iDreamPost

ఆ రాష్ట్రాల్లో ముందే బేర‌సారాలు.. కార‌ణం ఇదే..!

ఆ రాష్ట్రాల్లో ముందే బేర‌సారాలు.. కార‌ణం ఇదే..!

ఐదు రాష్ట్రాల ఫలితాలకు ముందే బేరసారాలకు తెరలేచింది. ఉత్తరాఖండ్‌, గోవా, మణిపూర్‌ రాష్ట్రాల్లో హంగ్‌ అసెంబ్లీ ఏర్పడుతుందన్న వార్తల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ అప్రమత్తమైంది. తమ ఎమ్మెల్యేలను బీజేపీ నేతల ప్రలోభాల నుంచి కాపాడుకునేందుకు కాంగ్రెస్‌ నేతలు చర్యలు చేపట్టారు. ఉత్తరాఖండ్‌లోని 70 సీట్లలో బీజేపీ, కాంగ్రెస్
మధ్య హోరాహోరీ పోరు జరుగుతుందని ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. బీజేపీ తరపున బేరసారాలు నడిపేందుకు మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ నేత కైలాష్‌ విజయ వర్గీయ డెహ్రాడూన్‌ వచ్చారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ నేతలు అప్రమత్తమయ్యారు. గోవాలోనూ బీజేపీ, కాంగ్రెస్‌ సమానంగా సీట్లు తెచ్చుకుంటాయని ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకటించాయి.

ఉత్తరాఖండ్‌కు చెందిన తమ ఎమ్మెల్యేలను ఛత్తీస్‌గఢ్‌లోని రాయపూర్‌లో రిసార్ట్‌కు తరలించాలని, గోవా ఎమ్మెల్యేలను మరో రాష్ట్రానికి తరలించాలని కాంగ్రెస్‌ నేతలు నిర్ణయించారు. ఉత్తరాఖండ్‌కు చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను రాయపూర్‌లో కాపాడే బాధ్యతను ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేష్‌ బాఘేల్‌కు అప్పగించారు. గోవా ఎమ్మెల్యేలను తొలుత స్థానిక హోటల్‌లో ఉంచి, తర్వాత మరో రాష్ట్రానికి తరలించే బాధ్యతను కర్ణాటకకు చెందిన కాంగ్రెస్‌ నేత డీకే శివకుమార్‌కు అప్పగించారు. మణిపూర్‌లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను కాపాడుకునే బాధ్యతను మరో కాంగ్రెస్‌ నేత టీఎస్‌ సింగ్‌దేవ్‌ పర్యవేక్షిస్తున్నారు. గోవా, మణిపూర్‌ రాష్ట్రాల్లో ప్రభుత్వ ఏర్పాటులో ఆప్‌, టీఎంసీ కీలక పాత్ర పోషించే అవకాశాలున్నాయి.

పార్టీకి నిబద్ధతతో ఉంటామని.. ఫిరాయించబోమని అభ్యర్థులతో ఒట్టు వేయించిన ఆ పార్టీ.. వారు దానికి కట్టుబడి ఉంటారని విశ్వసించడం లేదు. తమ ఎమ్మెల్యేలు బీజేపీ వలలో పడకుండా చూసుకునేందుకు, చిన్న చిన్న పార్టీలతో పొత్తులపై తక్షణ నిర్ణయాలు తీసుకోవడానికి సీనియర్‌ నేతలను అక్కడకు తరలించింది. క్యాంపు రాజకీయాల్లో నిష్ణాతుడైన కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ను గోవాకు పంపింది. అక్కడి పార్టీ ఇన్‌చార్జి పి.చిదంబరానికి ఆయన సహాయపడతారు.

ఉత్తరాఖండ్‌కు ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ బఘేల్‌, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి మోహన్‌ ప్రకాశ్‌, హర్యాణా కాంగ్రెస్‌ నేత దీపీందర్‌ హూడా, కర్ణాటక మాజీ మంత్రి ఎంబీ పాటిల్‌లను పంపారు. మణిపూర్‌లో ఎమ్మెల్యేలను కాచుకునేందుకు సీనియర్‌ నేతలు జైరాం రమేశ్‌, ముకుల్‌ వాస్నిక్‌, గౌరవ్‌ గొగోయ్‌, విన్సెంట్‌పాలా, ఛత్తీస్‌గఢ్‌ మంత్రి టీఎస్‌ సింగ్‌దేవ్‌ ఇప్పటికే తరలివెళ్లారు. గత ఎన్నికల్లో 60 మంది సభ్యుల రాష్ట్ర అసెంబ్లీలో 28 చోట్ల గెలిచి కాంగ్రెసే అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే 21 సీట్లే గెలిచిన బీజేపీ.. ఇతర పార్టీల మద్దతుతో గద్దెనెక్కింది. కాంగ్రెస్‌లో పలుసార్లు చీలికలు తెచ్చింది. ఈ రాష్ట్రంలో గత ఐదేళ్లలో సగంమంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బీజేపీలోకి ఫిరాయించడం గమనార్హం.

పంజాబ్‌లో పీసీసీ అధ్యక్షుడు సిద్దూ, సీఎం చన్నీ నడుమ అంతర్గత పోరు కారణంగా కాంగ్రెస్‌ పరాజయం ఖాయమని, అక్కడ ఆప్‌ అధికారంలోకి రానుందని ప్రతి సర్వే చెబుతోంది. అయితే హంగ్‌ వచ్చే అవకాశాలూ లేకపోలేదని కాంగ్రెస్‌ భావిస్తోంది. ఆ పరిస్థితుల్లో ఇతర పార్టీలతో తక్షణ మంతనాలకు హర్యాణా మాజీ సీఎం భూపీందర్‌ హూడా, అజయ్‌ మాకెన్‌లను తరలించింది. వారు మంగళవారం రాత్రి కాంగ్రెస్‌ అభ్యర్థులతో విందు భేటీ కూడా నిర్వహించారు. కాగా.. గోవాలో ఎమ్మెల్యే అభ్యర్థులకు మరింత రక్షణ కల్పించామని చిదంబరం వెల్లడించారు. వారిని రిసార్టుకు తరలించామన్న వార్తలను తోసిపుచ్చారు. ఎన్నికలను దొంగిలించే పార్టీ (బీజేపీ) విషయంలో అప్రమత్తంగా ఉన్నామన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి