటి విడుదల కావడమే పెద్ద ఫీట్ అనుకుంటున్నాం కానీ ఒకవేళ ఒకే రోజు ఒకే హీరో రెండు సినిమాలు రిలీజై అవి రెండూ శతదినోత్సవాలు జరుపుకోవడాన్ని ఏమంటాం. నమ్మలేం అంటాం కదా. కానీ ఇది జరిగింది. స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి రెండు భారీ చిత్రాలు 1961లో మే 5న ఒకే రోజు విడుదలయ్యాయి. మొదటిది సతీ సులోచన. ఎన్టీఆర్, అంజలిదేవి హీరో హీరొయిన్లుగా ఎస్వి రంగారావు మరో ప్రధాన పాత్రలో రూపొందిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. సతీ టైటిల్స్ తో వచ్చే సినిమాలకు మంచి ఆదరణ దక్కుతున్న టైం అది.

దీన్నే 1976లో ఇంద్రజిత్ పేరుతో రీ రిలీజ్ చేస్తే అప్పుడూ మంచి వసూళ్లు దక్కించుకోవడం విశేషం. పోస్టర్లలో ఇంద్రజిత్ పక్కన బ్రాకెట్లో సతీ సులోచన అని ప్రింట్ చేసేవాళ్ళు. యుట్యూబ్ ప్రింట్స్ లో మాత్రం ఇంద్రజిత్ అనే ఉంటుంది. దీనికి దర్శకుడు ఎస్ రజినీకాంత్. రెండోది 1961 మే 5నే విడుదలైన ఎన్టీఆర్, దేవిక నటించిన పెండ్లి పిలుపు. ఆమంచర్ల శేషగిరిరావు డైరెక్టర్.అప్పటికే ఎన్టీఆర్ స్టార్ హీరోగా వెలుగొందుతున్నారు. తప్పని సరి పరిస్థితుల్లో రెండు ఒకే డేట్ కి రిలీజ్ చేయాల్సి వచ్చింది. సతీ సులోచన సూపర్ హిట్టయ్యి 6 కేంద్రాల్లో వంద రోజులు ఆడితే పెండ్లి పిలుపు కూడా 2 సెంటర్స్ లో హండ్రెడ్ డేస్ పూర్తి చేసుకుంది. రెండు కామన్ గా శతదినోత్సవం చేసుకున్న ఊళ్లు విజయవాడ, రాజమండ్రి కావడం గమనార్హం.

ఇలాంటి ఫీట్ మరే హీరోకు అప్పట్లో సాధ్యపడలేదు. రెండు రిలీజైతే రెండూ విజయం సాధించడం అరుదనే చెప్పాలి. తర్వాత ఎన్టీఆర్ వారసుడు బాలకృష్ణ, నానిల సినిమాలు కూడా ఇదే తరహాలో ఒకే రోజు రెండు సినిమాలు విడుదల చేసుకున్నారు కాని వాటిలో ఒకటి హిట్టు రెండోది ఫ్లాపు ఉన్నాయి. బాలయ్య సేమ్ డే రిలీజ్ సినిమాలకు సంబంధించి వేరే ముచ్చట్లు ఉన్నాయి కాని అవి ఇంకో సందర్భంలో చెప్పుకుందాం. ఇలా ఒకే హీరో సినిమాలు రెండు ఒకే రోజు విడుదల కావడం మాత్రం విశేషమనే చెప్పాలి. అందులోనూ ఇవి సోలో హీరోగా ఎన్టీఆర్ నటించిన చిత్రాలు. ఇప్పుడు చూస్తే ఇప్పటి తరం హీరోలకు మార్కెట్ దృష్ట్యా కథల కొరత కారణంగా సంవత్సరానికి ఒక సినిమా చేయడమే గగనమైపోయింది. అందుకే అప్పటి రోజులే వేరు అంటారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి