iDreamPost

రవితేజ మార్కు విక్రమార్కుడి విశ్వరూపం

రవితేజ మార్కు విక్రమార్కుడి విశ్వరూపం

సాధారణంగా డ్యూయల్ రోల్ సినిమాల్లో హీరో వేసిన పాత్రల మధ్య రక్త సంబంధం ఉంటుంది. అలనాటి రాముడు భీముడుతో మొదలుపెట్టి జూనియర్ ఎన్టీఆర్ అదుర్స్ దాకా చూసుకుంటే ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. నాగార్జున హలో బ్రదర్ చూసినా బాలకృష్ణ అపూర్వ సహోదరులు చూసుకున్నా ఇదే తీరు. అయితే మినహాయింపులుగా నిలిచినవి లేకపోలేదు. కమల్ హాసన్ ఇంద్రుడు చంద్రుడు, చిరంజీవి రౌడీ అల్లుడు కొన్ని ఉదాహరణలు.

అధిక శాతం మాత్రం బ్లడ్ రిలేషన్ కాన్సెప్ట్ తో రూపొందినవే. అన్నింటిలోనూ ఒక కామన్ పాయింట్ ని గమనించవచ్చు. ఒక పాత్ర సాత్వికంగా మంచిగా ఉంటే రెండోది మాస్ గా సై అంటే సై అనేలా ఉంటుంది. కాని అలా కాకుండా రెండూ మాస్ కి కిక్ ఇచ్చేలా చేస్తే. ఆ ఆలోచనే కాబోలు కథకులు విజయేంద్ర ప్రసాద్ గారితో విక్రమార్కుడుని రాయించింది. రాజమౌళిలోని పూర్తి స్థాయి మాస్ దర్శకుడిని బయటికి తీసుకొచ్చేలా చేసింది. రవితేజ ఎనర్జీని పూర్తిగా వాడుకునేలా ప్రేరేపించింది. అదే విక్రమార్కుడు.

2006. అప్పటికి రవితేజ గ్రాఫ్ మంచి ఊపుమీదుంది . వెంకీ, భద్ర లాంటి విజయాలు క్లాసు మాసు తేడా లేకుండా అన్నివర్గాల ఆడియన్స్ ని దగ్గర చేశాయి. రాజమౌళి ఛత్రపతి సక్సెస్ తో హుషారుగా ఉన్నారు. అయితే అందులో ఏదో వెలితి ఉంది. ప్రభాస్ ని నెవర్ బిఫోర్ తరహాలో చూపించినా సెకండ్ హాఫ్ లో ఏదో మిస్ అయ్యిందన్న లోటు అభిమానులు కూడా ఫీలయ్యారు. అందుకే విక్రమార్కుడులో అలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్త పడ్డారు.

ఎక్కడో మధ్యప్రదేశ్ లో చంబల్ అనే ఊరిలో అక్కడి రౌడీ రాజ్యానికి ఎదురీది నిలిచిన విక్రం సింగ్ రాథోడ్ అనే ఇన్స్ పెక్టర్ వాళ్ళ వల్ల ప్రాణాల మీదకు తెచ్చుకుని హైదరాబాద్ చేరుకుంటాడు. తనలాగే అచ్చుగుద్దినట్టు ఉన్న సత్తిబాబుని చూసి అతనికి తన గతం తెలిసేలా చేసి తన స్థానంలో చంబల్ వెళ్ళేలా ప్రేరేపించి కన్ను మూస్తాడు. ఇక ఆ తర్వాత చిల్లర దొంగ సత్తిబాబు ఖాకీ చొక్కా వేసుకుని విలన్ల భరతం ఎలా పట్టాడు అనేదే కథ.

విక్రమార్కుడులో ఉన్న బలం కథనం. ఒకరి స్థానంలో మరొకరు వెళ్ళడం అనే పాయింట్ లో ఎలాంటి నవ్యత లేదు. కాకపోతే పూర్తి విరుద్ధంగా తీర్చిదిద్దిన విక్రమ్ రాథోడ్, సత్తిబాబు పాత్రలకు రవితేజ ఎనర్జీ తోడవ్వడం దీన్ని ఇంకో స్థాయికి తీసుకెళ్లింది. ప్రీ ఇంటర్వెల్ దాకా సరదాగా చిన్న చిన్న మలుపులతో సాగించిన రాజమౌళి విశ్రాంతి కార్డు పడకముందు జరిగే ఫైట్ తో ఆడియన్స్ లో ఒక్కసారిగా ఫీవర్ అటెన్షన్ తీసుకొచ్చేస్తారు. అప్పటిదాకా ఎలాంటి హీరోయిజం కనపడక ఏదో అల్లరి వేషాలతో నెట్టుకొస్తున్న సత్తిబాబుని పక్కన పెట్టేసి విక్రమ్ సింగ్ రాథోడ్ అనే పవర్ హౌస్ ని పరిచయం చేసిన తీరు ఒక్కసారిగా ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తీసుకొచ్చేసింది.

ఇక చంబల్ లో కథ మొదలయ్యాక నిఖార్సైన ఖాకీ యూనిఫామ్ వేసుకున్న పోలీస్ డ్యూటీ చేస్తే ఎలా ఉంటుందో పవర్ ఫుల్ గా చూపించిన తీరుకి ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు. పెరేడ్ లో ప్రకాష్ రాజ్ కు తన కర్తవ్యం గురించి విక్రమ్ చెప్పే డైలాగ్స్, కొలీగ్ భార్యను విలన్ ఎత్తుకుపోయి మానభంగం చేస్తున్నాడని తెలుసుకుని ఒక్కడే జీపు వేసుకుని వెళ్లి మరీ ఆమెను తీసుకొచ్చే ఎపిసోడ్ మాములుగా పేలలేదు. ప్రేక్షకులు వెర్రెక్కిపోయారు. ఎం రత్నం సంభాషణలకు మాస్ రాజా పవర్ తోడై థియేటర్లు ఈలలు గోలతో మారుమ్రోగిపోయాయి.

అనుష్క అందం పెద్ద ప్లస్ అయ్యింది. ఇప్పుడూ గ్లామర్ తో పడగొట్టే స్వీటీ 14 ఏళ్ళ క్రితం ఏ రేంజ్లో యువతకు కితకితలు పెట్టిందో వేరే చెప్పాలా. బావూజీగా నటించిన వినీత్ కుమార్, కొడుగ్గా చేసిన అమిత్ తివారి, ఇన్స్ పెక్టర్స్ గా చేసిన రాజీవ్ కనకాల, రితిక ఎవరికి వారు అందరూ విక్రమార్కుడికి దన్నుగా నిలిచారు. సత్తిబాబు ఫ్రెండ్ గా బ్రహ్మానందం చేసిన అల్లరి గురించి ఎంత చెప్పినా తక్కువే. టిట్లాగా అజయ్ ఎవరూ ఊహించని విలనీ చూపించి మెప్పించాడు.

కీరవాణి పాటలు సైతం రిపీట్ ఆడియన్స్ ని తీసుకొచ్చాయి. ముఖ్యంగా జింతాకు జితా జితా చాలా రోజులు యూత్ నోళ్ళలో నానుతూనే ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా కుదిరింది. విక్రం సింగ్ రాథోడ్ కు సెట్ చేసిన సిగ్నేచర్ బిజిఎం డిటిఎస్ సౌండ్ లో ఎంతగా ఎలివేట్ అయ్యిందో ఆ టైంలో థియేటర్లో చూసిన ఎవరిని అడిగినా చెబుతారు. ఇలా విక్రమార్కుడు వచ్చి పధ్నాలుగేళ్ళు అవుతున్నా దాని తాలుకు మేజిక్ వైబ్రేషన్స్ మాత్రం ఇంకా ప్రేక్షకుల మనసులో అలాగే భద్రంగా ఉన్నాయి. కాదనగలరా.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి