iDreamPost

ఫ్లాపుల నష్టాలు – అంతులేని కథలు..

ఫ్లాపుల నష్టాలు – అంతులేని కథలు..

లైగర్ పంచాయితీ వ్యవహారం పోలీసుల దాకా వెళ్ళాక దర్శకుడు పూరి జగన్నాధ్ కు సెక్యూరిటీని జారీ చేస్తూ ఉత్తర్వులు వచ్చేశాయి. తనను డిస్ట్రిబ్యూటర్లు ఫైనాన్సియర్లు బెదిరిస్తున్నారని ఆ కారణంగా భద్రత కల్పించాలని పూరి విన్నవించుకున్న ఇరవై నాలుగు గంటల్లోనే స్పందన రావడం గమనార్హం. మరోవైపు ఫిర్యాదులో అభియోగం మోపబడ్డ శోభన్ తాను గతంలో పూరికి ఎంతో సహాయం చేశానని, లైగర్ రిలీజైన రెండో రోజు నుంచే కాల్స్ లిఫ్ట్ చేయడం ఆపేయడం ఎంతవరకు న్యాయమని కొన్ని విషయాలు చెబుతున్నారు కానీ పూర్తి క్లారిటీ రావాలంటే పూరి ముంబై నుంచి హైదరాబాద్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే. అది ఎప్పుడో వెంటనే చెప్పలేం.

కాసేపు ఈ సంగతి పక్కనపెడితే నిజంగా ఒక డిజాస్టర్ వల్ల కలిగే నష్టాలకు బాధ్యత ఎవరిదనే ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టం. ఉదాహరణకు ఒక వస్తువు కొంటాం. అది మనకు నచ్చకపోతే మళ్ళీ ఆ బ్రాండ్ జోలికి వెళ్లకుండా జాగ్రత్త పడతాం. అంతేతప్ప బాలేదు కదాని కంపెనీని డబ్బు వెనక్కు ఇవ్వమంటే అది జరిగే పని కాదు. సినిమా బిజినెస్ అనేది ఈ సూత్రానికి అనుగుణంగా జరిగేది కాకపోయినా రిస్క్ కు సిద్ధపడే ప్రతి డిస్ట్రిబ్యూటర్ డబ్బులు కడతాడు. అదృష్టం బాగుందా హిట్టు కొట్టి సొమ్ములు వర్షంలా కురుస్తాయి. తేడా కొట్టిందా అంతకంతా నీటిబుడగలా పేలిపోయి తడిగుడ్డ నెత్తి మీద వేసుకోవాల్సి ఉంటుంది. ఇది దశాబ్దాలుగా జరుగుతున్నదే.

ఎక్కడి దాకో ఎందుకు కాంతార 15 కోట్లకు పైగా తెలుగులోనే వస్తుందని ముందే ఊహించి ఉంటే కేవలం రెండు కోట్లకు అమ్మేవాళ్ళు కాదు. గీతా ఆర్ట్స్ పది పర్సెంట్ కమిషన్ కాకుండా అవుట్ రైట్ గా కోనేసేది. కానీ ఆ ఫలితం ముందుగా తెలియదు. లైగర్ ని పంపిణిదారులకు ప్రీమియర్ వేసుంటే తొంబై కోట్ల వ్యాపారం సాధ్యమయ్యేనా. బాబా, అజ్ఞాతవాసి పోయినప్పుడు రజనీకాంత్, పవన్ కళ్యాణ్ లు ఎంతో కొంత నష్టాన్ని భర్తీ చేసేందుకు డబ్బులు వెనక్కిచ్చారు. కానీ ప్రతి డిజాస్టర్ కు ఇలా కావాలంటే అయ్యే పని కాదు. లీగల్ గా వెళ్లినా వెళ్లకపోయినా ఇవన్నీ అంత తేలిగ్గా సమిసే వివాదాలు కాదు. డీల్ కుదుర్చుకునే సమయంలోనే అన్నిటికి సిద్ధపడాలి లేదా బేరమాడాలి. అంతే తప్ప అంతా అయిపోయాక భోరుమంటే చేయడానికి ఏమీ ఉండదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి