iDreamPost

1990 Sankranthi : ఎన్నో ట్విస్టులున్న 1990 జనవరి – Nostalgia

1990 Sankranthi : ఎన్నో ట్విస్టులున్న 1990 జనవరి – Nostalgia

ఒకే హీరోతో ఇంకో స్టార్ పోటీపడటం సహజమే కానీ తనతో తనే క్లాష్ అయ్యే సందర్భాలు అరుదుగా వస్తుంటాయి. బాలకృష్ణ-నానిలు ఈ ఫీట్ సాధించడం మనకు గుర్తే కానీ ఒక్క రోజు గ్యాప్ లో సుమన్ కూ ఈ ఘనత దక్కింది. అదేంటో చూద్దాం. 1990 సంక్రాంతికి సుమన్ రెండు సినిమాలు రిలీజ్ కు రెడీ అయ్యాయి. ఎవరూ వెనక్కు తగ్గే పరిస్థితి లేకపోవడంతో సెల్ఫ్ కాంపిటీషన్ తప్పలేదు. ఆ టైంకి తనకు మంచి మార్కెట్ నడుస్తోంది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ‘రావుగారింట్లో రౌడీ’ జనవరి 12న విడుదల కాగా సత్యారెడ్డి డైరెక్షన్ లో తీసిన ‘కొండవీటి రౌడీ’ మరుసటి రోజు అంటే 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండూ కమర్షియల్ ఎంటర్ టైనర్లే.

ఇది అభిమానులు ఊహించనిది. అయితే రావుగారింట్లో రౌడీలో అక్కినేని నాగేశ్వరరావు-వాణిశ్రీ కాంబినేషన్ ఉండటం, అంకుశం లాంటి బ్లాక్ బస్టర్స్ తో టాప్ రేంజ్ లో ఉన్న కోడి రామకృష్ణ డైరెక్టర్ కావడంతో మంచి ఓపెనింగ్స్ దక్కాయి. స్పందన కూడా దీనికే బాగా వచ్చింది. మాస్ కంటెంట్ తో ఆడియన్స్ ని మెప్పిస్తారని పేరున్న సత్యారెడ్డి కొండవీటి రౌడీతో అంత మేజిక్ చేయలేకపోయారు. ఫలితంగా ఇది ఫ్లాప్ అయ్యింది. బడ్జెట్ లెక్కలో మాత్రం దీనికే ఎక్కువ ఖర్చు కావడం గమనార్హం. రెండు టైటిల్స్ లో రౌడీ ఉండటం కాకతాళీయం కాగా రెండు సినిమాలకూ సంగీత దర్శకులు రాజ్ కోటినే కావడం మరో యాదృచ్చికం. ఫలితాలు మాత్రం వేరే వచ్చాయి.

అదే నెలలో 12న బాలకృష్ణ ‘ప్రాణానికి ప్రాణం’ వచ్చి ఉహించని విధంగా డిజాస్టర్ అయ్యింది.అదే రోజు అసలెలాంటి అంచనాలు లేకుండా తీసిన ఉషాకిరణ్ మూవీస్ ‘జడ్జ్ మెంట్’ హిట్ కావడం మరో ట్విస్ట్ సూపర్ స్టార్ కృష్ణ ‘ఇన్స్ పెక్టర్ రుద్ర’ కూడా రేస్ లో ఉంది కానీ అవుట్ డేటెడ్ ట్రీట్మెంట్ ని జనం తిరస్కరించారు. కె బాలచందర్ డబ్బింగ్ మూవీ ‘భార్యలు జాగ్రత్త’ చాలా కేంద్రాల్లో మంచి స్పందన దక్కించుకుంది. మొత్తానికి 1990 జనవరి ఫస్ట్ హాఫ్ ఇలా చాలా ఆసక్తికరమైన విశేషాలతో సాగింది. ఆ నెలలో చిరంజీవి, నాగార్జున సినిమాలు రిలీజ్ కాలేదు. రజినీకాంత్ టైగర్ శివ, కృష్ణంరాజు గురుశిష్యులు రెండూ ఫ్లాప్ కొట్టాయి

Also Read : Suryavamsam : ద్విపాత్రల్లో వెంకటేష్ విశ్వరూపం – Nostalgia

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి